కృష్ణా: కులాల మధ్య చిచ్చుపెట్టి.. కొన్ని కులాల మీద ద్వేషం పెంచే విధంగా రఘురామకృష్ణరాజు ప్రయత్నించాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి ధ్వజమెత్తారు. రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు, రాజద్రోహ పనులకు పాల్పడుతూ ప్రభుత్వాన్ని కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టే అతన్ని అరెస్టు చేయడం జరిగిందన్నారు. రఘురామకృష్ణరాజు అరెస్టుకు ప్రభుత్వానికి కానీ, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదన్నారు. పెనమలూరులో ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మీడియాతో మాట్లాడారు. లేనిపోని ఆరోపణలు చేసి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా రఘురామకృష్ణరాజు ప్రవర్తించారని ధ్వజమెత్తారు. రఘురామకృష్ణరాజు నరసాపురం నియోజకవర్గానికి వెళ్తే పదిమంది కూడా అతని వెంట రాని పరిస్థితులు ఉన్నాయన్నారు. ఆయన్ను ప్రజలు అంతగా అసహ్యించుకుంటున్నారన్నారు.