నారా లోకేష్‌ నుంచి నాకు ప్రాణహాని 

నాకు, నా కుటుంబానికి ఏం జరిగినా లోకేషే బాధ్యుడు

మాజీ మంత్రి జోగి రమేష్‌ ప్రకటన 

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి జోగి రమేష్‌ 

లోకేష్‌ ఆదేశాలతో కేశినేని చిన్ని నేతృత్వంలో మా ఇంటిపై దాడి

పోలీసుల సమక్షంలో వారి అండతోనే రెచ్చిపోయిన టీడీపీ గూండాలు

నిందితులను అరెస్ట్‌ చేయాలంటూ చంద్రబాబు సన్నాయి నొక్కులు

దాడి చేయించింది లోకేషే అని సీఎం చంద్రబాబుకి తెలియదా?  

నా దైవం తిరుమలేశుడు. నా నాయకుడు జగన్‌పై నిందలేస్తే చూస్తూ ఊరుకోవాలా?  

సూటిగా ప్రశ్నించిన జోగి రమేష్‌

దాడులతో బీసీలను వైయ‌స్ఆర్‌సీపీకి దూరం చేసే కుట్ర

ఏం జరిగినా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటా 

తేల్చి చెప్పిన మాజీ మంత్రి జోగి రమేష్‌ 

ఇబ్రహీంపట్నం:  భవిష్యత్తులో తనకు, తన కుటుంబానికి ఏ హాని జరిగినా దానికి మంత్రి నారా లోకేషే పూర్తి బాధ్యుడని, ఆదివారం తన ఇంటిపై జరిగిన దాడి కూడా లోకేష్‌ ఆదేశాలతోనే ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలోనే జరిగిందని మాజీ మంత్రి జోగి రమేష్‌ స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
    పోలీసుల అండతో వారి సమక్షంలోనే టీడీపీ గూండాలు పెట్రోల్‌ బాంబులతో దాడి చేసి తనని, తన కుటుంబాన్ని భౌతికంగా లేకుండా చేయాలన్న కుట్ర చేశారని జోగి రమేష్‌ వెల్లడించారు. తన దైవం తిరుమలేశుడు అని, తన నాయకుడు శ్రీ వైయస్‌ జగన్‌ అని చెప్పారు. మరి ఆ జగన్‌గారిపై నిందలేస్తే ఎలా ఊర్కుంటామని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులు నొక్కాలని చూస్తున్నారని, తమను ఎలా, ఎంత వేధించినా ఎక్కడా వెనక్కు తగ్గబోమని జోగి రమేష్‌ తేల్చి చెప్పారు.
మీడియాతో మాట్లాడిన ఆయన ఇంకా ఏమన్నారంటే..:

దాడులతో వైయ‌స్ఆర్‌సీపీని భయపెట్టలేరు:
    వరుస దాడులతో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను భయపెట్టాలని చూస్తున్నారు. కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ గూండాలను నా ఇంటి మీదకు పంపించి దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే జరిగిన ఈ దాడిని ప్రజాస్వామ్యంపై, వెనుకబడిన వర్గాల మీద జరిగిన దాడిగానే చూడాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఈ ప్రభుత్వం ఓర్వలేకపోతుంది. ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయని వణికిపోతున్నారు. జోగి రమేష్‌ లాంటి వెనుకబడిన తరగతులకు చెందిన నాయకులను కేసులతో బెదిరించి, దాడులతో భయపెట్టి, జైళ్లకు పంపి మానసికంగా వేధిస్తే వైయ‌స్ఆర్‌సీపీ తరఫున గొంతు వినిపించేందుకు ముందుకురారు అనేది వారి ఆలోచన. అందుకే ఇలాంటి భయోత్పాతం సష్టించారు. మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలతో ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్‌) కనుసన్నల్లో విజయవాడ నుంచి బ్లేడ్‌ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌ని రంగంలోకి దించి నా ఇంటిపై పెట్రోల్‌ బాంబులతో దాడి చేసి నిప్పంటించారు. నన్ను, నా కుటుంబ సభ్యులను బతికుండగానే సజీవ దహనం చేసే కుట్రకు ఈ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడలేదు.
    జగన్‌గారి ప్రోత్సాహంతో వైయ‌స్ఆర్‌సీపీలో బీసీలు ఎదుగుతుంటే చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నాడు. నేను తప్పు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేని అక్రమ కేసులో మూడు నెలలు జైలుకు పంపినా వారి కక్ష తీరలేదు. నెల్లూరు, విజయవాడ, మదనపల్లె జైళ్లలో అక్రమంగా నిర్బంధించి చంద్రబాబు, లోకేష్‌ రాక్షసానందం పొందారు. 

జంతువుల కొవ్వు కలిసిందని ఆధారాలు చూపించమన్నా:
    నేను ఏ తప్పూ చేయలేదని దుర్గమ్మ ఆలయంలో ప్రమాణానికి సిద్ధమని చెప్పాను. నార్కో అనాలిసిస్‌ టెస్టుకు సిద్ధమని సవాల్‌ చేశాను.  సీబీఐ ఎంక్వయిరీ అడిగాను. అవన్నీ చేయకుండా చేతిలో అధికారం ఉంది కదా అని అక్రమంగా నన్ను, నా కుమారుడిని, నా తమ్ముడిని జైలుకు పంపి ఇబ్బంది పెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే నా కొడుకుని అరెస్ట్‌ చేశారు. నేను జైలు నుంచి వచ్చాక వైయ‌స్ఆర్‌సీపీ తరఫున గళం వినిపిస్తుంటే చంద్రబాబుకి నచ్చడం లేదు.
    చివరకు నేను ఆరాధించే తిరుమల వెంకటేశుడి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తుంటే తట్టుకోలేకపోయాను. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని టీడీపీ ఫ్లెక్సీలు వేసి శ్రీవారి ప్రతిష్టను దిగజార్చుతుంటే మనసు కన్నీరు పెట్టింది. రాజకీయ లబ్ధి కోసం వైయస్‌ జగన్‌ గారి వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రలపై తిరగబడ్డాను. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని టీడీపీ చేస్తున్న ప్రచారానికి సిట్‌ చార్జిషీట్‌లో ఎక్కడ పేర్కొన్నదో చూపించకుండా కట్టుకథలతో వైయ‌స్ఆర్‌సీపీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా మేం చూస్తూ ఊరుకోవాలా?.
    మా నాయకుడి గురించి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేష్‌ సహా టీడీపీ నాయకులు బహిరంగంగా అసెంబ్లీలో కూడా పచ్చి బూతులు మాట్లాడితే సహించాలి, కానీ తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి నాయకుల తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ వారిని విమర్శిస్తే దాడులు చేస్తారా? లోకేష్‌కి చిప్‌ దొబ్బంది అని ప్రశ్నించడం తప్పా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం?. పక్కా ప్రణాళికతోనే ఇనుప రాడ్లు, కర్రలు, పెట్రోల్‌ బాంబులతో దాడులు చేశారు.
(అంటూ ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాలతో దాడులు చేసినట్టు ఫేస్‌ బుక్‌లో పెట్టిన పోస్టులు మీడియాకు చూపారు)
     డీసీపీ ఉన్నం రామకృష్ణ, సీఐ, ఇతర పోలీస్‌ సిబ్బంది సమక్షంలో వారి అండతోనే తెలుగుదేశం గూండాలు మా ఇంటిపై ఈ దాడులకు తెగబడ్డారు. మాకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు దాడులు చేసే వారికి ఎస్కార్టుగా నిలబడ్డారు. టీడీపీ గూండాల వికత చేష్టలను రాష్ట్ర ప్రజలంతా చూడాలి. చంద్రబాబు కూటమి దారుణాలను ప్రజలే ప్రశ్నించాలి. 

ఆధారాలు చూపిస్తున్నాం.. అరెస్టు చేయండి:
    మూడు నెలలపాటు జైల్లో అక్రమంగా నిర్బంధించిందే కాకుండా ఇప్పుడు ఏకంగా హత్యకు పూనుకున్నారు. వరుసపెట్టి అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్‌ ఆదేశాలతోనే మా ఇంటిపై దాడి జరిగిందని ఆధారాలు చూపిస్తుంటే ఇందులో పాల్గొన్న వారు స్పష్టంగా కనిపిస్తుంటే అరెస్ట్‌ చేసి చర్యలు తీసుకోకుండా.. నిందితులు ఎవర్నీ వదలొద్దూ అంటూ చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. రాబోయే రోజుల్లో నాపై ఎలాంటి దాడి జరిగినా, నాకు నా కుటుంబ సభ్యులకు ఏం జరిగినా అందుకు పూర్తి బాధ్యత నారా లోకేష్‌ దే. వైయ‌స్ఆర్‌సీపీ తరఫున బలంగా గొంతు వినిపిస్తున్న నన్ను భౌతికంగా లేకుండా చేయాలన్న లోకేష్‌ కుట్రలను ప్రజలు గమనించాలని ప్రార్థిస్తున్నా. అలాగని ఈ కేసులు, దాడులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు.
    నాకు వైయస్‌ జగన్‌ గారి సపోర్టు, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల బలం ఉన్నంత వరకు ఈ దాడులకు వణికిపోవడం జరగదు. రాబోయే వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో నా ఇంటిపై దాడి చేసిన ప్రతి ఒక్కర్నీ గుర్తించి చట్టపరంగా శిక్షించి తీరుతాం. చంద్రబాబు తప్పులకు వంతపాడే పోలీసులు ఆయన ఎప్పటికీ అధికారంలోనే ఉండరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
    మీడియా సమావేశంలో పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Back to Top