నరసరావుపేట: పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ఏర్పాటు ఘనత ముమ్మాటికీ వైయస్ఆర్‌సీపీకే దక్కుతుందని, జగన్‌గారు సీఎంగా ఉండగానే రూ.217 కోట్లు వెచ్చించి 90 శాతం పనులు పూర్తి చేశారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. నరసరావుపేటలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్ఆర్‌సీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే 2024 జూన్‌లోనే కాలేజీని ప్రారంభించి ఉండే వారమని, దాని ద్వారా స్థానికంగా మంచి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేవని ఆయన తెలిపారు. 2019లో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలలకే పల్నాడులో మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఏర్పాటు చేయాలని వైయస్ జగన్ గారిని కోరితే తొలి బడ్జెట్‌లోనే రూ.200 కోట్లు కేటాయించారని, వెంటనే 50 ఎకరాలు భూములు సేకరించి కోవిడ్ సంక్షోభం ముగిసిన వెంటనే పనులు ప్రారంభించినట్టు చెప్పారు. ప్రెస్‌మీట్‌లో కాసు మహేష్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: బహిరంగ చర్చకు సిద్ధమా?: మా ప్రభుత్వ హయాంలో పిడుగురాళ్లలో మెడికల్ కాలేజీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తే, ఆ కాలేజీ ప్రాశస్త్యం తెలియకుండా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎద్దేవా చేస్తూ.. పోస్టుమార్టమ్ చేయడానికా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అని మాట్లాడారు. మళ్లీ ఇప్పుడు పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ తమ ఘనత అంటూ నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రజా ఉద్యమంతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కుట్రలు వికటించడంతో గతిలేని పరిస్థితుల్లోనే 90 శాతం పూర్తయిన పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని రెండేళ్ల తర్వాత ప్రారంభించాలని నిర్ణయించారు. కూటమి నాయకులకు దమ్ముంటే మెడికల్ కాలేజీ నిర్మాణంపై బహిరంగ చర్చకు సిద్ధమా? ప్రజారోగ్యంపై చంద్రబాబుకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రభుత్వమే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. మా హయాంలో 7 మెడికల్ కాలేజీలు పూర్తి: పల్నాడుతో పాటు రాష్ట్రంలోని అనేక వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించే లక్ష్యంతో జగన్‌గారు పని చేశారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడంతోపాటు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 7 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభించడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆపేయడమే కాకుండా పీపీపీ మోడల్‌లో ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయంపై వైయస్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో, టెండర్లలో పాల్గొనడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక టెండర్లను రద్దు చేసి మెడికల్ కాలేజీలను మళ్లీ ప్రభుత్వపరం చేస్తామన్న జగన్ గారి హెచ్చరికలతో ప్రైవేటు సంస్థలు వెనకడుగు వేశాయి. ప్రైవేటీకరణకు కేంద్రం అంగీకరించలేదని..: వాస్తవ పరిస్ధితి ఇలా ఉంటే పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ప్రారంభిస్తున్నట్టు కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ సాయంతో నిర్మాణం జరుపుకొన్న పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ప్రైవేటుపరం చేస్తామంటే కేంద్రం అంగీకరించక పోవడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో దాన్ని పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. కాలేజీలను పూర్తి చేసేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకురాక, ప్రైవేటీకరణకు కేంద్రం ఒప్పుకోకపోవడంతో గతిలేని పరిస్థితుల్లోనే దాదాపు పూర్తయ్యే దశలో ఉన్న పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ప్రారంభించడానికి చంద్రబాబు ముందుకొచ్చారు. అంతే కానీ ఈ ప్రాంత ప్రజలపై ప్రేమ వల్ల కాదు. చంద్రబాబు నాలుగోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తున్నా నేటి వరకు కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని ఏర్పాటు చేసింది లేదు. ఆనాడే ఆస్పత్రి నిర్మాణం. పరికరాల ఏర్పాటు: వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ అయిపోయిన వెంటనే పిడుగురాళ్లలో జాతీయ రహదారి పక్కన 50 ఎకరాల్లో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. భవనాలు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు, ఆస్పత్రికి కావాల్సిన అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ కాలేజీ మాత్రమే కాకుండా నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు కూడా కేంద్రం నుంచి అనుమతి లభించింది. వాటి భవన నిర్మాణ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. 2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి గురజాల మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం రూ. 217 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని రెండేళ్లుగా పక్కన పెట్టేయడంతో కూటమి ప్రభుత్వం, పల్నాడు ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి ఉండదని గ్రహించి గతి లేని పరిస్థితుల్లో, ఈ కాలేజీ ప్రారంభించడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందని కాసు మహేష్‌రెడ్డి వివరించారు.