ఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో వైయస్ఆర్‌సీపీ తరఫున ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో కేవలం రూ.3,320 కోట్లు మాత్రమే కేటాయించారని అవినాష్ రెడ్డి తెలిపారు. పోలవరం ఎత్తును 41.5 మీటర్లకు తగ్గించడం వల్ల కేవలం 75 టీఎంసీల నీటినే నిల్వ చేయగల పరిస్థితి వస్తుందని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు 45.7 మీటర్ల ఎత్తుతో నిర్మించి 194 టీఎంసీల నీటిని నిల్వ చేయాలనే అసలు లక్ష్యాన్ని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి సుమారు రూ.55,000 కోట్లు అవసరమని, నిధుల్లో కోత పెడితే రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. దీనివల్ల రైతులకు భారీ నష్టం వాటిల్లుతుందని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై సరైన ఒత్తిడి తేవడంలో విఫలమవడంతో పర్యావరణ అనుమతులు తిరస్కరించబడినట్లు ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ కాలంలో సుమారు రూ.3.32 లక్షల కోట్ల అప్పు ఉండగా, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే రూ.3.20 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. రాష్ట్ర జిడిపిలో అప్పుల పరిమితి 3.5 శాతానికి మించకూడదని కేంద్ర నిబంధనలు ఉన్నాయని, గతంలో 2014-19 మధ్య కూడా చంద్రబాబు ప్రభుత్వం సీలింగ్‌కు మించి రూ.17 వేల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ఇలా కొనసాగితే భవిష్యత్తులో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడం కూడా కష్టమవుతుందని హెచ్చరించారు. ఏపీఎండీసీ ద్వారా రూ.9,000 కోట్ల బడ్జెటేతర అప్పులు చేశారని, ప్రైవేటు వ్యక్తులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల నుంచి నిధులు తీసుకునే అసాధారణ పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు. బడ్జెటేతర అప్పులు చేయొద్దని కేంద్ర ప్రభుత్వం సూచించినప్పటికీ రాష్ట్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పులు అధికంగా చేస్తున్నప్పటికీ 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధులు కేటాయించడం లేదని, వాటిని ప్రైవేటీకరించేందుకు టెండర్లు పిలుస్తున్నారని విమర్శించారు. అలాగే ఏపీ విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరారు. కడప–బెంగళూరు రైల్వే లైన్ పనులు పూర్తిచేయడానికి తగిన నిధులు కేటాయించాలని, ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం 50 శాతం నిధులు భరించే స్థితిలో లేదని పేర్కొన్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 100 శాతం నిధులు ఇవ్వాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు.