రాయ‌ల‌సీమ ఎత్తిపోతలను త‌క్ష‌ణం పూర్తి చేయాలి

హంద్రీనీవా కాలువ ప‌నులు వెడ‌ల్పు చేయాలి

రౌండ్ టేబుల్ స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల తీర్మానం 

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై అనంతపురం లోని గుత్తిరోడ్డులో ఉన్న కేటీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో రౌండ్‌ టేబుల్‌ 
సమావేశం

రేవంత్ రెడ్డి కోరాడ‌ని రాయ‌ల‌సీమ లిఫ్టుని ఆపేయ‌డం సిగ్గుచేటు

ఇది రాయ‌ల‌సీమ ప్రాంత‌వాసుల మ‌నోభావాల‌ను గాయ‌ప‌ర‌చ‌డ‌మే

రేవంత్ వ్యాఖ్య‌ల‌ను ఖండించ‌క‌పోగా చంద్ర‌బాబు స‌మ‌ర్థించారు

20 టీఎంసీలతో ఏం జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించ‌డం వ్య‌వ‌సాయంపై చిన్న‌చూపే 

చంద్ర‌బాబు పాల‌న‌లో రాయ‌లసీమ ప్రాంతానికి తీర‌ని అన్యాయం 

గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ వ్యాప్తంగా ఉద్య‌మాల‌కు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి

ఉద్యమాల‌కు సిద్ధంగా ఉండాల‌ని పిలుపునిచ్చిన పార్టీ నాయ‌కులు  

అనంత‌పురం: రాయ‌లసీమ ఎత్తిపోతల ప‌థ‌కం ప‌నులు త‌క్ష‌ణం ప్రారంభించి పూర్తి చేయడంతోపాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌ర్ సామ‌ర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కుల‌కు పెంచేలా ప్రారంభించిన ప‌నుల‌ను త‌క్ష‌ణం పూర్తి చేయాల‌ని, హంద్రీ నీవా సుజ‌ల స్ర‌వంతి ప్రాజెక్టు ప్ర‌ధాన‌ కాలువ‌ వెడ‌ల్పు ప‌నులు చేప‌ట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ నాయ‌కులు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు- సమాలోచన పేరుతో అనంతపురంలోని గుత్తిరోడ్డులో ఉన్న కేటీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో వైయ‌స్ఆర్‌సీపీ  అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. డిస్ట్రిబ్యూట‌ర్ ప‌నులు పూర్తి చేసి చెరువుల‌కే కాకుండా పొలాల‌కు సైతం నీరందించాలని, క‌ర్నూలో హైకోర్టును ఏర్పాటు చేయ‌డంతోపాటు రాయ‌ల‌సీమలో లా యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. రేవంత్ రెడ్డి కోరగానే రాయ‌ల‌సీమ లిప్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును చంద్ర‌బాబు ఆపేయ‌డమంటే ఇక్క‌డి ప్ర‌జ‌ల మ‌నోభావాలు, రాయ‌ల‌సీమ అభివృద్ధిపై చిత్త‌శుద్ధి లేద‌ని చంద్ర‌బాబు అంగీక‌రించడ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. చంద్ర‌త‌బాబు ఎప్పుడు ముఖ్య‌మంత్రిగా ఉన్నా రాయ‌ల‌సీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతోంద‌ని, రాయ‌ల‌సీమ ప్రాంతాన్ని మ‌ళ్లీ వ‌ల‌స‌లు, ఆత్మ‌హ‌త్య‌లకు నిల‌యంగా మార్చేసే కుట్ర జ‌రుగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణలో నిర్మిస్తున్న అక్ర‌మ ప్రాజెక్టులు, క‌ర్నాట‌క‌లో ఆల్మ‌ట్టి ఎత్తు పెంచుతున్నా చంద్ర‌బాబు ఎందుకు నోరెత్త‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. త్రిబుల్ ఇంజిన్ స‌ర్కార్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు, రాయ‌ల‌సీమ లిఫ్టు కోసం ఎన్టీటీ అనుమ‌తులు సాధించ‌లేరా అని ప్ర‌శ్నించారు. 
వైయ‌స్సార్ గారు కృష్ణా జ‌లాల‌ను రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించ‌క‌పోయుంటే రాయ‌ల‌సీమ ఎప్పుడో ఎడారిగా మారేదని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వైయ‌స్సార్ త‌ర్వాత రాయ‌ల‌సీమలో సాగునీటి రంగానికి జీవం పోసిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్ గారికే ద‌క్కుతుంద‌ని చెప్పారు. రాయ‌ల‌సీమ లిప్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టు కోసం గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ వ్యాప్తంగా ఉద్య‌మాల‌కు సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఉద్య‌మం చేయ‌క‌పోతే భ‌విష్య‌త్ త‌రాలకు బతుకు ప్రశ్నార్థకం అయ్యే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అమ‌రావ‌తి రాజ‌ధాని త‌ప్ప చంద్ర‌బాబుకి రాయ‌ల‌సీమ క‌నిపించ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. రాజ‌ధాని చ‌ట్ట‌బ‌ద్ధ‌త కోసం శ్ర‌మించి సాధించాన‌ని పండ‌గ చేసుకునే చంద్రబాబు, రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టు ప‌ట్ల ఎందుకు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో చెప్పాల‌ని నిల‌దీశారు. చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం రాయ‌ల‌సీమ‌కు చేస్తున్న అన్యాయాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే కార్యక్ర‌మాల‌పై విస్తృతంగా చ‌ర్చ జ‌రిగేలా చూడాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు తీర్మానించారు. 

కార్య‌క్ర‌మంలో ప్రోగ్రామ్‌ కన్వీనర్,మాజీ మంత్రి శైల‌జానాథ్, అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు అనంత వెంక‌ట‌రామిరెడ్డి, పార్టీ అసెంబ్లీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, విశ్వేశ్వ‌ర్ రెడ్డి, త‌లారి రంగ‌య్య‌, మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌, పార్ల‌మెంట్ ఇన్‌చార్జి న‌రేష్ రెడ్డి, పంచాయ‌తీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు వెన్న‌పూస ర‌వీంద్ర‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గోకుల్‌, జిల్లా ప‌రిశీల‌కులు న‌రేష్ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు, పీఏసీ, సీఈసీ, ఎస్‌ఈసీ సభ్యులు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల స‌భ్యులు, కార్య‌కర్త‌లు, సాగునీటి రంగ నిపుణులు, రాయ‌ల‌సీమ మేధావులు, విద్యార్థులు, యువ‌త పెద్ద ఎత్తున హాజ‌రయ్యారు. 

వారు ఇంకా ఏమ‌న్నారంటే...

రాయ‌ల‌సీమని ఎడారిగా మార్చే కుట్ర 
- అనంత వెంక‌ట్రామిరెడ్డి, అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు 

శ్రీశైలం జ‌లాశయం నుంచి రాయ‌ల‌సీమ‌కు కృష్ణా జ‌లాల‌ను త‌ర‌లించి క‌రువు ర‌క్క‌సిని పార‌ద్రోలాల‌ని దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారు ఎంతగానో తపించి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేట‌ర్ సామ‌ర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కుల‌కు పెంచారు. కానీ ఆయ‌న ఆక‌స్మిక మ‌ర‌ణం త‌ర్వాత రాయ‌ల‌సీమ‌ను ప‌ట్టించుకునే వారే క‌రువ‌య్యారు. 2019లో వైయ‌స్ జ‌గ‌న్ గారు సీఎం అయ్యాక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌ర్ సామ‌ర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచారు. అంతేకాకుండా రాయ‌ల‌సీమ లిప్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును ప్రారంభించి 2024 జ‌న‌వ‌రి నాటికి రూ. 900 కోట్లు ఖ‌ర్చు చేసి దాదాపు 80 శాతం ప‌నులు కూడా పూర్తి చేశారు. శ్రీశైలం జ‌లాశం ద్వారా రోజుకి 3 టీఎంసీల నీరు త‌ర‌లించేలా ఈ ప్రాజెక్టుకి రూప‌క‌ల్ప‌న చేశారు. తెలంగాణకు చెందిన త‌న వారితో చంద్ర‌బాబు ఎన్జీటీలో ఫిర్యాదులు చేయించి ప్రాజెక్టులు ఆపేయించాల‌ని కుట్ర చేశాడు. అయినా లెక్క చేయ‌కుండా ప‌నులు శ‌ర‌వేగంగా న‌డిపించిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్ గారికే ద‌క్కుతుంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుమ్మ‌క్కై చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ లిప్టు ప‌నుల‌ను ఆపేశాడు. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం పూర్త‌యితే మొత్తం రాయ‌ల‌సీమతోపాటు ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల‌కు కూడా సాగునీరు అందేది. దీంతోపాటు చెన్నైకి తాగునీరు అందేది. కానీ చంద్ర‌బాబు కుట్ర రాజ‌కీయాల‌తో రాయ‌ల‌సీమ రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. రాయ‌ల‌సీమ ప్రాంతాన్ని మ‌ళ్లీ వ‌ల‌స‌లు, ఆత్మ‌హ‌త్య‌లకు నిల‌యంగా మార్చేసే కుట్ర జ‌రుగుతోంది. ఈ ప్రాజెక్టుపై పోరాడి సాధించ‌క‌పోతే రాయ‌ల‌సీమ ప్రాంతం ఎడారిగా మారే ప్ర‌మాదం ఉంది. రాయ‌లసీమ ప్రాంత ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను ప‌ణంగా పెట్టి సీఎం చంద్ర‌బాబు నిత్యం అమ‌రావ‌తి జ‌పం చేస్తున్నాడు. 

రాయ‌ల‌సీమ లిఫ్టు మా జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌
- వై.విశ్వేశ్వ‌ర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు 

ఇన్నేళ్ల త‌ర్వాత కూడా రాయ‌ల‌సీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం గురించే చ‌ర్చించుకోవాల్సి రావ‌డం మ‌న దౌర్భాగ్యం. అంద‌రూ హేళన చేసిన హంద్రీనీవాను దివంగ‌త వైయ‌స్సార్ గారు పూర్తి చేశారు. అసాధ్యమ‌న్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌ర్ ని సాధ్యం చేసి చూపించారు.  వైయ‌స్సార్ గారు కృష్ణా జ‌లాల‌ను రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించ‌క‌పోయుంటే రాయ‌ల‌సీమ ఎప్పుడో ఎడారిగా మారేది. వైయ‌స్సార్ గారి ఆక‌స్మిక మ‌ర‌ణం త‌ర్వాత రాయ‌ల‌సీమ‌కు మ‌ళ్లీ అన్యాయం జ‌రిగింది. వైయ‌స్ జ‌గ‌న్ గారు సీఎం అయ్యేవ‌రకు రాయ‌లసీమ గురించి ప‌ట్టించుక‌నే నాథుడే క‌రువ‌య్యాడు. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రారంభించ‌డం వైయ‌స్ జ‌గ‌న్ గారి సాహ‌సోపేత నిర్ణ‌యం. ఎంతో ముందుచూపుతో వైయ‌స్ జ‌గ‌న్ గారు రాయ‌ల‌సీమ లిప్టు ఇరిగేష‌న్ స్కీమ్‌ను మొద‌లుపెడితే చంద్ర‌బాబు సీఎం అయ్యాక ప‌క్క‌న పెట్టేశాడు. చంద్ర‌బాబుతో చెప్పి రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ఆపేయించాన‌ని రేవంత్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో చెప్ప‌డం రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీయ‌డ‌మే. ప్రాజెక్టును ఆపించ‌డానికి రేవంత్ రెడ్డి ఎవ‌రు?  రేవంత్ రెడ్డి మాట‌ల‌ను ఖండించ‌కుండా, ఆయ‌న్ను స‌మ‌ర్థిస్తూ టీడీపీ నాయ‌కులు మాట్లాడుతున్నారు. రాయ‌ల‌సీమ లిప్టును థెఫ్ట్ ప్రాజెక్టు అని ప‌య్యావుల కేశ‌వ్ అన‌డం సిగ్గుచేటు. రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లంటే భ‌యం, భీతి లేక‌పోవ‌డం వ‌ల్లే ఇంత తెగించి మాట్లాడుతున్నారు. దీన్ని ఎవ‌రూ తేలిగ్గా తీసుకోవ‌డానికి లేదు. రాయ‌ల‌సీమ లిప్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టు ఈ ప్రాంత ప్ర‌జ‌ల జీవ‌న్మ‌ర‌ణ స‌మస్య‌. త్రిబుల్ ఇంజిన్ అని చెప్పుకునే కూట‌మి ప్ర‌భుత్వం ఎన్జీటీ అనుమ‌తులు తీసుకురాలేక‌పోవ‌డం సిగ్గుచేటు. అమ‌రావ‌తి త‌ప్ప చంద్ర‌బాబుకి రాష్ట్ర ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు క‌నిపించ‌డం లేదు. రాబోయే రోజుల్లో రాయ‌ల‌సీమ లిఫ్టు కోసం గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్య‌మించడానికి సిద్ధంగా ఉండాలి. 

అక్ర‌మ ప్రాజెక్టుల‌పై చంద్ర‌బాబు నోరెత్త‌డం లేదు
- సాకె శైల‌జానాథ్‌, మాజీ మంత్రి

చంద్ర‌బాబు పరిపాల‌న కార‌ణంగా కృష్ణ నీటి మీద ఆధార‌ప‌డి ఉన్న రాయ‌ల‌సీమ ప్రాంతాలు రాబోయే రోజుల్లో ఎడారిగా మారే ప్రమాదం వచ్చింది. రాయ‌ల‌సీమకు హ‌క్కుగా రావాల్సిన నీటిని చంద్రబాబు రాకుండా చేస్తున్నాడు. పొరుగు రాష్ట్రం తెలంగాణ‌లో విచ్చ‌ల‌విడిగా అక్ర‌మ ప్రాజెక్టులు క‌డుతున్నా చంద్ర‌బాబులో చ‌ల‌నం లేదు. క‌ర్నాట‌కలో ఆల్మ‌ట్టి ఎత్తు పెంచుతున్నా నోరు మెద‌ప‌డం లేదు. రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల జీవితాల‌ను ఎడారిపాలు చేస్తున్నాడు. 

భ‌విష్య‌త్ త‌రాలకు తీవ్ర నష్టం 
- త‌లారి రంగ‌య్య‌, మాజీ ఎంపీ 

రాయ‌ల‌సీమ గ‌డ్డ మీద ప్ర‌తి బిడ్డ రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల గురించి తెలుసుకోవాలి. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌పై మ‌నం ఉద్య‌మించ‌క‌పోతే భ‌విష్య‌త్ త‌రాలు తీవ్రంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది. అమ‌రావ‌తి రాజ‌ధాని పేరుతో చంద్ర‌బాబు ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తూ రాయ‌ల‌సీమ‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నాడు. సీఎం చంద్ర‌బాబుతో మాట్లాడి రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని నేనే ఆపేయించాన‌ని చెప్ప‌డానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎంత ధైర్యం కావాలి? రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వంతో ఇది ఆట‌లు ఆడుకోవ‌డ‌మే. గ‌తంలోనూ అనంత‌పురం నుంచి ఎయిమ్స్‌ను త‌ర‌లించి చంద్ర‌బాబు ఈ ప్రాంతానికి తీర‌ని ద్రోహం చేశాడు. మూడు బ‌డ్జెట్‌లు అయినా రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌కు ఒక్క రూపాయి కూడా కేటాయించ‌లేదు. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని తిరిగి ప్రారంభించేదాకా ప్ర‌జా ఉద్యమాలు నిర్వ‌హించాలి. 

చంద్ర‌బాబు వ‌చ్చిన ప్ర‌తిసారీ రాయ‌ల‌సీమకు అన్యాయం
- కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే

రాష్ట్ర చ‌రిత్ర‌లో ఇరిగేష‌న్ రంగంలో ఛాంపియ‌న్ వైయ‌స్సార్ గారు మాత్ర‌మే. చంద్ర‌బాబు సీఎంగా వ‌చ్చిన ప్ర‌తిసారీ రాయ‌ల‌సీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జ‌రుగుతోంది. వైయ‌స్ జ‌గ‌న్ గారు తీసుకొచ్చిన లా యూనివ‌ర్సిటీని, హైకోర్టును త‌ర‌లించుకుపోయాడు. ఆఖ‌రుకి రాయ‌ల‌సీమ లిప్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును కూడా ఆపేశాడు. అమ‌రావ‌తి చ‌ట్ట‌బ‌ద్థ‌త పేరుతో శ్ర‌మించాన‌ని పండ‌గ చేసుకున్న చంద్ర‌బాబు, రాయ‌ల‌సీమ జిల్లాల ప‌ట్ల వివ‌క్ష చూపుతున్నాడు. అమ‌రావ‌తి కోసం పార్ల‌మెంట్‌లో తీర్మాణం చేయించిన చంద్ర‌బాబు ఎన్జీటీ అనుమ‌తుల కోసం ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డం దుర్మార్గం. నీళ్లే లేకుండా రాయ‌ల‌సీమ‌కు ప‌రిశ్ర‌మ‌లు ఎలా వ‌స్తాయో చంద్ర‌బాబు చెప్పాలి. మ‌న‌కి జ‌రుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించ‌క‌పోతే రాయ‌లసీమ ఎడారిగా మారే ప్ర‌మాదం ఉంది. ఈ ప్రాంత ప్ర‌జ‌ల్ని జాగృతం చేయ‌డానికి మేథావులు, నిపుణులు ముందుకురావాలి. 

 ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి
- వెంక‌ట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థకం ఆవ‌శ్య‌త‌క‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించే బాధ్య‌త ప్ర‌తి వైయ‌స్ఆర్‌సీపీకార్య‌క‌ర్త‌కు ఉంది. కూట‌మి హ‌యాంలలో రాయ‌ల‌సీమ ప్రాంతానికి జ‌రుగుతున్న న‌ష్టాన్ని వివ‌రించాలి. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో రాయ‌ల‌సీమ ప్రాంతంలో చేప‌ట్టిన సాగు నీటి ప్రాజెక్టుల కోసం చేసిన కృషి ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. 

జైలుకెళ్ల‌డానికైనా సిద్ధం కావాలి
- మెట్టు గోవింద‌రెడ్డి, రాయ‌దుర్గం స‌మ‌న్వ‌య‌క‌ర్త

రాయ‌ల‌సీమ ప్రాంత అభివృద్ధి కోసం లాఠీ దెబ్బ‌లు తిన‌డానికైనా, జైళ్ల‌లో మ‌గ్గ‌డానికైనా వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు సిద్ధంగా ఉండాలి. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై ప్ర‌జ‌ల్లో పోరాట స్ఫూర్తి రగిలించేలా కార్యాచ‌ర‌ణ సిద్ధం చేయాలి. 

చంద్ర‌బాబుకి సిద్ధ రామ‌య్య‌ను ప్ర‌శ్నించే ధైర్యం లేదు
- గోరంట్ల మాధ‌వ్‌, మాజీ ఎంపీ

రాయ‌ల‌సీమ‌లో పుట్టి రాయ‌లసీమ ప్రాంతానికి చంద్ర‌బాబు తీర‌ని ద్రోహం చేస్తున్నాడు. రాయ‌ల‌సీమ‌ను రేవంత్‌రెడ్డికి తాక‌ట్టు పెట్టి గిఫ్టులు తెచ్చుకుంటున్నాడు. తెలంగాణ‌లో అక్ర‌మ ప్రాజెక్టులు, క‌ర్నాట‌క‌లో ఆల్మ‌ట్టి ఎత్తు పెంపుపై మాట్లాడ‌టానికి చంద్ర‌బాబుకి భ‌యం. క‌ర్నాట‌క ప్రభుత్వం అప్ప‌ర్ భ‌ద్ర‌లో విలాసాగ‌ర్ అనే ప్రాజెక్టును అక్ర‌మంగా నిర్మిస్తున్నా సీఎం చంద్ర‌బాబు అడ్డుకోవ‌డం లేదు. అది పూర్త‌యితే భైర‌వానితిప్ప ప్రాజెక్టుకి చుక్క నీరు కూడా వ‌చ్చే అవ‌కాశం లేద‌ని తెలిసినా క‌ర్నాట‌క సీఎం సిద్ధ రామ‌య్య‌ను ప్ర‌శ్నించ‌డానికి చంద్ర‌బాబుకి భ‌యం. క‌ళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే సైతం దానిపై నోరు మెద‌ప‌క‌పోవ‌డం దుర్మార్గం.  

రైతుల‌ను మోసం చేయ‌డం సుల‌భ‌మ‌ని చంద్ర‌బాబు ఆలోచ‌న‌
- కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి, నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు 

రాష్ట్రంలో వ్య‌వ‌సాయం, సాగునీటిరంగం గురించి మాట్లాడాల్సి వ‌స్తే వైయ‌స్సార్ గారికి ముందు, తర్వాత అని చెప్పుకోవాలి. రైతుల క‌ష్టం తెలిసిన వ్య‌క్తిగా సాగునీటి ప్రాజెక్టుల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసి వ్య‌వ‌సాయాన్ని పండ‌గ చేసి చూపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రైతుల ప్ర‌యోజ‌నాల‌ను చంద్రబాబు తాక‌ట్టుపెట్టాడ‌ని తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిన క్ష‌ణ‌మే ఆయ‌న సిగ్గుతో చ‌నిపోయి ఉండాలి. రేవంత్ మాట‌ల‌ను చంద్ర‌బాబు ఖండించ‌క‌పోగా 20 టీఎంసీల‌తో ఏమొస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌ను ఎదురు ప్ర‌శ్నించ‌డం సిగ్గుచేటు. 20 టీఎంసీలు ఒక లెక్కా అని మాట్లాడ‌టం అంటే, చంద్ర‌బాబుకి వ్య‌వ‌సాయం అంటే ఎంత చిన్న‌చూపో అర్థమ‌వుతుంది. ఓటుకి కోట్లు కేసులో 
ఇరుక్కున్న చంద్ర‌బాబు, రాత్రికి రాత్రే హైద‌రాబాద్‌ను వ‌దిలి వ‌చ్చేశాడు. చంద్ర‌బాబుని ఎంత అస‌హ్యించుకున్నా ఆయ‌న అస్సలు ప‌ట్టించుకోడు. సంక్షోభాల‌ను, యుద్ధాల‌ను త‌నకు అనుకూలంగా విశ్లేషిస్తాడే కానీ ఏనాడూ ప‌రిష్కారం కోసం ఆలోచించ‌డు. స్కాముల కోస‌మే చంద్ర‌బాబు స్కీములు మొద‌లుపెడ‌తాడు. అన్న‌దాత‌ను అడ్డుపెట్టుకుని త‌న కార్య‌క‌ర్త‌ల జేబులు నింపుతున్నాడు. నీరు- చెట్టు పేరుతో దొంగ బిల్లులు చేసి టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు దోచిపెట్టాడు. అమ‌రావ‌తిని బంగారు బాతులాగా వాడుకుంటున్నాడు. ప్ర‌జాద‌ర‌ణ లేక‌పోవడంతో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నాడు. రైతుల‌ను మోసం చేయ‌డం సుల‌భ‌మ‌ని చంద్ర‌బాబు ఆలోచ‌న‌. అందుకే చంద్ర‌బాబు ఎప్పుడు దిగిపోతాడా అని ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు.

Back to Top