రాయలసీమపై చంద్రబాబుకు ఎందుకంత‌ చులకన?

వైయ‌స్ఆర్‌సీపీ అనంత‌పురం జిల్లా అధ్య‌క్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డి ఫైర్‌

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు అర్ధాంతరంగా నిలిపివేయడం వెనుక పెద్ద కుట్ర 

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదు 

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధ‌న‌కు పోరుబాట ఉధృతం 

అనంతపురంలో వైయ‌స్ఆర్‌సీపీ రౌండ్ టేబుల్ సమావేశం 

అనంత‌పురం: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఖరిని  వైయ‌స్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.  రాయలసీమపై చంద్రబాబుకు ఎందుకంత చులకన అని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను అర్ధాంతరంగా నిలిపివేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటల మేరకే ఈ ప్రాజెక్టు పనులు ఆపేశారన్న వ్యాఖ్యలపై చంద్రబాబు ఇప్పటివరకు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని, సీమ ప్రజల ప్రయోజనాల కోసం పోరుబాటను మరింత ఉధృతం చేస్తామని అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేత అంశంపై వైయ‌స్ఆర్‌సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో అనంతపురంలోని కేటీఆర్ ఫంక్షన్ హాల్‌లో వైయ‌స్ఆర్‌సీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, శైలజానాథ్, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా  మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీమలోని ఇతర ప్రాజెక్టులకు ఇన్సూరెన్స్‌లా పనిచేస్తుందని పేర్కొన్నారు. రాయలసీమపై ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.

మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ, తెలంగాణకు తమకు వ్యతిరేకత లేదని, అయితే అక్కడి సీఎం చెప్పారని ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గమని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితేనే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తగిన స్థాయిలో నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం 854 అడుగుల స్థాయిలో నీరు తరలించడం సాధ్యం కాదని, ఈ ప్రాజెక్టు ద్వారా నీటి వాటాలను కాపాడుకోవచ్చని తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు మౌనం అనుమానాస్పదమని అన్నారు. ఒకవైపు ఈ ప్రాజెక్టును “దొంగ ప్రాజెక్టు” అని అంటూనే, మరోవైపు వేల కోట్ల రూపాయల బిల్లులు ఎందుకు చెల్లించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితేనే రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అందుతుందని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వంపై పోరాటాలను మరింత ఉధృతం చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు. 

Back to Top