తాడేపల్లి: రాష్ట్రంలో కల్తీ మద్యం సిండికేట్లను తెరవెనుక నడిపిస్తున్న సీఎం చంద్రబాబు ధనదాహానికి అనేక మంది అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని వైయస్ఆర్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారి గుప్పిట్లోనే మద్యం తయారీ డిస్టిలరీలు ఉన్నాయని, వాటి ద్వారా కల్తీ మద్యంను రాష్ట్రంలో ఏరులై పారిస్తున్నారని అన్నారు. ఏపీలో విక్రయిస్తున్న ప్రతి మూడు బాటిళ్ళలో ఒక బాటిల్ కల్తీ మద్యంగా ఉందంటేనే ఈ రాష్ట్రంలో నారా వారి కల్తీ సారా ఎంతగా చెలామణి అవుతుందో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... కల్తీ మద్యం దందా వెనుక టీడీపీ కీలక నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. టీడీపీ మద్యం సిండికేట్ ముఠాలు తయారు చేస్తున్న కల్తీ మద్యం తాగి మద్యానికి అలవాటున్నవారు ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యం బారిన పడి ఏమైందో తెలుసుకునే లోపే మృత్యు కౌగిట్లోకి చేరిపోతున్నారు. ప్రమాదకర స్పిరిట్‌లో కారమిల్, రంగు నీళ్లు కలిపి బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తూ మందుబాబుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. రాష్ట్రంలో 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్ గుప్పిట్లోనే ఉన్నాయి. ఇక వాటికి అనుబంధంగా దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలను కూడా సిండికేట్ నిర్వహిస్తోంది. ఆ మద్యం దుకాణాలు, బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్ మద్యం పేరుతో కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కల్తీ మద్యం తాగి ఇటీవల పలువురు హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ చావులకు టీడీపీ కల్తీ మద్యం సిండికేట్ కారణమన్న వాస్తవాన్ని చంద్రబాబు సర్కారు కప్పి పుచ్చుతోంది. కల్తీ మద్యం తయారీకి కీలకమైన స్పిరిట్‌ను అక్రమంగా సరఫరా చేస్తున్న టీడీపీ పెద్ద తలకాయల జోలికి ఎక్సైజ్ శాఖ వెళ్లకుండా సీఎం చంద్రబాబు అండగా ఉండి కాపాడుతున్నాడు. అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప తదితర జిల్లాల్లో నిర్వహించిన దాడులతో కల్తీ మద్యం రాకెట్ దందా వెనుక టీడీపీ కీలక నేతలు, ప్రజాప్రతినిధుల కుటుంబాలే ఉన్నట్టు స్పష్టమైంది. రాష్ట్రంలో దాదాపు డజను కల్తీ మద్యం యూనిట్లు స్పిరిట్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నుంచి నియంత్రణ ఉంటుంది. పరిశ్రమలు కూడా ఓ పరిమితికి మించి కొనుగోలు చేయకూడదు. అయితే కోవిడ్ వ్యాప్తి సమయంలో శానిటైజర్ల తయారీ కోసం ఆ పరిమితిని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు లేనప్పటికీ స్పిరిట్‌ను భారీగా కొనుగోలుకు అనుమతిస్తున్నారు. దీన్నే టీడీపీ మద్యం సిండికేట్ తమ దందాకు అవకాశంగా మలుచుకుని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లోని స్పిరిట్ తయారీ పరిశ్రమల నుంచి డిస్టిలరీల పేరిట అవసరానికి మించి భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. అలా సేకరించిన స్పిరిట్‌ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లకు తరలిస్తున్నాయి. రెండు మూడు జిల్లాలకు ఒక యూనిట్ చొప్పున రాష్ట్రంలో దాదాపు డజను కల్తీ మద్యం యూనిట్లను నెలకొల్పి కల్తీ మద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏరులై పారిస్తున్నారు. యానాంతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడుకు కూడా కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. టీడీపీ సిండికేట్ కి అధికారిక నెట్‌వర్క్ ఉండటంతో కల్తీ సరుకును యథేచ్ఛగా బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్నారు. ప్రతి మూడు బాటిల్స్‌లో ఒక కల్తీ మద్యం బాటిల్ ని విక్రయిస్తున్నారు. ఓల్డ్ అడ్మిరల్, ఏసీ బ్లాక్ విస్కీ, ఏస్పీవై 999 పేరుతో ఈ కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మద్యం ప్రియుల ప్రాణాలను ఫణంగా పెట్టి టీడీపీ మద్యం సిండికేట్ ఒక్క ఏడాదిలో రూ.వేల కోట్ల దోపిడీని సాగించింది. ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యం విక్రయం రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024–25లో మద్యం అమ్మకాల ద్వారా రూ.28,500 కోట్ల ఆదాయం వచ్చిoది. 2025-26లో రూ.35 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం క్వార్టర్ బాటిళ్లలో మూడోవంతు కల్తీ మద్యం విక్రయించినట్లు అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యాన్ని విక్రయించారు. ఒక్కో క్వార్టర్ బాటిల్‌ను రూ.110 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారు.