మదనపల్లె: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మదనపల్లె నియోజకవర్గంలోని పలు రామాలయాల్లో జరిగిన వేడుకల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ శ్రీరామ చంద్రుని ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మదనపల్లె మండలం చిప్పిలి, మున్సిపాలిటీ 6వ వార్డు, కోళ్లబైలు పంచాయతీ బయారెడ్డి కాలనీ, నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లె, అలాగే మదనపల్లె టౌన్ సొసైటీ కాలనీలోని రామాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు, సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు నిస్సార్ అహమ్మద్‌కు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన పానకం, వడపప్పు, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. తరువాత మీడియాతో మాట్లాడిన నిస్సార్ అహమ్మద్, సీతారాముల కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. రాములవారి అనుగ్రహంతో కరువు కాటకాలు తొలగి, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలందరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో ప్రసాద్‌బాబు, విఎస్.రెడ్డి, రేవతి, బయ్యరెడ్డి, నాగరాజా, శ్రీకాంత్, చరణ్, ఎన్.బాయరెడ్డి, మల్లయ్య, ఎస్.నాగమణి తదితరులు, స్థానిక వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.