తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్ధాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటు, ఐడీ కార్డుల వెరిఫికేషన్, భవిష్యత్ కార్యాచరణపై కీలక సూచనలు చేశారు. అసెంబ్లీ పరిశీలకులు, పార్లమెంట్ పరిశీలకులు పార్టీకి కళ్ళు, చెవులులా పనిచేయాలని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ సంస్ధాగత నిర్మాణంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి కమిటీల ఏర్పాటు పకడ్బందీగా జరుగుతోందని తెలిపారు. కమిటీల నియామకం సక్రమంగా జరిగితే కార్యకర్తల్లో ఓనర్‌షిప్ భావన పెరుగుతుందని, భవిష్యత్‌లో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు సంక్షేమ పథకాలను క్రియాశీల కార్యకర్తల ద్వారానే ప్రజలకు చేరవేయాలన్నది పార్టీ నాయకత్వం సంకల్పమని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని, వారి ఐడీ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అయితే వెరిఫికేషన్‌లో జరుగుతున్న జాప్యాన్ని వెంటనే నివారించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇందుకోసం సోషల్ మీడియా, ఐటీ, యూత్ వింగ్స్ సభ్యులు క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్లి అక్కడికక్కడే వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను సమన్వయం చేయడానికి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పూర్తి సహకారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. వచ్చే 10 రోజులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పార్టీ విధానాలు ప్రజల్లోకి విస్తృతంగా చేరేలా సోషల్ మీడియా అకౌంట్లు, వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసి సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై అప్రమత్తంగా ఉండాలని, బూత్ లెవల్ ఏజెంట్లు బూత్ లెవల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకుని వైయస్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను కాపాడుకోవాలని, అకారణంగా తొలగించిన ఓట్లను తిరిగి నమోదు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పరిశీలకులు విస్తృతంగా పర్యటించి గ్రాస్‌రూట్ స్థాయిలో ఫోకస్ పెంచితే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని, అందరూ ఒక టీమ్‌లా కలిసి పనిచేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. టెలి కాన్ఫరెన్స్‌లో చివరిగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇంఛార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ...మీపై పార్టీ నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించి ఐడీ కార్డుల వెరిఫికేషన్, పార్టీ కమిటీలకు సంబంధించి, ఎస్ఐఆర్ విషయంలో నియోజకవర్గ సమన్వయకర్తకు సహాయకారిగా ఉంటూ క్రియాశీలకంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.