‘ఫ్యాన్ అసెంబ్లీలో.. సైకిల్ స్టాండులో.. గ్లాసు క్యాంటీన్‌లో’

వైయస్ఆర్ సీపీ నేత, నటుడు పృథ్వీ

భీమవరం : చంద్రబాబును తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు ఫిక్స్ అయిపోయారని వైయస్ఆర్ సీపీ నేత, నటుడు పృథ్వీ అన్నారు. భీమవరంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజుతో కలిసి పృథ్వీ మీడియాతో మాట్లాడారు. రఘురామ కృష్ణంరాజుపై దాడి అమానుషం అని ఖండించారు. పవన్ కళ్యాణ్‌ను రీల్ స్టార్‌గా, కేఏ పాల్‌ను టీడీపీ పాల్‌గా అభివర్ణించారు. నాగబాబు, పవన్‌లు మాట్లాడే భాష సరికాదన్నారు. నటన వేరు రాజకీయం వేరు అన్నారు. రాష్ట్రంలో జగన్ సీఎం కావాలని రాజన్న రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పులి కడుపున పులే పుడుతుంది, కానీ పప్పు పుట్టదని చమత్కరించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా అనర్హుడని పృథ్వీ మండిపడ్డారు. ఆయన జీవితమంతా కాపీనే అని ఎద్దేవా చేశారు. దానికి ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టోనే నిదర్శనమన్నారు. ఇన్ని రోజులుగా చంద్రబాబు మేనిఫెస్టో ప్రవేశ పెట్టకుండా జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన తరువాత దాన్ని మార్పు చేసి ప్రవేశ పెట్టడమే దానికి నిదర్శనమన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్‌గా మారారని నిప్పులు చెరిగారు. 140 కిలోమీటర్ల వేగంతో ఫ్యాన్ తిరుగుతుందని, ఈ మూడు రోజులూ పరీక్షా సమయమన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచనలో మిగిలిన పార్టీలు ఉన్నాయని ధ్వజమెత్తారు. అన్ని కులాల వారు జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని తెలిపారు. నలభై సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు చిన్న సినిమాకు భయపడటంతోనే ఆయన దైర్యమేమిటో అర్ధం అయ్యిందన్నారు. ముస్లిం ఓట్ల కోసం ఫరూక్ అబ్దుల్లాని రాష్ట్రానికి తీసుకు వచ్చారు, ఎక్కడో ఉన్న ఏనుగును కడిగి ఆంధ్రా తీసుకు వచ్చారని తూర్పారబట్టారు. ఫ్యాన్ అసెంబ్లీలో, సైకిల్ స్టాండులో, గ్లాసు క్యాంటీన్‌లో ఉంటుందని చెప్పారు.

 

Back to Top