ఓటమి భయంతోనే టీడీపీ దురాఘతాలు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు

దళితులను దూషించిన చింతమనేనిపై చర్యలు తీసుకోవడం లేదు

విజయవాడ: ఓటమి భయంతో టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా దురాఘాతాలకు పాల్పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్టు, బాలినేని శ్రీనివాసరెడ్డిని అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్‌కు వైయస్‌ఆర్‌సీపీ నేతలు సోమవారం ఫిర్యాదు చేశారు. ఏపీలో రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా ప్రజలు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. నిన్న చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు ట్యాబులు తీసుకొని వచ్చి వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నం చేయడంతో పట్టుకొని పోలీసులకు అప్పగించారన్నారు. ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు నమోదు చేసి చిత్రహింసలకు గురి చేశారన్నారు. వారి కోసం బాధ్యత గల ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోలీసు స్టేషన్‌కు వెళ్లి అడిగితే..ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదు చేసి రాత్రంతా తిప్పి సత్యవేడు వద్ద వదిలిపెట్టారన్నారు. ఇంత దురాఘతానికి పాల్పడుతున్న ప్రభుత్వంపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. గురజాల నియోజకవర్గంలో కూడా ఇలాగే పోలీసులు వ్యవహరించారన్నారు. 
ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ కార్యాలయం ప్రారంబోత్సవానికి వెళ్తుంటే అడ్డుకున్నారన్నారు. దెందలూరు నియోజకవర్గంలో దళితులను టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేను ఏమనకుండా..దళితులపైనే కేసులు నమోదు చేసి వేధించారన్నారు. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొని డ్యూటీలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని టీడీపీ నిర్దారణకు వచ్చిందన్నారు. సర్వేలన్నీ కూడా వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పడంతో ఓటమి భయంతో ఇలాంటి దురాఘాతాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికార యంత్రాంగం అంతా కూడా టీడీపీకి కొమ్ముకాస్తుందన్నారు. వాళ్ల ప్రతిష్టను అమ్ముకొని ఎవరికో బానిసగా చేయాల్సిన అవసరం లేదన్నారు. వైయస్‌ జగన్‌పై విశాఖలో ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటనపై గంట వ్యవధిలోనే డీజీపీ అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఓట్లు తొలగించినా ప్రశ్నించకూడదన్నదే చంద్రబాబు ఉద్దేశంగా ఉందన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి అధికారంలో కొనసాగడం రాజ్యాంగంలో మంచిది కాదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 

Back to Top