ఉండవల్లి రైతులకు న్యాయం చేయ‌క‌పోతే ఉద్యమం ఉధృతం

 వైయస్ఆర్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి

రైతు గుంటక పద్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వేమారెడ్డి

తాడేప‌ల్లి: అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైయస్ఆర్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి హెచ్చరించారు. ఉండవల్లి రైతు గుంటక పద్మారెడ్డి మృతదేహానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ప్రభుత్వం రైతుల సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని కోరారు. గుంటూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ, గుంటక పద్మారెడ్డికి ఉన్న ఎకరం 40 సెంట్ల భూమికీ ల్యాండ్ పూలింగ్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. సారవంతమైన వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకుని ఇతరులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

భూమి రైతు కుటుంబానికి తరతరాల జీవనాధారమని, అలాంటి భూమిని వదులుకోవడానికి ఏ రైతూ ఇష్టపడడని అన్నారు. ఇది ఒక్క రైతు సమస్య కాదని, భూములు ఇవ్వని ప్రతి రైతు ఆవేదన ఇదేనని పేర్కొన్నారు. ఉద్యోగి ఉద్యోగం కోల్పోతే ఎంత బాధ కలుగుతుందో, రైతు భూమి కోల్పోయినా అంతే బాధ ఉంటుందని చెప్పారు. రాజధాని ప్రాంతంలోని రైతులు అభివృద్ధికి వ్యతిరేకం కాదని, తమకు న్యాయం కావాలనేదే వారి డిమాండ్ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకునే భూములకు బదులుగా సమీప ప్రాంతంలో సమాన విలువ కలిగిన భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైతులపై ఆరోపణలు చేయడం మానుకుని సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని, న్యాయం చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
 

Back to Top