గుంటూరు: మంగళగిరి నియోజకవర్గంలోని చిన్న కాకానిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్న అంజుమన్ భూములను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు అక్కడ పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ..సుమారు రూ.2000 కోట్ల విలువైన అంజుమన్ భూములను ఐటీ హబ్ పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని నూరి ఫాతిమా ఆరోపించారు. ప్రైవేట్ వ్యక్తులకు లాంగ్ లీజ్ పేరుతో ఈ భూములను అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వ భూ దోపిడిపై న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దొంతి రెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ..అంజుమన్ భూముల వ్యవహారంలో కూటమి ప్రభుత్వ చర్యలు మైనార్టీ వర్గాల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ఆయన అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ.. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంజుమన్ భూముల జోలికి వెళ్లలేదని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఐటీ అభివృద్ధి పేరుతో భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని విమర్శించారు. అంజుమన్ భూములను స్వాధీనం చేసుకునే చర్యలకు ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.