రైతులను మోసం చేసేందుకే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం

వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

 తాడేపల్లి: ప్రత్యేక అసెంబ్లీ సమావేశంపై వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులను మభ్యపెట్టడానికే ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. శుక్ర‌వారం మల్లాది విష్ణు మీడియా మాట్లాడుతూ, అమరావతి నిర్మాణం కోసం తొలి విడతలో భూములు ఇచ్చిన రైతులకే ఇప్పటికీ న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండవ విడత రైతులను కూడా మోసం చేయడానికే చట్టబద్ధత పేరుతో ప్రభుత్వం డ్రామా చేస్తోందని విమర్శించారు.

అమరావతి ప్రాంతానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, ఈ విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. అయితే అమరావతిలో జరుగుతున్న అవినీతికే తమ వ్యతిరేకత అని తెలిపారు. గుంటూరు–విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, పోర్టు సిటీ నిర్మాణం లక్ష్యంగా బందర్ పోర్ట్ పనులు కూడా ప్రారంభించామని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతికి చట్టబద్ధత పేరుతో అవినీతి చేస్తోందని ఆరోపించారు. అదే ఉద్దేశంతో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేసిన మల్లాది విష్ణు, శాసన మండలిని సమావేశపరచకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.
 

Back to Top