కూటమి పాలనలో అత్యవసర సేవలు శూన్యం

వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత ఆవేదన 

నెల్లూరు జిల్లా:  కూట‌మి పాల‌న‌లో అత్య‌వ‌స‌ర సేవ‌లు శూన్య‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత ఆవేదన వ్య‌క్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత‌ సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌లో వారి నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పడంతో పాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నిండు ప్రాణం పోయిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురాలేం. ఈ ఘటన ఎంతో బాధాకరం. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి” అని అన్నారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అత్యవసర సేవలు పూర్తిగా కుప్పకూలాయని ఆరోపించారు. ప్రమాదాల సమయంలో కీలకమైన 108 అంబులెన్స్ సేవలు సమయానికి అందకపోవడం వల్ల అనేక ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. “108కు ఫోన్ చేసినా 20–25 నిమిషాల పాటు స్పందన రాని పరిస్థితి నెలకొంది. సమయానికి అంబులెన్స్ వచ్చి ఉంటే కొంతమంది ప్రాణాలు కాపాడవచ్చును” అని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ వాహనాలు, బస్సుల నిర్వహణపై కఠిన నియంత్రణలు అమలు చేయాలని, తరచూ తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, సాంకేతిక లోపాలపై రవాణా శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కంటే కక్షసాధింపులకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శిస్తూ, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. “కేవలం నష్టపరిహారం చెల్లించడం సరిపోదు. ఇటువంటి దారుణ ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలి” అని స్పష్టం చేశారు. మృతుడు వెంకటేశ్వర్లుకు నివాళులర్పిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని దేవుణ్ణి ప్రార్థించారు. అలాగే ఇటీవల ప్రమాదానికి గురైన శ్రీను అనే వ్యక్తిని కూడా పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
 

Back to Top