తాడేపల్లి: సిట్ చార్జిషీట్‌లోనూ ఎల్లో మీడియా బేతాళ కథలు అల్లిందని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్టు ఆధారంగా చార్జిషీట్ వేశారని, ఢిల్లీ న్యాయవాదుల సలహాలతో వాటికి తుదిమెరుగులు దిద్దారని ఆక్షేపించారు. తాడేపల్లిలో మనోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వారి ఫొటోలు ఎందుకు తీయిస్తున్నారు: తన సుదీర్ఘ కెరియర్‌లో అవినీతి మరకలేని అధికారి ఐఏఎస్ ధనుంజయ రెడ్డి కూటమి ప్రభుత్వతీరుతో తీవ్ర ఆవేదనకి గురై కోర్టులో పిటిషన్ వేశారు. సిట్ అధికారుల పుణ్యమా అని ఎల్లో మీడియా తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వార్తలు రాస్తున్నట్టు తెలియజేశారు. 20 రోజులుగా ఎల్లో మీడియాలో రాస్తున్న వార్తలే చార్జి షీట్, రిమాండ్ రిపోర్టులోనూ అవే ప్రతిబింబిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా మా కెరియర్‌ని బిల్డ్ చేసుకుంటే అసత్య వార్తలతో వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. సిట్ అధికారులే కొన్ని వార్తా పత్రికలకు లీకులిస్తున్నారు. జైల్లో మేముండగా పక్కన బిల్డింగ్ పైనుంచి మా ఫొటోలు తీస్తున్నారు. జైలు అధికారులను ఇదేమని అడిగితే, పైనుంచి వచ్చి ఆదేశాలని పాటిస్తున్నామని చెబుతున్నారు. వంటి అంశాలను ఆవేదనతో కోర్టు దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ అంశాలన్నీ కోర్టు దృష్టికి తీసుకొస్తున్న కారణంగా సిట్ మాపట్ల మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం కూడా లేకపోలేదు. అయినా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పాలనే ఆశయంతో జరుగుతున్న దారుణాలను కోర్టు దృష్టికి తెస్తున్నానని ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎల్లో మీడియా కథనాలే చార్జిషీట్ అంశాలు: రాజకీయ కుట్రతో టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఏ స్ర్రిప్టు వస్తే దాన్ని చార్జిషీట్ గా పొందుపరిచినట్టు దానికి ఢిల్లీలో న్యాయవాదులు తుది మెరుగులు దిద్దినట్టు స్పష్టంగా అర్థమైపోతోంది. చంద్రబాబు వీరవిధేయ సిట్ ఆధారాలు ఎక్కడా చూపించకుండానే లిక్కర్ కుంభకోణం విలువ రూ. 50 వేల కోట్ల నుంచి విడతల వారీగా తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు రూ.3500 కోట్లకు చార్జిషీట్ లో పొందుపరిచారు. చార్జిషీట్ చూస్తే మోకాలికి బోడి గుండుకి లింకు పెట్టినట్టుగా ఉంది తప్ప ఎక్కడా దానికి ఆధారాలు లేవు. హైదరాబాద్‌లో రెండు కిమీల పరిధిలో ఉన్న కాల్ డేటాను తీసుకుని వీరంతా కలిసి సమావేశమై కుట్ర పన్ని కుంభకోణానికి పాల్పడ్డారని రాసుకొచ్చారు. దాన్ని ధృవీకరించేందుకు కొంతమందిని భయపెట్టి బెదిరించి కొట్టి తప్పుడు వాంగ్మూలాలు తీసుకున్నారు. గాలిని పోగేసి ఎల్లో మీడియా సృష్టించి రాసిన బేతాళ కథలే సాక్ష్యాలు. ఆధారాలు లేవు కాబట్టే ఆస్తులు అటాచ్ చేయలేదు రాజ్ కేసిరెడ్డి షాబాద్‌లో 60 ఎకరాలు కొన్నాడు. టాంజానియాలో పెట్టుబడులు పెట్టాడు. దుబాయ్‌లో స్టార్టప్‌ల కోసం పరిశోధనలు, ఎన్నికల్లో రూ. 300 కోట్లు ఖర్చు చేశారని చార్జిషీట్‌లో పొందుపరిచారు. కానీ వాటిలో ఏ ఒక్కదానికీ సిట్ వద్ద ఆధారాలు లేవు. డిస్టిలరీల నుంచి ఇంతవరకు రూ.62 కోట్లు స్వాధీనం చేసుకున్నామని చెబుతున్నారే కానీ అరెస్టైన ఏ ఒక్కరి నుంచి ఒక్క రూపాయి కూడా సీజ్ చేయలేదు. ఒక్క ఆస్తిని అటాచ్ చేసిందీ లేదు. ఐదు అపార్ట్‌మెంట్‌ల నిండా డబ్బులు దాచిపెట్టారని రాసుకొచ్చారు. అదే నిజమైతే ఆ డబ్బును ఎందుకు సీజ్ చేయలేదు. సిబ్బంది, అధికారులతో నాయకులు మాట్లాడినా తప్పేనా..? కానీ డిస్టిలరీ యజమానులను భయపెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి బేతాళ కథలను పోగేసి చార్జిషీట్‌ను తయారు చేశారు. ఆ డిస్టిలరీలన్ని చంద్రబాబు అనుమతులతో ఏర్పాటైనవే. 306 పేజీల చార్జిషీట్‌లో కట్టుకథలు, ఒత్తిడి చేసి బెదిరించి తీసుకున్న వాంగ్మూలాలు తప్ప ఆధారాలు ఏమీ లేవు. వైయస్ఆర్‌సీపీలో నాయకులు కూర్చున్న సమావేశాలు, అధికారులతో జరిగిన సంభాషణలు, వ్యక్తిగత సిబ్బందితో నాయకులకు జరిగిన మాటలను ప్రధాన సాక్ష్యాలుగా చూపించే ప్రయత్నం చేశారు. ఇదే సూత్రాన్ని చంద్రబాబు, లోకేష్, వారు అధికారులతో జరిపిన సంభాషణలను అన్వయించుకోవచ్చని సిట్ చెప్పాలనుకుంటుందా? ఫోన్ కాల్ మాట్లాడినంత మాత్రాన, వ్యక్తిగత సిబ్బందితో, అధికారులతో మాట్లాడితే ఆధారాలు లేకుండా వారిని నిందితులుగా చేరుస్తారా? కట్టుకథలతో అక్రమ అరెస్టులు ఈ కేసులో మొదటగా అరెస్ట్ చేసిన రాజ్ కేసిరెడ్డిని కింగ్‌పిన్, మాస్టర్ మైండ్ అన్నారు. ఈ కేసులో ఆ తర్వాత అరెస్ట్ అయిన ప్రతి ఒక్కర్నీ కూడా మాస్టర్ మైండ్, కింగ్ పిన్ అని కథనాలు రాస్తున్నారు. ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేసినప్పుడు కూడా ఎల్లో మీడియాలో ఇదే విధంగా కథనాలు రాశారు. ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే వారి గురించి ఒక కట్టు కథ అల్లి, వారి పరువు ప్రతిష్టలను దెబ్బదీసి, వ్యక్తిగత జీవితంపై విష ప్రచారం చేసి వ్యక్తిత్వాన్ని హననం చేసి, మాస్టర్ మైండ్ అన్న ముద్ర వేసి అరెస్టులు చేస్తున్నారు. 3.58 లక్షల జీబీ డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠా.. అని ఈనాడులో ప్రముఖంగా రాశారు. ఆ డేటా 370 కోట్ల పేజీలతో సమానం అని రాశారు. అయినప్పటికీ వాటిని రికవరీ చేసి చార్జిషీట్ ఫైల్ చేసినట్టు కట్టుకథలతో ప్రచారం చేస్తున్నారు. సిట్ మాట వింటే సాక్షి, లేదంటే నిందితుడు: సిట్ మాట వింటే సాక్షి, వినకపోతే నిందితుడు అన్నట్టుగా దర్యాప్తు సాగుతోంది. చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన నాటి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తీవ్రంగా వేధించారు. చంద్రబాబు మీద ఆధారాలతో సహా సీఐడీ కేసులు నమోదు చేయడాన్ని తట్టుకోలేక కక్షతో వైయస్ఆర్‌సీపీ హయాంలో కూడా లిక్కర్ కుంభకోణం జరిగినట్టు చూపించేందుకు వాసుదేవరెడ్డిని పావుగా వాడుకున్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటు కాగానే ఆయన కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు. కూటమి వేధింపుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన మూడుసార్లు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ తర్వాత కాలంలో ఎలాగోలా ఆయన్ను లొంగదీసుకుని ఆయనతో స్టేట్‌మెంట్ రికార్డు చేయించుకుని డిప్యూటేషన్‌పైన ఉన్న వ్యక్తిని రిలీవ్ చేసి వదిలిపెట్టారు. సిట్ దర్యాప్తు బృందం మమ్మల్ని బెదిరిస్తోందని చాలామంది ట్రేడర్లు హైకోర్టుకు వెళ్లారు. దర్యాప్తు పేరుతో వృద్ధాప్యంలో ఉన్న సంబంధం లేని వారి తల్లిదండ్రులను కూడా వేధించారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిట్ చెప్పినట్టు చేసినందుకు గిరి అనే ఆయన గన్‌మెన్‌కి ఇంక్రిమెంట్‌లు ఇచ్చి స్టేట్‌మెంట్ రికార్డు చేయించుకున్నారు. మదన్ అనే మరో గన్‌మెన్ లొంగకపోవడంతో శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించారు. లాయర్ సమక్షంలో తనను విచారించమని ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టుకు ఆ మేరకు ఆదేశాలిచ్చింది. ఉద్దేశపూర్వకంగానే వారిపై చార్జిషీట్ వేయలేదు: ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు. వైయస్ఆర్‌సీపీ నాయకులను, వైయస్ జగన్‌కి సన్నిహితంగా ఉండేవారిని ఎంత ఎక్కువ కాలం వీలైతే అంతకాలం వారిని జైల్లో పెట్టడమే అజెండాగా చంద్రబాబు ఆదేశాలతో సిట్ పనిచేస్తోంది. చార్జిషీట్ వేయకపోతే డిఫాల్ట్ బెయిల్ వస్తుందనే భయంతోనే చార్జిషీట్ వేస్తున్నారు. రాజ్ కేసిరెడ్డి మీద మాత్రమే ఇప్పటివరకు చార్జిషీట్ వేశారు. ఆయన తర్వాత అరెస్ట్ అయిన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరుల మీద ఉద్దేశపూర్వకంగానే చార్జిషీట్ వేయలేదు. 90 రోజులపాటు వీరిని జైల్లో నిర్బంధించే కుట్రలో భాగంగానే ఇలాంటి దుష్ట సాంప్రదాయాలకు తెరదీస్తున్నారు. ఈ కుట్రలకు, కేసులకు వైయస్ఆర్‌సీపీ భయపడే ప్రసక్తే ఉండదు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటాం.