పల్నాడు: మెగా డీఎస్సీ-2025లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పల్నాడు జిల్లా వైయస్ఆర్‌సీపీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎస్సీ నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ యువజన నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మెగా డీఎస్సీ పూర్తిగా అవకతవకలు, అవినీతితో నిండిపోయిందని ఆరోపించారు. మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, భారీ మొత్తాలకు ఉద్యోగాలను విక్రయించారని విమర్శించారు. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగి ఉంటే మెరిట్ లిస్టును ఎందుకు ప్రకటించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాలకు ముందే మెరిట్ లిస్టులు ప్రకటించేవారని, ప్రస్తుతం వేలాది పోస్టులను భర్తీ చేసినప్పటికీ పూర్తి వివరాలు వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. స్పోర్ట్స్ కోటా కింద జరిగిన నియామకాలపైనా అనేక సందేహాలు ఉన్నాయని, వాటిపై స్వతంత్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని, లేదంటే నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. డీఎస్సీ రాసిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని, పూర్తి మెరిట్ జాబితాను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.