రాష్ట్రంలో నియంతృత్వ పాలన

మా నేతల ఇళ్లపై దాడులే నిదర్శనం

బందిపోట్లకూ, వీళ్లకూ ఏమీ తేడా లేదు

చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ తప్పదు

సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరిక

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటికి పార్టీ నేతలతో కలిసి వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిన్న (ఆదివారం) జోగి రమేష్‌ ఇంటిపై టీడీపీ గుండాలు పెట్రోల్‌ బాంబులతో దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి ఘటన గురించి వివరాలు ఆరా తీసిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, జోగి రమేష్‌ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు.

మాజీ మంత్రులపై టీడీపీ విచ్చలవిడి దాడులు

మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోతున్న పోలీసులు

పరామర్శకు వెళ్తే తిరిగి మా నేతలపైనే కేసులు

టీడీపీగా రాజకీయ పార్టీగా ఉండే అర్హత లేదు

 సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ

బందిపోట్ల తరహాలో మా నేతల ఇళ్లపై దాడులు

పక్కా వ్యూహంతోనే దారుణాలు, అరాచకాలు

పోలీసులు దగ్గరుండి దాడులు చేయిస్తారా ?

ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా అనుమతించలేదు

తిరిగి జోగి రమేశ్‌ పై ఎదురు కేసులు

 సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపణ

దాడుల్ని ప్రజాస్వామ్యయుతంగానే ఎదుర్కొంటాం

కోర్టులతో పాటు జాతీయ స్ధాయికీ తీసుకెళ్తాం

అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తాం

దాడులతో మా నేతల మనోధైర్యం చెక్కుచెదరలేదు

తేల్చి చెప్పిన  సజ్జల రామకృష్ణారెడ్డి

ఇబ్రహీంపట్నం. ఎన్టీఆర్‌ జిల్లా: రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని, బందిపోట్ల తరహాలో వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఇళ్లలోకి చొరబడి టీడీపీ కార్యకర్తలు పోలీసుల సాయంతో దాడులు చేయడమే ఇందుకు నిదర్శనమని పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో నిన్న (ఆదివారం) టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేశ్‌ ఇంటిని పార్టీ నేతలతో కలిసి శ్రీ  సజ్జల రామకృష్ణారెడ్డి సందర్శించి, ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి దాడుల్ని ప్రజాస్వామ్యయుతంగానే ఎదుర్కొంటామని, అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చి తీరుతామని హెచ్చరించారు.
ప్రెస్‌మీట్‌లో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

నియంతృత్వ పాలనతో దాడులు:
    గత మూడు, నాలుగు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధ కలుగుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమంగా పరిగణించే భారత రాజ్యాంగం వ్యవస్థలకు ఇచ్చిన హక్కులు, పరిమితుల ప్రకారం రాజకీయ పార్టీలు సరిగా వ్యవహరిస్తేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఆ విశ్వాసమే ప్రజల్ని నిశ్చిత్తంగా ఉండేలా చూస్తుంది. రాష్ట్రంలో తాజా అది ఒక్కసారిగా కనుమరుగైనట్లయింది. గుంటూరులో మూడు, నాలుగు గంటల పాటు పోలీసులు మౌనప్రేక్షకులుగా వ్యవహరిస్తూ టీడీపీ గూండాలు, చంద్రబాబు, లోకేష్‌ పంపిన వ్యవస్థీకృత నేరగాళ్లు ఏం చేశారో అంతా చూశారు.
    ఎక్కడైనా ఓ గుంపు చేరితే చెల్లాచెదురు చేసే పోలీసులు.. అంబటి రాంబాబు ఇంటి దగ్గర గుంపుగా చేరి, పెట్రోల్‌ బాంబులు వేస్తుంటే దగ్గరుండి అంతా చేయించారు. పోలీసు ఉన్నతాధికారిని సంప్రదించి మా నాయకుడు అంబటి రాంబాబు ప్రాణాలకు హాని ఉందని, మా గుంటూరు ఇన్‌ఛార్జ్‌ ఫాతిమాతో పాటు ఇతర నాయకులు కూడా అక్కడే ఉన్నారని ఫోన్‌ చేసినా ఎత్తలేదు. మా ప్రభుత్వంలో హోం మంత్రిగా పని చేసిన సుచరిత, ఇతర నేతలు వ్యక్తిగతంగా వెళ్లి కలుద్దామని ప్రయత్నించినా గేటు లోపలికి రానివ్వకుండా అడ్డుకుని, 40 నిమిషాల తర్వాత అదనపు ఎస్పీ దగ్గరికి పంపారు. ఆ తర్వాత మా వాళ్లకే ఓపిక నశించి వెళ్లిపోయాక పోలీసులు ఆలస్యంగా స్పందించి మా నాయకుడు అంబటి రాంబాబును అరెస్టు చేసి రిమాండ్‌ కు కూడా పంపారు. 

దాడుల్ని అడ్డుకోకుండా పోలీసుల ప్రేక్షకపాత్ర:
    గుంటూరులో స్థానిక ఎమ్మెల్యే ఇంటికి అతి సమీపంలో ఉన్న అంబటి రాంబాబు ఇంటి దగ్గర పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. పోలీసుల్ని అడిగితే మా మీదే కేసులు పెట్టారు. పోలీసుల వద్దకు నేరుగా వెళ్తే మా నాయకులకు ఆటంకాలు కల్పించారు. దాడి చేసిన వారికి భద్రత కల్పించి, ఫిర్యాదు చేయడానికి వెళ్తే మా నాయకులకు లోపలికి అనుమతి ఇవ్వలేదు. జరిగిన ఘటనపై కావాల్సినన్ని వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. 
    ఇందులో రెండు రకాల వ్యక్తులున్నారు. టీడీపీ కార్యకర్తల పేరుతో కొంత మంది, తర్వాత రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులు ఉన్నారు. నిన్న మరో నాయకుడు జోగి రమేశ్‌ ఇంటి మీద పెట్రోల్‌ బాంబులు విసిరారు. పెట్రోల్‌ బాంబులతో రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చి జోగి రమేశ్‌ ఇంటిపై విసిరారు. ముందస్తు వ్యూహంతో కర్రలు, పెట్రోల్‌ బాంబులు తెచ్చారు. వీళ్లు విసిరిన పెట్రోల్‌ బాంబులతో మరింత విధ్వంసం జరగకుండా జోగి రమేశ్‌ ఇంటి గేటు చాలా వరకూ కాపాడింది. దాడి వల్ల ఇంట్లో ఉన్న ఎవరికైనా ప్రాణహాని కలిగితే ఎవరిది బాధ్యత ?, ఇలా వ్యవహరించే ఎవరికీ రాజకీయ పార్టీగా ఉండే అర్హత లేదు. కొంతైనా నిష్పాక్షికంగా పోలీసు వ్యవస్థ ప్రవర్తించాల్సింది.
    ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన వారి సాయంతో పోలీసు వ్యవస్థను నడుపుతున్నారని అర్థమవుతోంది. ఇది వ్యవసీకృతమైన, సెంట్రల్‌ కమాండ్‌ ఆదేశాలతో, అత్యంత సమన్వయంతో జరుగుతున్న అరాచకం ఇది. 

బందిపోట్లకూ, వీళ్లకు తేడా ఏంటి?:
    రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని మా పార్టీ మాజీ మంత్రుల మీద జరుగుతున్న దాడులు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కడో ఊరు బయట బందిపోట్లు వచ్చి దాడి చేశారంటే ఏదో అనుకోవచ్చు. కానీ నగరం నడిబొడ్డున, పోలీసుల సమక్షంలో, వారి మద్దతుతో, మా నేతల మీద ఎదురు కేసులు పెడుతూ సాగిస్తున్న అరాచకం ఇది. నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన మా నేతల్ని ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు కూడా చేశారు. దాడి జరిగిన జోగి రమేశ్‌ ఇంటికి ఇప్పటివరకూ పోలీసులు వచ్చి ఆధారాలు సేకరించిందీ లేదు, పంచనామా కూడా చేయలేదు. తిరిగి జోగి రమేశ్‌ మీద దుర్భాషలు ఆడారని కేసులు పెట్టారు. లోకేష్‌ కు బుర్ర పాడైందని చెప్పినా కేసులేనా, అంత అసహనం ఎందుకు ?, జోగి రమేష్‌ మీద నాన్‌ బెయిలబుల్‌ సహా మొత్తం నాలుగు కేసులు పెట్టారు. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగితే బాధితుడు ఎవరు అవుతారు? పూర్వకాలంలో బందిపోటు ముఠాల తరహాలో ఇళ్ల మీద పడి నేలమట్టం చేసిన దానికీ, దీనికీ తేడా ఏమీ లేదు. కేవలం పోలీసులు తమ చేతుల్లో ఉన్నారనే ధైర్యంతో ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారు. 

అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌:
    ఇలాంటి దాడుల్ని ప్రజాస్వామ్యయుతంగానే ఎదుర్కొంటాం. జాతీయ స్ధాయిలో మా గొంతు వినిపించే ప్రయత్నం చేస్తాం, ప్రజల్లోకి కూడా తీసుకెళ్లాలని నిర్ణయించాం. రాజకీయ ప్రత్యర్థులు మీ మీద వాడిన భాష మీద చట్టబద్ధంగా ఫిర్యాదులు చేయడానికి, కేసులు పెట్టడానికి అవకాశం ఉంది. అవేవీ కాదని నేరుగా దాడులకు పాల్పడటం, తిరిగి మా మీదే కేసులు పెట్టడం, పరామర్శలకు వెళ్లిన వారిని అరెస్టు చేయడాన్ని అందరూ ప్రశ్నించాలి. 
    తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పవిత్ర ప్రసాదం మీద చంద్రబాబు చేసిన ఛండాలపు ప్రచారం, జంతువుల కొవ్వు కలిసిందనే అబద్ధపు ప్రచారం సీబీఐ సిట్‌ ఇచ్చిన రిపోర్ట్, జాతీయ ల్యాబ్స్‌ ఇచ్చిన రిపోర్ట్స్‌ ఆధారంగా మేం ప్రశ్నించాం. అది భరించలేక మళ్లీ నెయ్యిలో కల్తీ ఉందనే అబద్ధపు ప్రచారం చేస్తూ జగన్మోహన్‌ రెడ్డి, కరుణాకర్‌ రెడ్డి, సుబ్బారెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీలు వేశారు. వాటిని తీసేయడానికి ప్రయత్నిస్తే కర్రలు, రాళ్లతో దాడులు చేయడం నుంచి వచ్చిన పరిణామాలే ఇవి. 
    చేసిన తప్పును కవర్‌ చేసుకోలేక, ప్రశ్నిస్తుంటే సహించలేక ఇలాంటి దాడులు చేస్తున్నారు. కోర్టులు, మీడియా, జనం దృష్టికి, జాతీయస్ధాయికి తీసుకెళ్తాం. కేంద్ర హోంశాఖ కార్యదర్శిని మా ఎంపీ కలవబోతున్నారు. జాతీయ మానవహక్కుల కమిషన్‌ ను కూడా ఆశ్రయిస్తాం. ఈ దాడులతో మా నేతలు ఎక్కడా చెక్కుచెదరలేదు. ప్రశ్నిస్తూనే ఉంటాం అనే కృత నిశ్చయంతో మా నేతలు ఉన్నారు. వారికి అంతటి మనోధైర్యం ఇవ్వగల నాయకత్వం జగన్మోహన్‌ రెడ్డి రూపంలో మాకు ఉంది.
    మీ గొయ్యి మీరు తవ్వుకోండి, మా మీద చేసే ప్రతీ దాడికీ రికార్డు ఉంటుంది. మేం అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చట్టబద్ధంగా చెల్లిస్తాం. ఊరిలో రౌడీల్ని, గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌ లతో దాడులు చేయించం. అన్ని రకాల కేసులు పెట్టి చట్టబద్ధంగానే తేల్చుకుంటాం. జరిగిన దానికి రిటర్న్‌ గిఫ్ట్‌ చంద్రబాబుకు కచ్చితంగా ఇస్తాం. చంద్రబాబు ఎన్ని అడ్డంకులు కల్పించినా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతూనే ఉంటామని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. 

    మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, తోట విశ్వరూప్, కారుమూరు నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, ముదునూరి ప్రసాదరాజు, కరణం ధర్మశ్రీ, అన్నాబత్తిన శివ, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్‌ రావుతో పాటు, పార్టీ నాయకులు దేవినేని అవినాష్, పి.గౌతంరెడ్డి, స్వామిదాస్, తన్నీరు నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు.

Back to Top