రాయలసీమకు చంద్ర‌బాబు ద్రోహం

నంద్యాల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు  మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి  

 నంద్యాలలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై సమాలోచన సమావేశం

నంద్యాల జిల్లా:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని రాయలసీమ ప్రాంతానికి చంద్ర‌బాబు ద్రోహం చేశారని నంద్యాల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు  మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి  మండిప‌డ్డారు. ముఖ్యమంత్రిగా ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ అంటే, రాయలసీమ ప్రాజెక్టులు అంటే చంద్రబాబుకు చులకన భావన ఉందని విమర్శించారు. రాయలసీమ రైతుల సమస్యలను పట్టించుకోకుండా, ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. నీటి ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి, రాయలసీమ హక్కుల కోసం పిడికిలి బిగించి పోరాటం చేయాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రాజెక్టులను సాధించుకునే వరకు ఉద్యమం కొనసాగించాలని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంతానికి సాగునీటి వనరులు కల్పించే దిశగా నంద్యాలలో కీలక సమాలోచన సమావేశం జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా నీటిని అందించే విధానంపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి, ఎమ్మెల్సీలు క‌ల్ప‌ల‌తారెడ్డి, ఇసాక్‌బాషా, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, కాట‌సాని రామిరెడ్డి, గంగుల బ్రిజేంద్ర‌రెడ్డి, మాజీ ఎంపీ త‌లారి రంగ‌య్య‌, బుడ్డా శేషారెడ్డి, శ‌శిక‌ళారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. రాయలసీమకు నీటి హక్కులు సాధించుకోవడం కోసం సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రాజెక్టుల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని నేతలు నిర్ణయించారు. రైతులకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యమని, అవసరమైతే ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

రాయలసీమకు న్యాయం చేయాలి: మాజీ ఎంపీ  తలారి రంగయ్య డిమాండ్ 

నంద్యాల: మాజీ ఎంపీ తలారి రంగయ్య రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం, రాయలసీమకు అవసరమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు మాత్రం కొన్ని కోట్లు ఖర్చు చేయడానికి ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. రాయలసీమ ప్రాంతానికి సరైన నీటి వనరులు కల్పిస్తే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. కానీ నిధులు, నియామకాలు ఇవ్వడానికి చంద్ర‌బాబుకు మనసు రావడం లేదని ఆరోపించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసిన ఆయన, ప్రాంత హక్కుల కోసం ప్రజలు “చావో రేవో” అన్నట్టుగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్ధి కోసం అవసరమైన ప్రాజెక్టులు వెంటనే చేపట్టాలని, ప్రాంత ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించాలని తలారి రంగయ్య డిమాండ్ చేశారు.

 రాయలసీమ హక్కుల కోసం పోరాటం తప్పదు: గంగుల బిజేంద్ర రెడ్డి పిలుపు 

నంద్యాల: మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం కొనసాగుతూనే ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, నీటి వినియోగంలో మాత్రం పక్క రాష్ట్రాలు లాభపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం వంటి ప్రాజెక్టులో నీరు ఉన్నా, మన రాష్ట్రం ఒక్క చుక్క కూడా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. ఇద్దరు “తోడు దొంగలు” కలిసి రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఆరోపించిన ఆయన, తాత్కాలిక నిర్మాణాల పేరుతో ప్రజల డబ్బును దోచుకుంటున్నారని అన్నారు. వారి అసలు స్వభావం తెలంగాణ అసెంబ్లీ వేదిక‌గా బట్టబయలైందని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను పక్కనబెట్టి, మంత్రులను విదేశాలకు పంపడం ద్వారా ప్రయోజనం లేదని, రైతులకు మద్దతు ధరలు, నీటి వనరులు కల్పించడం ముఖ్యం అని స్పష్టం చేశారు. “సింగపూర్‌కు వెళ్లడం కాదు, ఇక్కడి రైతుల సమస్యలు పరిష్కరించాలి” అని అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులను సాధించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని గంగుల బిజేంద్ర రెడ్డి ప్రకటించారు. ప్రతి రైతు, ప్రతి పౌరుడు ముందుకు వచ్చి రాయలసీమ హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు.

 

Back to Top