గిద్దలూరు సబ్ జైల్లో చెన్నారెడ్డిని పరామర్శించిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు

ప్ర‌కాశం జిల్లా: గిద్దలూరు సబ్ జైల్లో అక్రమ కేసులో అరెస్టయిన వైయస్‌ఆర్‌సీపీ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి నెమలిదిన్నె చెన్నా రెడ్డి ని ప్రకాశం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా జైలు వద్ద మీడియాతో మాట్లాడిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి .. చెన్నా రెడ్డిపై పెట్టిన కేసులు పూర్తిగా రాజకీయ ప్రేరితమైనవని ఆరోపించారు. ప్రజల పక్షాన, పార్టీ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడిని భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్ర‌శ్నించేవారిని అణచివేయడం సరికాదని, ఇలాంటి చర్యలకు వైయస్‌ఆర్‌సీపీ భయపడదని స్పష్టం చేశారు. పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను దాచలేరని పేర్కొంటూ, న్యాయం త్వరలోనే వెలుగులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చెన్నా రెడ్డి  విడుదల కోసం పార్టీ తరఫున అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రాహ్మణానంద రెడ్డి , మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాస రెడ్డి, సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Back to Top