వైయస్ఆర్ జిల్లా: ఖాజీపేటలో 16 ఏళ్ల విద్యార్థిని కీర్తనను ప్రేమోన్మాది దారుణంగా గొంతు కోసి హత్య చేసిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం సమాజాన్ని కలవరపెడుతోందని, కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు. మహిళలపై ఇలాంటి దాడులను ఎట్టి పరిస్ధితుల్లోనూ క్షమించలేమన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదని వైయస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ పాలనలో మహిళల భద్రత కరువైందని, చట్టవ్యవస్థపై నేరస్తులకు ఎలాంటి భయం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా, ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో పరిపాటిగా మారాయని, చంద్రబాబు మాటలే తప్ప కఠినచర్యలు శూన్యమన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడేవారి విషయంలో పోలీసుల అప్రమత్తత కొరవడడం, సరైన నిఘా లేకపోవడమే ప్రధాన కారణమని వైయస్ జగన్ అన్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలి ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు నమోదు చేసి వేగంగా న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రేమోన్మాది దాడులకు కఠిన హెచ్చరికగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మరణించిన కీర్తన కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ దుర్ఘటనను తట్టుకునే ధైర్యం కలగాలని ప్రార్థించారు.