నంద్యాల: రాయలసీమ ప్రాంతానికి సాగునీటి హక్కులు సాధించుకోవడానికి పోరాటం తప్పదని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకె శైలజనాథ్ పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రాజెక్టులను సాధించుకునే వరకు ఉద్యమం కొనసాగించాలని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంతానికి సాగునీటి వనరులు కల్పించే దిశగా నంద్యాలలో కీలక సమాలోచన సమావేశం జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా నీటిని అందించే విధానంపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, ఇసాక్‌బాషా, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల బ్రిజేంద్రరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, బుడ్డా శేషారెడ్డి, శశికళారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయలసీమకు నీటి హక్కులు సాధించుకోవడం కోసం సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రాజెక్టుల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని నేతలు నిర్ణయించారు. రైతులకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యమని, అవసరమైతే ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ, రాయలసీమలో నీటి కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం వంటి ప్రధాన జలాశయాల్లో నీరు ఉన్నప్పటికీ, ఆ నీటిని వినియోగించుకునే విధంగా ప్రాజెక్టులు లేకపోవడం వల్ల ప్రాంతం ఎండబారుతోందని అన్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు పునాది వేసి, పనులు ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన, ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌ను కొనసాగించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. రైతులకు అవసరమైన నీటిని అందించడంలో విఫలమవుతున్నారని అన్నారు. రాయలసీమ అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాకుండా, సాగునీటి ప్రాజెక్టుల అమలులోనే ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తి అయితే వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని, రైతుల జీవనోపాధి మెరుగుపడుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో రాయలసీమ నీటి సమస్యపై ప్రజల్లో చైతన్యం కల్పించి, ఉద్యమాల ద్వారా హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు, రైతులు, నాయకులు కలిసి ఒకే వేదికపై పోరాటం చేస్తేనే ఫలితం వస్తుందని శైలజనాథ్ తెలిపారు. - రాయలసీమకు అన్యాయం: కాకాణి గోవర్ధన్ రెడ్డి రైతుకు అత్యవసరం నీరేనని, అలాంటి నీటి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైయస్ జగన్ గారు ముందుచూపుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించగా, చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని అడ్డుకున్నారు. ఇక్కడ ప్రజలు ఇంత పోరాటం చేస్తుంటే, చంద్రబాబు మాత్రం టిడిపి నాయకుల ద్వారా విమర్శలు చేయించే పనిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన చీకటి ఒప్పందం గురించి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం స్పందించలేదు. ప్రతి విషయంలో మరింత దిగజారుతూ వ్యవహరిస్తున్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి పాలన “స్వర్ణయుగం”. చంద్రబాబు పాలనలో కరువు, కష్టాలు కలిసి వస్తాయి, రైతులు ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. రైతుల పేరుతో పథకాలు ప్రకటించి, తరువాత వాటిని అమలు చేయకుండా మోసం చేసే చరిత్ర చంద్రబాబుది. రైతుల పేరుతో నిధులను దోచుకోవడం తప్ప, వారికి నిజమైన సాయం చేయడం చంద్రబాబుకు తెలియదు . రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పి, రైతుల సమస్యలను పక్కనబెట్టి కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. రాయలసీమ ప్రాజెక్టులను సాధించుకునేందుకు అందరూ ఏకమై ముందుకు రావాలని, అవసరమైతే తీవ్ర స్థాయిలో పోరాటానికి సిద్ధంగా ఉండాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. - రాయలసీమకు అన్యాయం జరుగుతోంది: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చంద్రబాబు రాయలసీమకు చెందినవాడే అయినప్పటికీ, ఆ ప్రాంతానికి మేలు చేయకపోవడం మనందరి దురదృష్టం. రాయలసీమ ప్రజలు తనకు ఓటు వేయలేదనే అక్కసుతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు, అందుకే ఈ ప్రాంత అభివృద్ధిపై ఆసక్తి చూపడం లేదు. శ్రీశైలం డ్యాం నిండకముందే తెలంగాణ రాష్ట్రం నీటిని తీసుకెళ్తుంటే, రాయలసీమ ప్రజలు ఎలా నీటిని వినియోగించుకుంటారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వాస్తవాలను వక్రీకరించే విధంగా వ్యవహరిస్తున్నారు. చేసిన పనులకే ప్రచారం చేసుకుంటూ అసలు అభివృద్ధి చేయడం లేదు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఏం చేశారని అడిగితే టిడిపి నాయకులు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. వైయస్ జగన్ హయాంలో అమలు చేసిన “కాపు నేస్తం” వంటి పథకాలను కూడా ప్రస్తుతం అమలు చేయడం లేదు. పథకాలు ఇవ్వకపోయినా, మద్యం డోర్ డెలివరీ చేస్తూ గ్రామాలను నాశనం చేస్తున్నారు. ఈ విధానాల వల్ల భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. రాయలసీమ సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందరూ ఏకమై పోరాటం చేయాలని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. - రాయలసీమకు చంద్రబాబు ద్రోహం: కాటసాని రాంభూపాల్ రెడ్డి నంద్యాల జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు ద్రోహం చేశారు. ముఖ్యమంత్రిగా ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదు. రాయలసీమ అంటే, రాయలసీమ ప్రాజెక్టులు అంటే చంద్రబాబుకు చులకన భావన ఉంది. రాయలసీమ రైతుల సమస్యలను పట్టించుకోకుండా, ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. నీటి ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి, రాయలసీమ హక్కుల కోసం పిడికిలి బిగించి పోరాటం చేయాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. - రాయలసీమకు న్యాయం చేయాలి: మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ మాజీ ఎంపీ తలారి రంగయ్య రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం, రాయలసీమకు అవసరమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు మాత్రం కొన్ని కోట్లు ఖర్చు చేయడానికి ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. రాయలసీమ ప్రాంతానికి సరైన నీటి వనరులు కల్పిస్తే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. కానీ నిధులు, నియామకాలు ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రావడం లేదని ఆరోపించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసిన ఆయన, ప్రాంత హక్కుల కోసం ప్రజలు “చావో రేవో” అన్నట్టుగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్ధి కోసం అవసరమైన ప్రాజెక్టులు వెంటనే చేపట్టాలని, ప్రాంత ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించాలని తలారి రంగయ్య డిమాండ్ చేశారు. - రాయలసీమ హక్కుల కోసం పోరాటం తప్పదు: గంగుల బిజేంద్ర రెడ్డి పిలుపు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం కొనసాగుతూనే ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, నీటి వినియోగంలో మాత్రం పక్క రాష్ట్రాలు లాభపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం వంటి ప్రాజెక్టులో నీరు ఉన్నా, మన రాష్ట్రం ఒక్క చుక్క కూడా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. ఇద్దరు “తోడు దొంగలు” కలిసి రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఆరోపించిన ఆయన, తాత్కాలిక నిర్మాణాల పేరుతో ప్రజల డబ్బును దోచుకుంటున్నారని అన్నారు. వారి అసలు స్వభావం తెలంగాణ అసెంబ్లీ వేదికగా బట్టబయలైందని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను పక్కనబెట్టి, మంత్రులను విదేశాలకు పంపడం ద్వారా ప్రయోజనం లేదని, రైతులకు మద్దతు ధరలు, నీటి వనరులు కల్పించడం ముఖ్యం అని స్పష్టం చేశారు. “సింగపూర్‌కు వెళ్లడం కాదు, ఇక్కడి రైతుల సమస్యలు పరిష్కరించాలి” అని అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులను సాధించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని గంగుల బిజేంద్ర రెడ్డి ప్రకటించారు. ప్రతి రైతు, ప్రతి పౌరుడు ముందుకు వచ్చి రాయలసీమ హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు.