హ‌జ్ యాత్రికుల ప‌ట్ల కూట‌మి ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం

గుంటూరు నగర వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు, ఈస్ట్ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా ఫైర్  

గుంటూరు: ముస్లిం మైనార్టీలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్ర పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గుంటూరు నగర వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు, ఈస్ట్ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా తీవ్రంగా ఖండించారు. హజ్ యాత్రికుల కనీస అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. ఈ నెల 19న హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులకు ఇప్పటివరకు వారి లగేజీ అందలేదని, గత మూడు రోజులుగా వారు వెళ్లిన బట్టలతోనే గడుపుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యాత్రికుల మందులు కూడా లగేజీలోనే ఉండిపోవడంతో వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 అధికారుల బాధ్యతారాహిత్యమే 
ఈ సమస్యపై హజ్ కమిటీ అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా స్పందన లేదని, బాధ్యత వహించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫాతిమా విమర్శించారు. విజయవాడ నుంచి నేరుగా పంపించలేకపోతే గతంలోలా హైదరాబాద్ ద్వారా పంపించాల్సిందని, ప్రస్తుతం విజయవాడ–ముంబై మార్గం ద్వారా పంపించడం వల్ల ఆలస్యం జరుగుతోందని అన్నారు. ఇలాంటి వ్యవస్థను ఎందుకు ప్రవేశపెట్టారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. బాధితుల సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రచార కార్యక్రమాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో వేలాది మంది యాత్రికులు వెళ్లినా ఇలాంటి సమస్యలు ఎప్పుడూ ఎదురుకాలేదని గుర్తుచేశారు. హజ్ యాత్రికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వచ్చిన ఆడియోలు వింటే మనసు కలచివేస్తోందని పేర్కొంటూ, ప్రభుత్వం వెంటనే స్పందించి లగేజీని చేరవేయాలని నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని నూరి ఫాతిమా హెచ్చరించారు.

 

Back to Top