వర్సిటీ వీసీలపై దాడులు చేయడమే ప్రక్షాళనా?.. 

టీడీపీ తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి నాగార్జున యాదవ్‌ ఫైర్‌

వర్సిటీల ప్రక్షాళన పేరిట ఎల్లో మీడియా విష ప్రచారం

రిజిస్ట్రార్లను అడ్డంపెట్టుకొని వీసీలను డమ్మీలను చేసిన చరిత్ర చంద్రబాబుది

వైస్ చాన్సలర్లపై దాడులు చేసి, దూషించడం హేయం

ప్రొఫెసర్లనే గౌరవం లేకుండా టీడీపీ శ్రేణుల బరితెగింపు దారుణం

వైయస్ఆర్‌ విగ్రహాలు తొలగించినప్పుడు ఎన్టీఆర్ బొమ్మలూ తీయాలి కదా

చంద్రబాబు వర్సిటీలను బూతుబంగ్లాలు చేస్తే.. జగన్ గారు అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు

వర్సిటీల్లో 3,295 పోస్టులు భర్తీకి ఆదేశాలిచ్చిన చరిత్ర జగన్ గారిది

న్యాక్ గుర్తింపు పొందిన సంస్థలు బాబు పాలనలో 160, జగన్ పాలనలో 209

విద్యారంగంలో జగన్ గారు వెలిగించిన అఖండ జ్యోతిని ఆర్పేయాలనే కుట్ర చేయకండి

 

తాడేపల్లి: యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తామని టీడీపీ నేతలు చెప్తున్నారు.. యూనివర్సిటీల్లోకి వెళ్లి వీసీలపై దాడులు చేయటం ప్రక్షాళన అంటారా? అంటూ వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ మండిపడ్డారు. వీసీల కారు డ్రైవర్లపై దాడులు చేయటం ప్రక్షాళనా?. వైయ‌స్ఆర్ విగ్రహాలను తొలగించటం ప్రక్షాళనా?. మరి ఎన్టీఆర్ విగ్రహాలను ఎందుకు తొలగించలేదు?’’ అని నాగార్జున యాదవ్‌ ప్రశ్నించారు.

‘‘అనేక యూనివర్సిటీలలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వీసీలు, రిజిస్టార్లు లేరా?. ఎస్వీ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలలో చంద్రబాబు, లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరపలేదా?. యూనివర్సిటీలను చంద్రబాబు హయాంలో కులాలకు అడ్డాగా మార్చారు. చంద్రబాబు హయాంలో కంటే వైయ‌స్ జగన్ హయాంలోనే ర్యాంకింగ్ పెరిగింది. ఉన్నత విద్య విషయంలో జగన్ అనేక మార్పులు తెచ్చారు’’ అని నాగార్జున యాదవ్‌ చెప్పారు.

‘‘విదేశాల్లోని అత్యున్నత యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకుని కొత్తకొత్త పాఠ్యాంశాలు తెచ్చారు. విద్యార్థులకు ఉపయోగకరమైన పనులు చేశారు. 3,295 పోస్టుల ఖాళీలను పూర్తి చేయటానికి వైయ‌స్‌ జగన్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై కూడా కోర్టుకు వెళ్లి ఆపేసిన నీచ చరిత్ర టీడీపీది’’ అంటూ నాగార్జున యాదవ్‌ ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు వేదిక చేసిందే చంద్రబాబు, నారా లోకేష్ అని నాగార్జున యాదవ్ విమర్శించారు. వైస్ చాన్సలర్లపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడటం హేయమన్నారు. ప్రొఫెసర్లు అనే గౌరవం లేకుండా దూషించడం నీచమన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడారు. 

ప్రక్షాళన అంటే దాడులు చేయడమా?
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనివర్సిటీలన్నీ భూతల స్వర్గంగా ఉన్నాయంటూ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవేదో బాగోలేనట్టు చిత్రీకరించేలా ఎల్లో మీడియా అసత్య ప్రచారానికి పాల్పడుతోందన్నారు. యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాలంటున్నారని, ప్రక్షాళన అంటే ఎస్వీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఛాంబర్ లోకి వెళ్లి ఆయన్ను దుర్భాషలాడి, దూషించడం ప్రక్షాళన అవుతుందా అని ప్రశ్నించారు. ఎస్కే యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కారును ఆపి ఆయన్ను బూతులు తిట్టి, కారు డ్రైవర్ పై దాడి చేసి తన్నడాన్ని ప్రక్షాళన అంటారా? అని ప్రశ్నించారు. ఆంధ్రా యూనివర్సిటీలో వీసీకి, రిజిస్ట్రార్ కు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఫోన్ చేసి మిమ్మల్ని అత్యంత పాశవికంగా నడిరోడ్డుమీదే హత్య చేస్తామని బెదిరించడం ప్రక్షాళన అవుతుందా? అని ప్రశ్నించారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహాల్ని యూనివర్సిటీ క్యాంపస్ నుంచి తరలిస్తే అది ప్రక్షాళన అవుతుందా? అని ప్రశ్నించారు. మరి పద్మావతీ యూనివర్సిటీలో, జేఎన్టీయూ అనంతపురంలో, కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఉన్నాయని, వైయస్సార్, ఎన్టీఆర్ ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రులే కదా.. ఎన్టీఆర్ విగ్రహాల్ని కూడా తొలగించాలి కదా? అని ప్రశ్నించారు. 

బాబు జమానాలో వీసీలు ఎవరు? కీలక రిజిస్ట్రార్లు ఎవరు?
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీలోని వీసీలు ఎవరు, వారి దగ్గరున్న కీలకమైన రిజిస్ట్రార్లు ఎవరు అన్నది గమనించాలన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో నాగేశ్వరరావు అనే బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని చంద్రబాబు వీసీగా ప్రమోట్ చేశారన్నారు. అక్కడున్న రిజిస్ట్రార్ మీ సామాజికవర్గమే కదా? అని గుర్తు చేశారు. జేఎన్టీయూ కాకినాడలో రామలింగరాజును వీసీగా అపాయింట్ చేశారన్నారు. కానీ అప్పుడు అధికారం చెలాయించింది ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉన్న ఉదయభాస్కర్ కాదా? అని ప్రశ్నించారు. ఆయన సామాజికవర్గం ఏమిటి? ఆయన ఎవరికి అంట కాగారు? అని ప్రశ్నించారు. కౌన్సిల్ మెంబర్లుగా ఎన్ఆర్ఐ కాలేజీకి చెందిన వెంకటరావు గారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా పెడితే, జేఎన్టీయూ కాకినాడలో అధికారాన్నంతా అనుభవించింది మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కాదా? అని నిలదీశారు. ఎస్వీ యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రొఫెసర్ దామోదర్ అనే వ్యక్తి వీసీగా ఉంటే దేవరాజులు, అనురాధ అనే ఇద్దరిని రిజిస్ట్రార్లుగా చేసి వారి చేత చక్రం తిప్పించి దామోదర్ గారిని పని చేయకుండా చేసింది చంద్రబాబు గారు కాదా? ఆ రిజిస్ట్రార్ సామాజికవర్గం ఏమిటి? అని ప్రశ్నించారు. జేఎన్టీయూ అనంతపురంలో పేరుకు మాత్రమే ఒక ముస్లింకు వైస్ చాన్సలర్ గా పదవి ఇచ్చారన్నారు. కానీ అక్కడ కృష్ణయ్య అని బలమైన మీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని జూనియర్ మోస్ట్ ప్రొఫెసర్ అయినప్పటికీ రిజిస్ట్రార్ గా నియమించి మీరు అధికారాన్ని చలాయించలేదా? పెత్తందార్లుగా వ్యవహరించలేదా? అని నాగార్జున యాదవ్ నిలదీశారు. ఎస్కే యూనివర్సిటీలో వైస్ చాన్సలర్ గా వేరే వాళ్లు ఉంటే సుధాకర్ బాబును రిజిస్ట్రార్ గా చేసి, మాసినేని రామయ్యను ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా చేసి వైస్ చాన్సలర్ ను డమ్మీలుగా చేసి, వారి ప్రతిష్టను దిగజార్చి, రిజిస్ట్రార్లతో నారా లోకేష్ గానీ, చంద్రబాబు గానీ పెత్తనం చేసిన విషయాన్ని మీరందరూ మర్చిపోయారా? అని నాగార్జున యాదవ్ ప్రశ్నలు గుప్పించారు. మీరు యూనివర్సిటీలను బూతు బంగ్లాలుగా మారిస్తే... చదువుకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిన ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు వీసీలను, యూనివర్సిటీలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. నాగార్జున యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, రోశయ్య అనే బలమైన సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని రిజిస్ట్రార్ గా పెట్టి, అక్కడున్న వీసీని డమ్మీగా చేసిన వైనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తుందన్నారు. గతంలో చంద్రబాబు, నారా లోకేష్ పుట్టిన రోజులను క్యాంపస్ లో నిర్వహించిన ఫొటోలను ఈ సందర్భంగా నాగార్జున యాదవ్ మీడియాకు చూపించారు. 

విద్యా విధానంలో సంస్కరణలు జగన్ గారి హయాంలోనే..
జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా విధానంలో ఎన్నో సంస్కరణలు, విద్యా విధానంలో మార్పులు, పారదర్శకత తీసుకొచ్చామన్నారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో 50 శాతం మహిళలకే ఉండాలనే చారిత్రాత్మక నిర్ణయాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2018-19 దాకా 160 విద్యా సంస్థలకు గుర్తింపు వస్తే జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరికీ రానట్టుగా 209 సంస్థలకు న్యాక్ అక్రిడేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏ++ గ్రేడ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకటే సంస్థకు ఉంటే జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 8 సంస్థలకు వచ్చిన పరిస్థితి ఉందన్నారు. డిగ్రీలో ఇంటర్న్ షిప్ తీసుకొచ్చామన్నారు. మైక్రో సాఫ్ట్ తో ఎంవోయూ కుదుర్చుకొని 1.25 లక్షల మందికి కొన్ని కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఎడెక్స్ లెర్నింగ్ ప్లాట్ ఫాం తీసుకొచ్చి విద్యార్థులకు ప్రపంచ స్థాయిలో ఉన్న టెక్నాలజీని పరిచయం చేశామన్నారు. హార్వర్డ్, స్టాన్ ఫోర్డ్, ఎంఐటీ, ఆక్స్ ఫోర్డ్ వంటి గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఉన్న సర్టిఫికెట్లు కూడా నేరుగా విద్యార్థులకు ఇచ్చే కార్యక్రమం చేశామన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో కొత్తగా ఇంక్యుబేషన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశామన్నారు. 

పోస్టుల భర్తీ జరిగింది ఎప్పుడు?
ప్రొఫెసర్లు అని కూడా చూడకుండా వారిని చంపుతామని బెదిరించడం, వారిపైన హత్యాచారాలు చేయడం, నడిరోడ్డుపై దాడులు చేయడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం, వైస్ చాన్సలర్ ఛాంబర్లలో కుర్చీలో ఉన్న వీసీలను చొక్కా పట్టుకుని లాక్కొచ్చే హేయమైన సంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్లు చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తలవంచుకున్నారన్నారు. వైయస్సార్ హయాంలోనే యూనివర్సిటీల్లో పోస్టులు భర్తీ చేస్తే, జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3,295 పోస్టులు భర్తీ చేయాలని యూనివర్సిటీలన్నింటికీ జీవో రిలీజ్ చేస్తే తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, వారి సామాజికవర్గం వారు కోర్టులకు వెళ్లి ఆ భర్తీ ప్రక్రియను ఆపేశారన్నారు. నిజంగా ప్రక్షాళన చేయాలన్న చిత్తశుద్ధి మీకుంటే ఈ 3,295 పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలన్నారు. కొత్తగా ఆర్జీయూకేటీ, వైయస్సార్ ఆర్కిటెక్ట్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో, విజయనగరం జేఎన్టీయూ గురజాడ యూనివర్సిటీలో సుమారు 700కుపైగా పోస్టులు మంజూరు చేసిన చరిత్ర జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కిందన్నారు. దయచేసి ప్రొఫెసర్లను, వైస్ చాన్సలర్లను ఇబ్బందులకు గురి చేసి, వారి మీద దాడులు చేసి, విద్యారంగంలో జగన్ మోహన్ రెడ్డి గారు వెలిగించిన అఖండ జ్యోతిని ఆర్పేయాలనే పాపానికి ఒడిగట్టవద్దని కోరుకుంటున్నానన్నారు.

Back to Top