అనంతపురం: గ్రామ స్వరాజ్య సాధనకు మళ్లీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరమని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. శింగణమల నియోజకవర్గంలో పదవి విరమణ చేసిన వైయస్ఆర్‌సీపీ సర్పంచ్‌లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పంచాయతీరాజ్ అధ్యక్షుడు భాస్కర్ అధ్యక్షతన, మాజీ మంత్రి శైలజనాథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. సాకే శైలజానాథ్, సర్పంచ్‌లను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించారని, ప్రజలకు నిస్వార్థంగా సేవలందించి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో గాంధీజీ ఆలోచించిన గ్రామ స్వరాజ్య లక్ష్యంతో పాలన కొనసాగిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. గ్రామ స్వరాజ్యాన్ని తిరిగి సాధించాలంటే జగన్‌మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొని సర్పంచ్‌ల సేవలను అభినందించారు. గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వారు చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.