తాడేపల్లి: అయిదు నెలల కూటమి పాలన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘అప్పుల జాతర–సంక్షేమానికి పాతర‘ అన్నట్లుగా ఉందని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, ప్రశ్నించిన వారిని అక్రమంగా నిర్బంధించడం తప్ప ప్రజలకు చేసిందేం లేదని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అయిదు నెలల్లో రూ.57 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీలను కూడా గాలికొదిలేసిందని చెప్పారు. బడ్జెట్‌లో మూడు పథకాలకు ఏ కేటాయింపులు లేకపోగా, మరో మూడింటికి నామమాత్రంగా నిధులు కేటాయించారని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే రూ.74 వేల కోట్లు కావాలన్న ఆయన, బడ్జెట్‌లో ఆ ప్రస్తావన లేదని గుర్తు చేశారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం పథకానికి రూ.12,600 కోట్లు కావాల్సి ఉంటే, బడ్జెట్‌లో కేవలం రూ.5,380 కోట్లు కేటాయించడం చూస్తే, పథకం లబ్ధిదారుల్లో సగం మందికి కోత పడే పరిస్థితి కనిపిస్తోందని ఎమ్మెల్యే చంద్రశేఖర్ చెప్పారు. ఇక నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధికి ఏ కేటాయింపులూ లేకపోగా, ఉచిత సిలిండర్ పథకానికి రూ.850 కోట్లు, రైతులకు పెట్టుబడి సాయం కోసం కేవలం రూ.1000 కోట్లు మాత్రమే కేటాయించం మోసం కాక మరేమిటని నిలదీశారు. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయన్న యర్రగొండపాలెం ఎమ్మెల్యే, ప్రతి గంటకు నలుగురు ఆడబిడ్డలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, ఘోరాలు జరుగుతున్నాయని ప్రభుత్వ లెక్కలే స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఈ అంశంపై తాను అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధాన ప్రతిని ఆయన మీడియాకు చూపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన, ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబరు వరకు అయిదు నెలల్లో ఆడబిడ్డలపై జరిగిన ఘోరాలకు సంబంధించి 7,393 కేసులు నమోదయ్యాయని, అంటే రోజుకు సగటున 48 ఘటనలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిని అర్థరాత్రి కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా తీసుకెళ్లి తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ తెలిపారు. నేరాన్ని అదుపు చేయలేని ఈ ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదన్న ఆయన, వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ వెంటనే సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.