లేళ్ల అప్పిరెడ్డిని పరామర్శించిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

 గుంటూరు జిల్లా జైలులో ములాఖత్.. కూటమి అరాచకాలు ఎక్కువ కాలం సాగవన్న సజ్జల

 గుంటూరు: గుంటూరు జిల్లా జైలులో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పార్టీ నేతలు పరామర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తలశిల రఘురాం, మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, నూరి ఫాతిమా, డైమండ్‌ బాబు తదితరులు జైలుకు వెళ్లి ములాఖత్‌ ద్వారా లేళ్ల అప్పిరెడ్డిని కలిశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. వారిని జైలు లోపలికి వెళ్లకుండా పోలీసులు గేట్లు వేసి అడ్డుకున్నారు.

 కూటమి అరాచకాలు ఎక్కువ కాలం సాగవు: సజ్జల

ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితిలో కూటమి లేదన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని స్థానిక ఎన్నికల్లో గెలిచామని చెప్పుకోవడం సరికాదన్నారు.

 చట్టాన్ని దుర్వినియోగం చేశారు

పోలీసులు, కూటమి నేతలు చట్టాన్ని దుర్వినియోగం చేశారని సజ్జల ఆరోపించారు. బ్యాలెట్‌ బాక్సును అక్రమంగా తీసుకెళ్లే వారిని అరెస్టు చేయకుండా, అక్రమాలను అడ్డుకున్న లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు చేశారని అన్నారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద నుంచే కూటమి నేతలు డ్రామాలు ప్రారంభించారని పేర్కొన్నారు.

 పంచాయతీ ఎన్నికల్లోనూ అదే అరాచకం

పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని సజ్జల అన్నారు. పోలీసుల బెదిరింపులకు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు భయపడబోవన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూటమి నేతలు చట్టపరమైన శిక్షను ఎదుర్కోక తప్పదన్నారు.

 పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు: పెద్దిరెడ్డి

స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసులే కూటమికి అండగా నిలుస్తున్నారని విమర్శించారు.

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై బెదిరింపులు, అక్రమ కేసులతో ఒత్తిడి తెచ్చినా పార్టీ శ్రేణులు వెనక్కి తగ్గవని నేతలు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

Back to Top