నాపై పోటీ చేస్తే లోకేష్ ఓడిపోతార‌ని చంద్ర‌బాబుకు తెలుసు

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 

ప్రజల కష్టసుఖాలను చంద్రబాబు ఎప్పుడూ తెలుసుకోలేదు

లోకేష్‌తో ఎమ్మెల్సీ ప‌ద‌వికి ఎందుకు రాజీనామా చేయించ‌లేదు

ఏప్రిల్ 9న లోకేష్‌కు..11న నాకు ఓట్లు వేయించు చంద్ర‌బాబు

 

గుంటూరు:  లోకేష్ ఒత్తిడి త‌ట్టుకోలేక నాపై పోటీ చేయిస్తే ఎలాగైనా ఓడిపోతార‌ని గ్ర‌హించిన చంద్ర‌బాబు మంగ‌ళ‌గిరిలో పోటీకి దించార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. చంద్ర‌బాబు ఇక్క‌డి నుంచి పోటీ చేసి ఉంటే బాగుండేద‌ని ఆయ‌న చుర‌క‌లంటించారు. ఐదేళ్ల‌లో ఏ నాడు కూడా మంగ‌ళ‌గిరి అభివృద్ధి గురించి మాట్లాడ‌ని వ్య‌క్తి ఇవాళ త‌న కుమారుడిని పోటీకి దించ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. శుక్ర‌వారం సాయంత్రం మంగ‌ళ‌గిరిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్ర‌చార స‌భ‌లో ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడారు. ఇక్క‌డ ఎందుకు పోటీ చేస్తున్నారోనారా లోకేష్‌ సూటీగా స‌మాధాపం చెప్పాలని ప్రశ్నించారు. ఇక్కడ పోటీ చేయాల్సింది నారా లోకేష్‌ కాదని, ఆయన తండ్రి చంద్రబాబు పోటీ చేసి ఉంటే బాగుండేదన్నారు. ఓడిపోతానని చంద్రబాబుకు తెలుసు కాబట్టే ఇక్కడ పోటీ చేయలేదన్నారు.

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మంగళగిరి ప్రాంతం అభివృద్ధికి ఎప్పుడైనా అధికారులతో సమీక్ష జరిపారా అని ప్రశ్నించారు. ఇదే ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఇంట్లో చంద్రబాబు నివాసంచేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు టీడీపీకి చెందిన సోమిరెడ్డి, రామసుబ్బారెడ్డిలతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయించిన చంద్రబాబు తన కుమారుడితో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. ఏమాత్రం అనుభవం లేని లోకేష్‌ ఒత్తిడి తట్టుకోలేక మూడు మంత్రి శాఖలు ఇచ్చారన్నారు. నాపై పోటీ చేస్తే లోకేష్‌ ఓడిపోతారని గ్రహించే ఇక్కడ పోటీ చేయించారని, దీంతో ఆయన పీడ విరగడ అవుతుందని నాపై పోటీ చేయించారని పేర్కొన్నారు. వర్ధంతి, జయంతికి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్‌ అని ఎద్దేవా చేశారు. ఎవరైనా చనిపోతే ఆయన పరవశించిపోతారన్నారు. చివరకు ఎన్నికలు ఎప్పుడో తెలియదని, నామినేషన్‌ ఎలా వేయాలో కూడా ఆయనకు తెలియదన్నారు. చంద్రబాబు..నీ పుత్రరత్నం చెప్పినట్లు వచ్చే నెల 9వ తేదీ జరిగే ఎన్నికల్లో మీ అబ్బాయికి ఓట్లు వేయించుకోని..11వ తేదీ జరిగే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేయించాలని కోరారు.

Back to Top