విజయనగరం జిల్లా: చైత్ర శుద్ధ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, స్వయంవ్యక్త క్షేత్రమైన రామతీర్థ పుణ్యధామం భక్తి పారవశ్యంతో కళకళలాడింది. శ్రీరామనవమి సందర్భంగా ఆలయం వద్ద భక్తుల రద్దీ నెలకొని ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది. ఈ పవిత్ర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝన్సీ లక్ష్మి కుటుంబ సమేతంగా రామతీర్థ క్షేత్రాన్ని సందర్శించి, శ్రీ సీతారామ లక్ష్మణ భరత శతృఘ్న స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్రానికి విచ్చేసిన బొత్స దంపతులకు ఆలయ అధికారులు, అర్చక స్వాములు, ధర్మకర్తల మండలి సభ్యులు పూర్ణకుంభంతో, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘన స్వాగతం పలికారు. వారి తనయులు డాక్టర్ బొత్స సందీప్, డాక్టర్ బొత్స అనూష దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టువస్త్ర సమర్పణ భక్తిశ్రద్ధలతో స్వామివారికి మంగళప్రదమైన పట్టువస్త్రాలను సమర్పించిన బొత్స సత్యనారాయణ, అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గర్భగుడిలో నిర్వహించిన అభిషేకం, అర్చనల్లో కుటుంబ సమేతంగా పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ప్రజల శ్రేయస్సే లక్ష్యం ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, శ్రీరామచంద్రుని కృపాకటాక్షం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించామని తెలిపారు. ప్రతి ఇంటా శాంతి, సౌభాగ్యం, సుభిక్షం వెల్లివిరియాలని, “లోకా సమస్తా సుఖినోభవంతు” అనే సంకల్పంతో ఈ దివ్య దర్శనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి పరవశంలో మునిగిపోయారు.