సభా సమయాన్ని వృథా చేయడం టీడీపీకి తగదు

అంబటి రాంబాబు
 

అమరావతి: సభలో టీడీపీ ఎందుకు ఆందోళన చేస్తుందో అర్థం కాలేదని,సభా సమయాన్ని వృథా చేయడం టీడీపీకి తగదు ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. 
ప్రతిపక్ష నాయకులకు అవకాశం ఇవ్వాలో లేదో స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారన్నారు. రెండు, మూడు రోజుల నుంచి గమనిస్తున్నానని, చంద్రబాబు కొద్దిగా స్పీడ్‌ పెంచారన్నారు. పోడియం దాకా వెళ్లి ఆందోళన చేపట్టడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షం ఏదైన ఒక సమస్యపై ఆందోళన చేపడితే మేం కూడా సహకరిస్తామని, అలా కాకుండా అధికార పక్షంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. టీడీపీ ప్రభుత్వం సభా సాంప్రదాయాలను ఏవిధంగా పాటించిందో గుర్తు చేసుకోవాలన్నారు. ఇవాళ మేం ప్రతిపక్షంపై ఉదారంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. సభా సమయాన్ని వృథా చేయడం ధర్మం కాదన్నారు. ఇవాళ ముగ్గురు టీడీపీ సభ్యులు సస్పెండ్‌ అయ్యారని ప్రవర్తన మార్చుకొని ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. మేం మా మేనిఫెస్టో చూపించి ఓట్లు అడిగామని, ప్రజలు నమ్మి ఓట్లు వేశారన్నారు. మేనిఫెస్టోను కాపాడుకునే బాధ్యత మాపైనే ఉందన్నారు. ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగకుండా గత నాలుగు రోజులుగా టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా అడ్డుపడుతున్నారని విమర్శించారు. సభా కార్యక్రమాలను అడ్డుకుంటే ప్రజలు హర్షించరన్నారు. సస్పెన్షన్‌ సరైన విధానం కాదని, టీడీపీ సభ్యులు అక్కడిదాకా తెచ్చుకోవద్దని హితవు పలికారు. చంద్ర‌బాబుకు అమ‌రావ‌తికి అంత ప్రేమ ఉంటే ఇక్క‌డ ఎందుకు ఇల్లు క‌ట్టుకోలేద‌ని, అద్దె ఇంట్లో ఎందుకు ఉన్నార‌ని ప్ర‌శ్నించారు. ఇక్క‌డ ఉండాల‌నే భావ‌న‌, చిత్త‌శుద్ది చంద్ర‌బాబుకు లేద‌న్నారు.
 

Back to Top