చంద్రబాబువి దొంగ దీక్షలు..కొంగజపాలు

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బాబు ప్రయత్నం

స్పీకర్‌పై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

నారా లోకేష్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తాం

నవంబర్‌ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

సచివాలయం: చంద్రబాబువి దొంగ దీక్షలు..కొంగ జపాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని, ఆయనకు ఇసుకపై దీక్ష చేసే హక్కు లేదని పేర్కొన్నారు. స్పీకర్‌పై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లాది విష్ణు మాట్లాడారు.  
ఏపీ శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం గురించి టీడీపీ ఈ-పేపర్‌లో ప్రచురించిన కథనాలను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. శాసన సభలో స్పీకర్‌ కూర్చుతున్న తీరును, అసభ్యపదజాలంతో టీడీపీ నేతలు రాసిన బహిరంగ లేఖలు దుర్మార్గమన్నారు. స్పీకర్‌ స్థానం గౌరవాన్ని ప్రశ్నించే విధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. నారా లోకేష్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని,  ఆయనపై చర్యలు తీసుకోవాలని మల్లాది విష్ణు ప్రభుత్వాన్ని కోరారు.

చంద్రబాబు ఇసుక దీక్ష..ఆయన దుష్ర్పచారానికి పరాకాష్ట
చంద్రబాబు ఇసుకపై చేస్తున్న దీక్ష ఆయన దుష్ర్పచారానికి పరాకాష్ట అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.  ఇసుక మీద దీక్ష చేస్తున్న చంద్రబాబు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును చంద్రబాబు గౌరవించడం లేదని, ఐదు నెలల ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియాను ప్రోత్సహించింది ఎవరని ప్రశ్నించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఇసుక దోపిడీ నిజం కాదా అని నిలదీశారు. ఇసుక కొరత మానవ తప్పిదమే అని తెలిసి కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇసుకపై ఒక చట్టం చేయాలని టీడీపీ నేతలు ఏరోజైనా ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. ఇసుక విధానంలో నూతన విధానం తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శ్రీకారం చుట్టారని, ప్రతి రోజు 2 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉంచాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.    స్టాక్‌ పాయింట్లు పెట్టాలని, చెక్‌ పోస్టులు పెట్టే ఆలోచన టీడీపీ నేతలు చేశారా అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు, మహిళలకు, కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తుంటే ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు చేస్తుందని ధ్వజమెత్తారు. సింగిల్‌గా రాజకీయాలు చేయడం చంద్రబాబుకు చేతకాదన్నారు. ఈ రోజు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య ఏ మోహం పెట్టుకొని పవన్‌ను కలిశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాకు ఆజ్యం పోసిన చంద్రబాబుకు రేపు విజయవాడలో దీక్ష చేసే హక్కు లేదన్నారు. ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలు జరపాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశించినట్లు మల్లాది విష్ణు తెలిపారు.

Read Also: ఆధారాలు చూపించకపోతే బాబు పక్కన నేను కూడా దీక్ష చేస్తా

Back to Top