గౌతమ్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన తీరు దుర్మార్గం

మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఆగ్ర‌హం

అర్థరాత్రి ఇంటి కిటికీని పగలగొట్టింది స్టూవర్ట్‌పురం దొంగలు కాదు.. పోలీసులు 

సివిల్ కేసును పోలీసులు అక్రమ కేసుగా మార్చారు

కూటమి ప్రభుత్వం నిర్బంధకాండను ప్రజలు తెలుసుకోవాలి

గౌతమ్‌రెడ్డి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌లు

విజయవాడ: వైయ‌స్ఆర్‌సీపీ నేత పూనురు గౌతమ్‌రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన తీరు అత్యంత దుర్మార్గమని  మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిప‌డ్డారు. కనీస నిబంధనల్ని కూడా పోలీసులు పాటించలేదని, మెయిన్‌డోర్‌ వేసుంటే వెనుక వైపు ఉన్న కిటికీని పగలగొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించారన్నారు.  అలా ప్రవేశించింది ఏ స్టూవర్ట్‌పురం దొంగలో కాదని, ఏకంగా పోలీసులే అటువంటి దుస్సాహానికి పాల్పడ్డారని అంబటి విమర్శించారు.

వైయ‌స్ఆర్‌సీపీ నేత పూనురు గౌతమ్‌రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి,  మేయ‌ర్ భాగలక్ష్మీ, శైలజారెడ్డి తదితరులు పరామర్శించారు. అనంతరం  అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  12వ తేదీ అర్ధరాత్రి పూనురు గౌతమ్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన తీరు దుర్మార్గం. కనీస నిబంధనలను కూడా పోలీసులు పాటించలేదు. మెయిన్ డోర్ వేసుంటే వెనుక వైపు ఉన్న కిటికీని పగలగొట్టారు. కిటికీని పగలగొట్టింది స్టూవర్ట్ పురం దొంగలు కాదు.. పోలీసులు. ఆ సమయంలో గౌతమ్ రెడ్డి భార్య తప్ప మరొకరు లేరు. పూనూరు గౌతమ్ రెడ్డి వైసీపీలో సీనియర్ నేత. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అభ్యర్ధిగా పోటీచేయించాలని భావించాం.  

గౌతమ్‌రెడ్డి ఇంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ చూశాక మాకు ఆశ్చర్యమేసింది. పోలీసులు ఇలా కూడా వ్యవహరిస్తారా అనిపించింది.  గండూరి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి గౌతమ్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఒక సివిల్ కేసును పోలీసులు అక్రమ కేసుగా మార్చారు. గౌతమ్ రెడ్డి పై పెట్టిన కేసు పూర్తిగా తప్పుడు కేసు. మహిళలు మాత్రమే ఉన్న సమయంలో అక్రమంగా పోలీసులు ఇంట్లోకి ప్రవేశిస్తే ఎవరికైనా భయం కలగదా. గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇంతకంటో వేరే మార్గమే లేదా?విజయవాడ పోలీస్ కమిషనర్ ,డిజిపిలను ప్రశ్నిస్తున్నా. 

మీ ఆదేశాలు లేకుండానే పోలీసులు ఇలా చేస్తారా?నేరం మోపబడిన వ్యక్తి ఇంట్లో ఇలా ప్రవేశించడం కరెక్టేనా అని హోంమంత్రి అనితను అడుగుతున్నా. ఏపీలో అరాచకం జరుగుతుందని మేం మొదట్నుంచి చెబుతున్నాం. గౌతమ్ రెడ్డిని పట్టుకోవడానికి ఇంతకంటే మరోమార్గం మీకు దొరకలేదా?, మహిళలు నిద్రిస్తున్న సమయంలో ఇలా చేయొచ్చా హోంమంత్రి సమాధానం చెప్పాలి. ఈ ఘటనను మేం తేలిగ్గా విడిచిపెట్టం...న్యాయపరంగా పోరాడుతాం. న్యాయసలహా తీసుకుని పోలీసుల పై ప్రవేట్ కేసు పెడతాం. పోలీసుల పై చర్యలు తీసుకుంటారా లేదా అనేది డీజీపీ, హోంమంత్రి సమాధానం చెప్పాలి’ అని అంబటి నిలదీశారు. 

ప్రశ్నించే వారిని కూటమి ప్రభుత్వం బెదిరిస్తోంది:  ఎమ్మెల్యే చంద్రశేఖర్‌

పోలీసులే అర్థరాత్రి దొంగల్లా ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నారని, ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ ధ్వజమెత్తారు. గౌతమ్‌రెడ్డి నిజంగా తప్పు చేసి ఉంటే పోలీసులే ఇంత దుర్మార్గంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా డీజీపీ? అని ప్రశ్నించారు. ఈ రకమైన చర్యలు అప్రజాస్వామికమని, అర్థరాత్రి మహిళలున్న సమయంలో ఇళ్లల్లోకి పోలీసులు ప్రవేశించడం కరెక్టేనా? అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం నిర్బంధకాండను ప్రజలు తెలుసుకోవాలని, అక్రమ కేసులపై వైయ‌స్ఆర్‌సీపీ న్యాయపోరాటం చేస్తుందని ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ పేర్కొన్నారు. 
 

Back to Top