సుప్రియ దాడి చేసినట్టు ఆధారాలు చూపించండి 

నోట్‌ రిలీజ్‌ చేస్తే పోలీసుల తప్పులు ఒప్పులై పోవు 

పోలీస్‌ స్టేషన్‌ సీసీ టీవీ ఫుటేజ్‌లు మీడియాకు ఇవ్వాలి

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) డిమాండ్‌

కృష్ణా జిల్లా పామర్రులో మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్‌కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)

సుప్రియ సోదరుడు దొంగతనం చేసుంటే ఆధారాలేవి? 

వీడియో ఉంటే ఎందుకు బయట పెట్టడం లేదు? 

అక్రమ కేసులతో బలహీనులను భయపెట్టడం తప్పు 

సుప్రియ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంది

అవసరమైతే ఎన్‌హెచ్చార్సీపీలో ఫిర్యాదు చేస్తాం 

ప్రెస్‌మీట్‌లో పేర్ని నాని, కైలే అనిల్‌కుమార్‌ వార్నింగ్‌

పామర్రు: పోలీసుల మీద తాను అసత్య ఆరోపణలు చేసినట్టు వారు నోట్‌ రిలీజ్‌ చేసి ఊరుకుంటే సరిపోదని, నర్సింగ్‌ విద్యార్థిని జుజ్జువరపు సుప్రియ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని పామర్రు పోలీస్‌ స్టేషన్‌ సీసీ టీవీ ఫుటేజ్‌లు రిలీజ్‌ చేసి పోలీసులే నిరూపించుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) డిమాండ్‌ చేశారు. పామర్రు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో, ఆ నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌తో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఐ, ఎస్సైలు మహిళా హోంగార్డుతో సుప్రియ మీద దాడి చేయించింది వాస్తవం కానప్పుడు.. సంఘటనకు సంబంధించిన పూర్తి వీడియోలను 24 గంటల్లో మీడియాకు రిలీజ్‌ చేయాలని తేల్చి చెప్పారు. బాధితురాలి సోదరుడు తేజ దొంగతనం చేసినట్టు ఆధారాలున్నాయని చెబుతున్న పోలీసులు వాటిని ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా పోలీసుల పేరుతో మీడియా వాట్సాప్‌ గ్రూప్‌లకు నోట్‌ రిలీజ్‌ చేసి ఊరుకుంటే వారు చేసిన తప్పులు ఒప్పులైపోవని స్పష్టం చేశారు. పోలీసుల తప్పేమీ లేదని నిరూపిస్తే వారికి క్షమాపణలు చెప్పడానికి తాను సిద్ధమని పేర్ని నాని ప్రకటించారు. 
    సుప్రియ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని కైలే అనిల్‌ కుమార్‌ స్పష్టం చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోతే ఎన్‌హెచ్చార్సీలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పోలీసుల అండతో ఎమ్మల్యే పామర్రు నియోజకవర్గాన్ని పేకాటకు అడ్డాగా మార్చేశారని కైలే అనిల్‌ కుమార్‌ ధ్వజమెత్తారు. 
ప్రెస్‌మీట్‌లో పేర్ని నాని ఇంకా ఏం మాట్లాడారంటే..:

నాది తప్పయితే క్షమాపణలు చెబుతా:  
    జుజ్జువరపు సుప్రియ అనే నర్సింగ్‌ విద్యార్థిని మీద పోలీసులు అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టి రిమాండ్‌ కి పంపారు. అయితే అంతకు ముందు సీఐ, ఎస్సై ఆమె పట్ల అనుచితంగా వ్యవహరించలేదని, ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు కాబట్టి 108 వాహనంలో తీసుకెళ్ల లేదని సిబ్బంది చెప్పినట్టు పోలీసులు తమ లేఖలో వివరించారు. బాధితురాలు సుప్రియ దళిత కులానికి చెందినది అయితే మహిళా హోంగార్డు కూడా ఎస్టీయే అంటూ చెప్పుకొచ్చారు. ఆమెకున్న అరకొర పరిజ్ఞానంతో పోలీసులను బెదిరించిందని అందులో వివరించారు. 
    పోలీసులు ఈ లేఖలో పేర్కొన్నవన్నీ నిజాలే అయితే సంఘటన జరిగిన 21వ తేదీ శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు పోలీస్‌ స్టేషన్‌ వీడియో ఫుటేజ్‌ మీడియాకు రీలీజ్‌ చేయాలి. వారు చెప్పినట్టు జుజ్జువరపు సుప్రియ పోలీసుల మీద దాడి చేసి హోంగార్డు మీద హత్యాయత్నం చేసి ఉంటే నేను పోలీసులకు క్షమాపణలు చెప్పడానికి సిద్ధం. నేను ప్రెస్‌మీట్‌ పెట్టిన 24 గంటల గడవక ముందే ఎలాగైతే ఈ నోట్‌ను మీడియాకు రిలీజ్‌ చేశారో.. అదేవిధంగా ఆ వీడియోలను కూడా ఈ ప్రెస్‌మీట్‌ తర్వాత 24 గంటల్లోపు మీడియాకు వాట్సాప్‌ చేయాలి. యువతి తమ్ముడు తేజ దొంగతనం చేసినట్టు సీసీ టీవీ ఫుటేజ్‌ ఉందని చెబుతున్న పోలీసులు, వాటిని కూడా బయట పెట్టాలి. ఆధారాలుంటే సొమ్ము రికవరీ చేశారా? రాష్ట్ర చరిత్రలో గతంలో ఎక్కడైనా పేషెంట్‌ని తీసుకెళ్లకపోవడానికి కారణాలను వివరిస్తూ సంతకం పెట్టిన సందర్భం ఉందా?  కానీ ఈ కేసులో జరిగింది. పోలీసులు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూడటం సిగ్గుచేటు. 

సుప్రియ కుటుంబానికి న్యాయం జరిగేదాకా విశ్రమించం 
:కైలే అనిల్‌ కుమార్‌. మాజీ ఎమ్మెల్యే.

– సుప్రియకు జరిగిన అన్యాయంపై బాధ్యులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోకపోతే వారి కుటుంబాన్ని ఢిల్లీలోని జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) వద్దకు తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తాం. సుప్రియ కుటుంబానికి న్యాయం జరిగేదాకా విశ్రమించేది లేదు. వారికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంది.

Back to Top