ఢిల్లీ: వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైయస్ఆర్‌సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పార్టీ నేత లోకేష్ రెడ్డిల బృందం గురువారం ఉదయం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యింది. గతంలో ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్‌కు వైయస్ఆర్‌సీపీ బృందం ఫిర్యాదు చేసింది. దీంతో, ఈ అంశాలపై వివరణ ఇచ్చేందకు వైయస్ఆర్‌సీపీని ఈసీ ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఈసీ దృష్టికి పలు కీలక అంశాలను తీసుకెళ్లినట్టు పార్టీ నేతలు తెలిపారు. గత ఎన్నికల్లో చివరి గంటల్లో అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం, అసాధారణంగా ఓటర్లు పెరగడం తదితర అంశాలను ఈసీ దృష్టికి నేతల బృందం తీసుకెళ్లింది. ఈవీఎంల పనితీరుపై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదులపై వివరణ ఇచ్చేందుకు వైయస్ఆర్‌సీపీ బృందాన్ని ఈసీ ఆహ్వానించింది. దీంతో, ఈసీతో పార్టీ నేతలు చర్చించారు. అనంతరం వైయస్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ 2024 ఎన్నికల్లో ఈవీఎంలకు సంబంధించిన టెక్నికల్ అంశాలు, కొన్ని పోలింగ్ బూత్‌ల్లో చోటుచేసుకున్న అసంబద్ద విషయాలను ఎన్నికల సంఘంకు గతంలో ఫిర్యాదు చేశాం. వీటిపై మా సందేహాలకు వివరణ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం సమావేశం ఏర్పాటు చేసి, ఆహ్వానించింది. ఈ మేరకు సమావేశంలో ఓటర్ లిస్టు పెరుగుదల, ఈవీఎం టెక్నికాలిటీస్, పోలింగ్ సరళి తదితరంశాలపై చర్చలు జరిగాయి. ఏపీలోని కొన్ని నియోజకవర్గంలో ఈవీఎంల ఓట్లకు , వివి ప్యాట్ లతో పోల్చి చూడాలని కోరినా ఎన్నికల సంఘం స్పందించలేదు. నిబంధనల ప్రకారం డబ్బులు కట్టినా కూడా మ్యాచింగ్ చేయడానికి కౌంటింగ్ చేయడం లేదనే విషయంపై ఎన్నికల అధికారులను ప్రశ్నించాం. అలాగే ఈవీఎంలలో బ్యాటరీల పైన కూడా సందేహాలు ఉన్నాయి. పోలింగ్ పూర్తయ్యే సరికి బ్యారీల్లో 80 శాత చార్జింగ్ ఉంటే, నలబై రోజుల తరువాత కౌంటింగ్ సమయానికి దాదాపు 98 శాతం చార్జింగ్ ఉన్నట్లు గుర్తించాం. దీనిపైన కూడా విచారణ జరగాలని కోరాం. ఏపీలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కువ నియోజకవర్గాలలో పోలింగ్ శాతం పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 కోట్ల ఓట్లలో దాదాపు 51 లక్షల ఓట్లు చివరి గంటలో పోలవ్వడం అనేక సందేహాలకు తావిస్తోంది. దీనిపై విచారణ జరపాలని కోరాం. అయితే ఎన్నికల సంఘం అధికారులు మాత్రం వివి ప్యాట్ ల కంపారిజన్ చేయడం కుదరదని తెగేసి చెప్పారు. బ్యాటరీ చార్జింగ్ విషయంలో అవి రీచార్జ్‌బుల్ బ్యాటరీలు కావడం వల్ల చార్జింగ్ పెరగడం, తగ్గడం అంటూ జరగదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇచ్చారు. ఆరు తరువాత పోలింగ్ జరిగిన చోట్ల, ఎక్కువ శాతం పోలింగ్ నమోదైన ఘటనలపై డేటా తెప్పించుకుని పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాయచోటి నియోజకవర్గంను ఉదాహరణగా చూపించడం జరిగింది. దీనికి ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది. ఈ నియోజకవర్గం నుంచి డెటా తెప్పించుకుని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఓటర్ల పెంపుదలపై బీహార్ తరహాలో ఏపీలో కూడా స్పెషల్ ఇంటెన్సిఫై రివిజన్ చేయాలని కోరిన నేపథ్యంలో దానికి ఎన్నికల అధికారులు అంగీకరించారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్ నెంబర్ 157, 28వ పోలింగ్ బూత్ ల్లో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులకు భిన్నమైన పోలింగ్ నమోదు అయ్యింది. 28 వ బూత్‌లో వైయస్ఆర్‌సీపీ పార్లమెంట్ అభ్యర్ధికి 472 ఓట్లు వస్తే, అసెంబ్లీ అభ్యర్థికి కేవలం 1 ఓటు మాత్రమే వచ్చింది. అలాగే రాష్ట్రంలో నామమాత్రంగా ప్రభావం చూపించే కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ అభ్యర్థికి 1 ఓటు వస్తే, అసెంబ్లీ అభ్యర్థికి 464 ఓట్లు వచ్చాయి. అలాగే టీడీపీకి పార్లమెంట్ అభ్యర్థికి 8 ఓట్లు వస్తే, అసెంబ్లీకి 95 ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్ సరళిని గమనిస్తేనే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరడంతో, దీనిపై డేటా తెప్పించుకుని పరిశీలిస్తామని ఈసీ హామీ ఇచ్చింది. ఇటువంటి ఘటనల నేపథ్యంలో ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని వివరించాం. అందుకే రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో అన్ని ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగాలని సూచించాం. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానం అమల్లో ఉంది. యూఎస్, జర్మన్, యూరోప్ దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే , బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు జరగాలనేదే వైయస్ఆర్‌సీపీ పార్టీ ఉద్దేశమని వివరించాం. ఇప్పటికే మాజీ ఎంపి బెల్లాన్న చంద్రశేఖర్ తన నియోజకవర్గంలో వీవీప్యాట్‌లను లెక్కించాలని కోర్ట్‌లో కేసు వేశారు. కానీ ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించి చేతులు దులుపుకున్నారు. వీవీ ప్యాట్ లను లెక్కించేది లేదని చెబుతున్నారు. కనీసం సీసీ ఫుటేజీ అడిగినా ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. మా మార్గదర్శకాలు ఇలాగే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ఈ అనుమానాలను తొలగించేందుకు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని కోరామని` ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.