గిరిజన బాలిక మృతికి కారణమైన వారిని ఉరి తీయాలి

వైయ‌స్ఆర్‌సీపీ  మ‌హిళా మాజీ ఎమ్మెల్యేలు రెడ్డిశాంతి, భాగ్య‌ల‌క్ష్మి డిమాండ్‌

శ్రీ‌కాకుళం జిల్లా పాత‌ప‌ట్నంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి, పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్య‌ల‌క్ష్మి వేరువేరుగా 
మీడియాతో మాట్లాడారు. 

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 17 ఏళ్ల గిరిజన బాలిక అనుమానాస్ప‌ద మృతి బాధాక‌రం

కూట‌మి ప్ర‌భుత్వంలో మ‌హిళ‌లు, బాలిక‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువు

బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించే తీరిక కూడా హోంమంత్రికి లేదా?

గిరిజ‌న బిడ్డ‌కు అన్యాయం జ‌రిగితే ఆ శాఖ మంత్రి సంధ్యారాణి ఏం చేస్తున్నారు?

బాలిక మ‌ర‌ణానికి కార‌కులైన నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాలి

మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, భాగ్యలక్ష్మి డిమాండ్

శ్రీ‌కాకుళం జిల్లా:  శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో గిరిజన బాలిక అనుమానాస్పద మృతి ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి, పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వేరువేరుగా మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటనకు కారణమైన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, అవసరమైతే ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించడంతో పాటు పూర్తి న్యాయం చేయాలని కోరారు. మాజీ మ‌హిళా ఎమ్మెల్యేలు ఇంకా ఏమ‌న్నారంటే..

- బాలిక‌ను చ‌దివిస్తాన‌ని న‌మ్మ‌బ‌లికి..

బాలిక తల్లిదండ్రులు ఊరూరా తిరుగుతూ సర్కస్‌ ద్వారా జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం విజయనగరం జిల్లా ఎస్‌.కోట ప్రాంతంలో పరిచయమైన వెంకట్రావు అనే వ్యక్తి, బాలికను చదివిస్తానని నమ్మబలికి ఇంటర్‌ చదువుకోసం అక్కడే చేర్పించాడు. ఇటీవల పరీక్షలు పూర్తయిన తర్వాత బాలిక తన తల్లిదండ్రుల వద్దకు రాగా, మరుసటి రోజే తిరిగి పంపించాలని ఒత్తిడి తెచ్చాడు. ఇంగ్లీష్‌ నేర్పిస్తానని చెప్పి బాలిక‌ను త‌న వ‌ద్ద‌కు ర‌ప్పించుకున్నాడు.

- మ‌రుస‌టి రోజే మ‌ర‌ణ‌వార్త‌

అమ్మాయిని వెంక‌ట్రావు వ‌ద్ద వ‌దిలి వ‌చ్చిన మ‌రుస‌టి రోజే బాలిక ఇంటి పై నుంచి పడిపోయి మృతి చెందిందని త‌ల్లిదండ్రుల‌కు  స‌మాచారం ఇచ్చాడు. అంత్యక్రియలు త్వరగా నిర్వహించాలంటూ ఒత్తిడి చేయడం, మధ్యలోనే తల్లిదండ్రులను ఆపడం వంటి పరిణామాలు మరింత అనుమానాస్పదంగా మారాయి. అనంతరం బాలిక శ‌రీరంలో క‌ద‌లిక‌లు కనిపించడంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక శరీరంపై గాయాల గుర్తులు కనిపించడం, అత్యాచారం అనంతరం హత్య జరిగి ఉండవచ్చనే అనుమానాలు తల్లిదండ్రులు వ్య‌క్తం చేస్తున్నారు.  

- మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువు

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గిరిజన బాలిక మృతికి గల అసలు కారణాలను తక్షణమే బయటపెట్టి, నిందితులను కఠినంగా శిక్షించాలి.

- మ‌హిళా మంత్రులు ఏం చేస్తున్నారు

మ‌హిళ‌లు,  బాలిక‌ల‌పై వ‌రుస అఘాయిత్యాలు జ‌రుగుతుంటే కూట‌మి ప్ర‌భుత్వంలోని మ‌హిళా మంత్రులు ఏం చేస్తున్నారు. హోం మంత్రి అనిత పెద్ద పెద్ద డైలాగ్స్ చెబుతుంది కానీ, మ‌హిళ‌లకు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో విఫ‌లమ‌య్యారు. గిరిజ‌న శాఖ మంత్రి గుమ్మ‌డి సంధ్యారాణి ఓ గిరిజ‌న  బాలిక అనుమానాస్ప‌దంగా మృతి చెందితే ఇంత‌వ‌ర‌కు నోరు మెద‌ప‌లేదు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ్మాయిల జోలికి వ‌స్తే తాట తీస్తాన‌ని సినిమా డైలాగ్స్ చెప్పారు. నిత్యం మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు జ‌రుగుతున్నా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. ఇలాంటి ప్ర‌భుత్వం ఉండ‌టం రాష్ట్ర ప్ర‌జ‌ల దౌర్భాగ్యం.

- బాధిత కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండ‌

బాధిత కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండ‌గా ఉంటుంది. గిరిజ‌న‌ బాలికపై జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకు పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా నేతలు హెచ్చరించారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోతే పార్టీ తరఫున ఆందోళనలు చేపడతామని రెడ్డిశాంతి, భాగ్య‌ల‌క్ష్మి స్పష్టం చేశారు.

Back to Top