రాష్ట్రాన్ని ‘జంగిల్‌ రాజ్‌’ చేశారు

బాబు దుర్మార్గాలు జాతీయస్థాయిలో ఎండగడతాం

వైయ‌స్ఆర్‌సీపీ నేతల ప్రకటన

పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతల అత్యవసర సమావేశం. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ ఆదేశాల మేరకు అత్యవసరంగా సమావేశమైన అందుబాటులో ఉన్న సీనియర్‌ నేతలు. పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, మండలి విపక్షనేత శ్రీ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశం. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం, మరో మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై దాడిపై సమావేశంలో చర్చ.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయి

ప్రశ్నించే గొంతులు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు

అందుకే పార్టీ నేతల ఇళ్లపై దాడులు. విధ్వంసం

ఇలాంటి దాడులతో మమ్మల్ని భయపెట్టలేరు

రెట్టించిన ఉత్సాహంతో మేము, పార్టీ పని చేస్తాం

వైయ‌స్ఆర్‌సీపీ నేతల స్పష్టీకరణ

చంద్రబాబు దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

జాతీయస్థాయిలోనూ వివరించాలి. ఎండగట్టాలి

భక్తుల మనసులను చంద్రబాబు గాయపరిచారు

అందుకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి

తేల్చి చెప్పిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

తాడేపల్లి: రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌ చేశారని, చంద్రబాబు సర్కారు దుర్మార్గాలను జాతీయ స్థాయిలో తీసుకెళ్తామని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు అందుబాటులో ఉన్న సీనియర్‌ నేతలు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. పార్టీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటలు జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ ఇళ్లపై దాడులు, అంబటిపై హత్యాయత్నం ఘటనలపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ నేతలు ఏమన్నారంటే..:

కుప్పకూలిన శాంతిభద్రతలు:
    రాష్ట్రంలో శాంతి కప్పకూలిపోయాయి. రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిపోయింది. చంద్రబాబు దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో పరిణామాలను జాతీయ స్థాయిలోనూ వివరించాలి. ఎండగట్టాలి. తిరుమల శ్రీవారి భక్తుల మనసులను చంద్రబాబు గాయపర్చారు. ఇప్పటికీ తప్పులు సరిదిద్దుకోవడంలేదు. చంద్రబాబుకు ఏ మాత్రమైనా పాపభీతి ఉంటే, వెంటనే క్షమాపణణ చెప్పాలి.

ప్రశ్నిస్తే తట్టుకోవడం లేదు. అందుకే వరుస దాడులు:
    చంద్రబాబు తప్పులను ప్రశ్నిస్తున్నందుకు వైయ‌స్ఆర్‌సీపీపై మరోసారి కుట్ర చేశారు. మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు మాజీ మంత్రులు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై దాడులు చేశారు. అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారు. భయపెడితే తనను ఎవ్వరూ ప్రశ్నించరని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ, అది ఆయన అవివేకం. 

పోలీసు వ్యవస్థ నిర్వీర్యం:
    రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు పూర్తిగా దెబ్బతీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పూర్తిగా చెడిపోయింది. రక్షణ కోసం గంటల తరబడి ఫోన్లు చేసినా పోలీసు అధికారులు స్పందించడం లేదు. ఇక సామాన్యులకు ఏం రక్షణ కల్పిస్తారు? పైగా బాధితులపైనే కేసులు పెడుతున్నారు. అంబటి రాంబాబు ఇంటిపై ఆ స్థాయిలో దాడి జరిగినా, ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు.

సమావేశంలో ముఖ్యనేతలు ఎవరెవరు ఏమన్నారంటే..:

ఇంతటి దుర్మార్గాలు ఎప్పుడూ చూడలేదు: బొత్స సత్యనారాయణ.
– రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలు నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రాజకీయంగా ప్రశ్నించే వారిపై చంద్రబాబు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఎవరో ఏదో చేస్తారని భయపడే రోజులు లేవు. అలా భయపడేవారెవరూ ఇక్కడ లేరు. ప్రభుత్వ దుర్మార్గాలపై పార్టీ కార్యక్రమాలు చేపడతాం. పెట్రోలు బాంబులు వేయడం అనే విష సంస్కృతిని చంద్రబాబు మళ్లీ తెచ్చారు. ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం. తిరుమల లడ్డూపై చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు దేశమంతా తప్పుపడుతోంది. క్షమాపణ చెప్పకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ వైయస్సార్‌ సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. 

బాబు అరాచకాలు ఢిల్లీలో ఎండగడతాం: సజ్జల రామకృష్ణారెడ్డి
– అంబటి రాంబాబు ఇంటిపై విడతల వారీగా ఐదున్నర గంటల పాటు దాడులకు తెగబడ్డారంటే ఎంత దారుణంగా పోలీసులు వ్యవహరించారో అర్థం అవుతోంది. మరుసటి రోజే జోగి రమేష్‌ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే గంటల తరబడి దాడులు జరగడం శృతి మించిన అరాచకాలకు నిదర్శనం. లడ్డూ విషయంలో ప్రజలపై అబద్ధాలు రుద్దడంలో ఫెయిల్‌ కావడంతో, డైవర్షన్‌ కోసం ఇలా అడ్డదారిలో బరి తెగించారు. ఇవన్నీ ఢిల్లీలో ఎండగడతాం. కేంద్ర హోం శాఖ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ప్రభుత్వ దుర్మార్గాలపై పార్టీ నాయకులంతా ఒక్కటై పోరాడతారు.
విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడుపై దాడుల ఘటనల్లోనూ పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇవన్నీ కలిపి కోర్టుల్లో దావా వేస్తాం. ఇంకా విషయాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్చార్సీ) దృష్టికి కూడా తీసుకెళ్తాం. లడ్డూ విషయంలో చంద్రబాబు క్షమాపణచెప్పే వరకు వదిలిపెట్టేది లేదు. ఫ్లెక్సీలపై పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు రేపు (మంగళవారం) కూడా కొనసాగుతాయి. 

సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన బాబు.
: కారుమూరు నాగేశ్వరరావు.

– చంద్రబాబు మానవ హక్కులు హరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించి పోస్టర్లు వేస్తూ, జంతుకొవ్వు ఆరోపణలు నిజమని నమ్మించే కుట్రలు చేస్తున్నారు. 

తిట్టకపోయినా తిట్టారనే రకం చంద్రబాబు: గుడివాడ అమర్నాథ్‌
– అంబటి రాంబాబు పూజలు నిర్వహించి రోడ్డుపై వెళ్తుంటే టీడీపీ క్యాడర్‌ రెచ్చగొట్టిందని, ఇన్సిడెంట్‌లో అలా మాట్లాడకుండా ఉండాల్సిందని రాంబాబు ఒప్పుకున్నా టీడీపీ దౌర్జన్యం చేసింది. ఏమీ తిట్టకపోయినా తనను తిట్టారంటూ రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు.  

పక్కా ప్లాన్‌ ప్రకారమే దాడులు: పేర్ని నాని
– ప్రభుత్వంపై గట్టిగా ప్రశ్నించే వారు ఎప్పుడు దొరుకుతారా అని చంద్రబాబు, లోకేష్‌ ఎదురు చూస్తున్నారు. మా పార్టీ క్యాడర్‌ను భయపెట్టాలనే లోకేష్‌ పన్నాగం పన్నారు. అయినా మేమంతా చాలా ధైర్యంగా నిలబడ్డాం. ఇంకా నిలబడతాం. 

    కాగా, ఈ సమావేశంలో మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, మేరుగు నాగార్జున, కారుమూరు నాగేశ్వరరావు, మాజీ ఎంపీ మార్గాని భరత్, నేతలు కరణం ధర్మశ్రీ, దేవినేని అవినాష్, పూనూరు గౌతమ్‌ రెడ్డి, వరికూటి అశోక్‌ బాబు, దూలం నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, నూరి ఫాతిమ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Back to Top