యుద్ధం పేరుతో ప్రజల రక్తం తాగుతున్న కూటమి ప్రభుత్వం 

రూ. 965 గ్యాస్ బండ బ్లాక్ మార్కెట్‌లో రూ. 3 వేలా? 

ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్.  

తాడేపల్లి లోని వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. 

భగ్గుమంటున్న వంటనూనె ధరలు

ఇదేనా చంద్రబాబు మీ విజనరీ పాలన?

కట్టెల పొయ్యి వాడమంటారా? 

సామాన్యుడి పొయ్యి ఆర్పేస్తున్న కూటమి సర్కార్.

మండిపడ్డ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్

రాష్ట్రంలో యుద్ధం లేదు

ఉన్నదల్లా కూటమి నేతల దోపిడీ మాత్రమే

ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్.

తాడేపల్లి: పశ్చిమ ఆసియాలో యుద్ధం సాకుతో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టించి, నిత్యావసర ధరలను ఆకాశానికి పెంచేసిందని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మండిపడ్డారు. గురువారం తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాన్య ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. సంక్షోభంలోనూ సొమ్ము చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం..  ప్రజలను పూర్తిగా గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...

- గ్యాస్ కొరత - కూటమి నేతల దోపిడీ:

రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. రూ. 965 ఉండాల్సిన గ్యాస్ సిలిండర్ బ్లాక్ మార్కెట్‌లో రూ. 3,000లకు అమ్ముతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని 'సూపర్ సిక్స్' హామీ ఇచ్చి, ఇప్పుడు యుద్ధం పేరు చెప్పి అసలు గ్యాస్ దొరకకుండా చేస్తున్నారు. గ్యాస్ ఇవ్వలేక ప్రజలను ఇండక్షన్ స్టవ్ వాడమని, కట్టెల పొయ్యి వెలిగించుకోమని సలహాలు ఇవ్వడం ఈ ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట.

- ఆకాశాన్నంటుతున్న వంటనూనె ధరలు:

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే వంటనూనె ధరలు లీటరుకు రూ. 40 నుండి రూ. 50 వరకు పెంచారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో రూ. 95 ఉన్న పామాయిల్ ధర నేడు రూ. 140కి చేరింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 168, సోయాబీన్ రూ. 162కు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. యుద్ధం ప్రభావం కంటే టీడీపీ నేతల అక్రమ సంపాదన ఆకలే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.

- దెబ్బతిన్న రాయలసీమ ఉద్యాన రైతులు:

రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేస్తానని చెప్పిన చంద్రబాబు.. యుద్ధం కారణంగా అరబ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోయి అల్లాడుతున్న అరటి, మామిడి, ఉల్లి రైతులను పట్టించుకోవడం లేదు. చిత్తూరు జిల్లాలోని 47 మ్యాంగో పల్ప్ యూనిట్లు మూతపడే స్థితిలో ఉన్నా ప్రభుత్వం కనీసం ఎంఓయూలు  చేసుకోవడం లేదు. రైతులకు భరోసా ఇవ్వడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైంది.

- పెట్రోల్ ధరల్లో ఏపీనే టాప్:

దేశంలోనే అత్యధిక పెట్రోల్ ధరలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గతంలో యువగళం పాదయాత్రలో పెట్రోల్ ధరల మీద విమర్శలు చేసిన లోకేష్.. ఇప్పుడు మంత్రిగా ఉండి ఎందుకు నోరు మెదపడం లేదు? కేంద్రంలో మీ మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తున్నప్పుడు, గ్యాస్ నిల్వల కోసం, ధరల నియంత్రణ కోసం ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదు? కనీసం కేంద్రానికి లేఖ రాసే తీరిక కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మరోవైపు గ్యాస్ ప్రభావంతో హోటళ్లు, టీ స్టాల్స్ లో ధరలు పెరుగుతుంటే... పౌరసరఫరాల శాఖ మంత్రి కనీసం ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదు. ఇవేవీ చేయకపోగా పెద్ద మాటలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల కష్టాలమీద, పాలన మీద దృష్టి పెట్టాలని  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున మొండితోక అరుణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  

● అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ.. 

- మండలి సమావేశంపై భయం:

అమరావతి పేరుతో జరుగుతున్న అక్రమాలను, అప్పులను మేము ప్రశ్నిస్తామనే భయంతోనే ప్రభుత్వం శాసనమండలి సమావేశాలను నిర్వహించడం లేదు. అమరావతికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ పేరుతో సాగే అవినీతికి, రైతులకు జరుగుతున్న అన్యాయానికి మాత్రమే మా అభ్యంతరం అని మొండితోక అరుణ్ కుమార్ తేల్చి చెప్పారు.

Back to Top