ప్ర‌శాంతమైన ప‌ల్నాడులో టీడీపీ హ‌త్యా రాజ‌కీయాలు

కంచ‌ర్ల జల్లయ్యది రాజకీయ హత్య కానే కాదు

రెండు కుటుంబాల మధ్య గొడవ అందుకు కారణం

జల్లయ్యది నేరచరిత్ర.. 10 కేసుల్లో అత‌ను ముద్దాయి

టీడీపీ ఇన్‌చార్జ్‌గా బ్రహ్మారెడ్డి వ‌చ్చాకే ప‌ల్నాడులో గొడ‌వలు మొద‌ల‌య్యాయి

చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ వైషమ్యాలు పెంచుతున్నారు

హత్యా రాజకీయాలతో లబ్ధి పొందాలని కుట్ర‌లు ప‌న్నుతున్నారు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

మాచర్ల: ప్ర‌శాంతంగా ఉన్న పల్నాడులో చిచ్చుపెట్టి, గొడవలు సృష్టించి, రక్తపాతం నుంచి ఓట్లు దండుకోవాలని చంద్ర‌బాబు కుట్ర‌లు చేస్తున్నాడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి మండిప‌డ్డారు. రెండు కుటుంబాల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌లో జ‌ల్ల‌య్య అనే వ్య‌క్తి చ‌నిపోతే.. దాన్ని త‌న‌కు అంట‌గ‌డుతున్నార‌ని, హ‌త్యా రాజ‌కీయాల‌తో ల‌బ్ధిపొందాల‌ని చూస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. మాచ‌ర్ల టీడీపీ ఇన్‌చార్జ్‌గా బ్రహ్మారెడ్డి వచ్చాకే గొడవలు మొద‌ల‌య్యాయ‌న్నారు. కంచ‌ర్ల జ‌ల‌య్య నేర చ‌రిత్ర క‌లిగిన వ్య‌క్తి అని, అత‌నిపై 10 కేసులు ఉన్నాయ‌న్నారు. రెండు కుటుంబాల క‌ల‌హాల‌తో జ‌రిగిన హ‌త్య‌ను త‌న‌కు ఆపాదించ‌డం తెలుగుదేశం పార్టీ నీచబుద్ధికి నిద‌ర్శ‌న‌మ‌ని ధ్వ‌జ‌మెత్తారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి మండిప‌డ్డారు. మాచ‌ర్ల‌లో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే.. 

దుర్గి మండలం జంగమేశుపాడుకు చెందిన కంచర్ల జల్లయ్య వ్యక్తికి గ్రామంలో పాత కక్షలు ఉన్నాయి.  రెండు కుటుంబాల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు జరిగాయి. నిన్న ఒక చిన్న గొడవ జరిగి అది క్రమంగా పెద్దదై జల్లయ్యను కొట్టారు. దీంతో అక్కడే ఉన్న మా పార్టీకి చెందిన వైస్‌ ఎంపీపీ ఏగయ్య ఆ గొడవను ఆపి, జల్లయ్యను మాచర్ల ఆస్పత్రికి ఆటోలో తరలించాడు. మెరుగైన వైద్యం కోసం నర్సారావుపేట తీసుకెళ్తుండగా జ‌ల్ల‌య్య‌ చనిపోయాడు.

10 కేసుల్లో జల్లయ్య ముద్దాయి..
ఆ హత్యపై యావత్‌ టీడీపీ, ఇక్కడి ఆ పార్టీ ఇన్‌చార్జ్ బ్రహ్మారెడ్డి ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారు. కంచర్ల జల్లయ్య అనే వ్యక్తి ఏకంగా 10 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. దీన్ని చంద్రబాబు తెలుసుకుని మాట్లాడాలి. ఆయన ఈ హత్యను నాకు ఆపాదిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు జల్లయ్యపై ఆ 10 కేసులు నమోదయ్యాయి. వాటిలో కొన్ని కేసుల్లో ఏ–1గానూ, మరి కొన్ని కేసుల్లో ఏ–2గానూ ఉన్నాడు.

స్వయంగా రాజీ చేయించాను..
అలాంటి వ్యక్తి (జల్లయ్య)తో పాటు, ఇరు వర్గాలను పిలిపించి, అతడిపై ఉన్న చక్కనయ్య అనే వ్యక్తి హత్య కేసును నేను రాజీ చేయించాను. దేవుడి మీద ప్రమాణం చేసి పంపించాను. చక్కనయ్య మా పార్టీకి చెందిన వ్యక్తి. అయినా ఈ ప్రాంతంలో ప్రశాంతత కోరుకుంటున్న నేను, ఆ కేసులో జల్లయ్య ఏ–1 ముద్దాయి కాగా, ఇరు వర్గాల మధ్య రాజీ చేసి, ఆ కేసు కొట్టేసేలా చూశాను. నేను రాజీ చేసిన హత్య కేసును 2022, జనవరి 24న కొట్టేశారు. నేనే పల్నాడులో ఫ్యాక్షనిజం ప్రోత్పహిస్తే, అలా రాజీ చేయించే వాణ్ని కాదు. శిక్షలు వేయించేవాణ్ని.

వారు ప్రశాంతత కోరడం లేదు..
చంద్రబాబుకు పల్నాడు ప్రశాంతంగా ఉండాలని లేనట్లుంది. ఇక్కడ గొడవలు జరగాలని వారు కోరుతున్నారని అనిపిస్తోంది. నేను తొలిసారిగా 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. అప్పటి నుంచి నాలుగుసార్లు గెలిచాను. గత 13 ఏళ్లలో ఎక్కడా ఇలాంటి రాజకీయాలు చేయలేదు. కానీ బ్రహ్మారెడ్డి అనే ఫ్యాక్షనిస్టును ఇక్కడ టీడీపీ ఇన్‌చార్జ్‌గా పంపించి, ప్రశాంతంగా ఉన్న పల్నాడులో గొడవలు చేస్తున్నారు.

ఆ ట్రాప్‌లో పడొద్దు..
పల్నాడు వాసులను ఒకటే కోరుతున్నాను. పచ్చ మీడియా, తెలుగుదేశం పార్టీ ఇక్కడ చిచ్చుపెట్టి, గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయి. వాళ్ల ట్రాప్‌లో పడొద్దు. ఆ పార్టీ ఇక్కడ గొడవలు సృష్టించి, రక్తపాతం జరిపి, దాంట్లో నుంచి ఓట్లు దండుకోవాలని తెలుగుదేశం పార్టీ చూస్తోంది. అందుకే ఇవాళ ఇక్కడికి బుద్ధా వెంకన్నను పంపించారు. మొన్న మహానాడులో కూడా టీడీపీ నాయకులు బస్సు యాత్రలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులను లాగి కొడతామని మాట్లాడారు. అంటే ఆ మాటలు కూడా చంద్రబాబు వారితో అనిపించాడు. అలా చంద్రబాబు ఇక్కడ వర్గాల మధ్య చిచ్చు పెట్టి, ఆ రక్తంతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడు.

చంద్రబాబు, బ్రహ్మారెడ్డి కారణం..
ప‌ల్నాడులో జరుగుతున్న హత్యలకు చంద్రబాబు, ఆ పార్టీ ఇన్‌చార్జ్ బ్రహ్మారెడ్డి ఇద్దరే కారణం. ప్రజల మనోభావాలు రెచ్చగొట్టి, ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని, ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఒకప్పుడు పల్నాడులో ఫ్యాక్షనిజం ఉండేది. కానీ 2004లో వైయస్సార్ సీఎం అయిన తర్వాత, ఎక్కడా ఫ్యాక్షనిజాన్ని అరిక‌ట్టారు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి, ఎక్కడా ఫ్యాక్షన్‌ గొడవలు లేకుండా కృషి చేస్తున్నాను. అయితే చంద్రబాబు ఒక కుట్రతో ఫ్యాక్షనిజమ్‌ నేపథ్యం ఉన్న బ్రహ్మారెడ్డిని ఇక్కడికి ఇన్‌చార్జ్‌గా పంపించిన తర్వాతే ఇక్కడ హత్యా రాజకీయాలు మొదలయ్యాయి.

ఇదీ బ్రహ్మారెడ్డి చరిత్ర..
బ్రహ్మారెడ్డి, తన తల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఒకేరోజు ఏడుగురిని దారుణంగా హతమార్చిన కేసులో ఏ–1 ముద్దాయి. అప్పుడు సీఎంగా చంద్రబాబు ఉన్నారు. అదే చంద్రబాబు రాజకీయ చరిత్ర. ఇవాళ కోనసీమలో కూడా ఆయన అదే రాజకీయం చేస్తున్నారు. అక్కడ జిల్లా పేరు మార్చడంతో, గొడవలు మొదలు పెట్టారు. గడచిన 4 నెలల నుంచే గొడవలు జరుగుతున్నాయి. దీన్ని ప్రజలు గుర్తించాలి. ఫ్యాక్షన్‌ చరిత్ర ఉన్న బ్రహ్మారెడ్డిని ఇక్కడ ఇన్‌చార్జ్‌గా నియమించి, చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తున్నారు. అందుకే ఎవరూ చంద్రబాబు, టీడీపీ ట్రాప్‌లో పడొద్దని పల్నాడు వాసులను మరోసారి కోరుతున్నాను. 

పల్నాడులో ఎన్నో అభివృద్ధి పనులు..
చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఏనాడూ పల్నాడును అభివృద్ధి చేయలేదు. గత మూడేళ్లుగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇక్కడ ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు. వరికపూడిసల ప్రాజెక్టు తెస్తున్నాం. రహదారులు నిర్మిస్తున్నాం. వరికపూడిసల ప్రాజెక్టు వల్ల 80 వేల ఎకరాలను నీరందుతుంది. ఆ ప్రాజెక్టుకు రెండుసార్లు భూమిపూజ చేసిన చంద్రబాబు, పనులు మాత్రం చేయలేదు. ఇప్పుడు వైయ‌స్ జ‌గ‌న్‌ దాన్ని ఆమోదించారు. ఇంకా ఇక్కడ రైతులకు ఉచితంగా బోర్లు తవ్వుతున్నాం. మాచర్ల నుంచి దావుపల్లి వరకు శ్రీశైలం రోడ్‌లో రూ.300 కోట్లతో హైవే రోడ్డును, మాచర్ల నుంచి దాచేపల్లి వరకు రూ.340 కోట్లతో రోడ్డు వేస్తున్నాం. ప్రజలు ప్రశాంతంగా ఉంటే, తమకు ఓట్లు వేయడం లేదని చంద్రబాబు కక్ష కట్టారు. అందుకే ఇక్కడ కులాలు, వర్గాలను రెచ్చగొట్టి దాని ద్వారా ఓట్లు సంపాదించాలని కుటిల ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల రెండు కుటుంబాల మధ్య గొడవతో చంద్రయ్య అనే వ్యక్తి చనిపోతే, దాన్ని కూడా మాకు ఆపాదించారు. చివరకు ఆయన పాడె కూడా మోసిన చంద్రబాబు, రాజకీయంగా ఆ స్థాయికి దిగజారారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top