రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లుపై చర్చ 

రక్షణ బడ్జెట్ పెంపు, సెస్‌ల రద్దుపై వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి కీలక సూచనలు 

 ఢిల్లీ: రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఎంపీ నిరంజన్ రెడ్డి పాల్గొని పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశ రక్షణకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.

దేశ భద్రత దృష్ట్యా రక్షణ బడ్జెట్‌ను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ జీడీపీలో రెండు శాతం లోపే రక్షణ ఖర్చు జరుగుతుండగా, అందులో సింహభాగం జీతాలు, పెన్షన్లకే వెళ్తోందని వివరించారు. అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవడం, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు అధిక నిధులు కేటాయించడం అత్యవసరమని సూచించారు.

అన్ని రకాల సెస్‌లను రద్దు చేసి, దేశ రక్షణ కోసం ప్రత్యేకంగా “డిఫెన్స్ సెస్” మాత్రమే విధించాలని ఆయన ప్రతిపాదించారు. ఆ సెస్ ద్వారా వచ్చే నిధులను కేవలం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌కే వినియోగించాలని సూచించారు.

ఇక న్యాయవ్యవస్థపై కూడా ఎంపీ నిరంజన్ రెడ్డి దృష్టి సారించారు. ప్రస్తుతం దేశ జీడీపీలో కేవలం 1.5 శాతం మాత్రమే న్యాయవ్యవస్థకు కేటాయిస్తున్నారని, ఇది తగినంత కాదని అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు ఐదు కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయని, ప్రతి ఏడాది సుప్రీంకోర్టులోనే 70 వేల కేసులు నమోదవుతున్నాయని వివరించారు.

జడ్జిలపై పని భారం అధికమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్న 36 మంది న్యాయమూర్తుల సంఖ్యను కేసుల పరిమాణానికి అనుగుణంగా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థ బలోపేతం కోసం మరిన్ని నిధులు కేటాయించడం అత్యవసరమని పేర్కొన్నారు.
 

Back to Top