తాడేపల్లి: చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ అన్నారు. తిరుపతి లడ్డూపై చంద్రబాబు కుటిల రాజకీయాలను వైయస్ జగన్ బట్టబయలు చేశారని తెలిపారు.శనివారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో భరత్ మీడియాతో మాట్లాడారు. అడ్డంగా దొరికినా..: కూటమి 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి అందరి దృష్టి మళ్లించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై అసత్య, అడ్డగోలు ఆరోపణలు చేసిన చంద్రబాబు, అడ్డంగా దొరికిపోయినా పదే పదే అవే అబద్ధాలు వల్లె వేస్తున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. టీటీడీ లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ చేసిన ఆరోపణలు బెడిసి కొట్టడంతో జగన్‌గారి తిరుపతి పర్యటనపై రగడ సృష్టించారని ఆయన తెలిపారు. అంతేకాకుండా జగన్‌గారి పర్యటన సందర్భంగా తిరుపతిలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర చేశారని.. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలను రప్పించారని, ఎక్కడికక్కడ జగన్‌గారిపై దాడికి వ్యూహరచన చేశారని తెలిపారు. మరోవైపు వైయస్సార్‌సీపీ రాయలసీమ నాయకులకు నోటీస్‌లు ఇచ్చిన పోలీసులు, వారందరిని తిరుపతి రాకుండా హౌజ్ అరెస్ట్ చేశారని చెప్పారు. వీటన్నింటి నేపథ్యంలో, శాంతి భద్రతల పరిరక్షణ కోసం జగన్‌గారు తిరుపతి పర్యటన వాయిదా వేసుకున్నారని మార్గాని భరత్ తెలిపారు. తిరుపతి పర్యటన వాయిదా వేసుకుంటున్నట్లు జగన్‌గారు ప్రకటించిన తర్వాత, మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, మళ్లీ అవే అబద్ధాలు చెప్పారని మాజీ ఎంపీ గుర్తు చేశారు. మాట మార్చిన చంద్రబాబు..‘ఏఆర్ డెయిరీ పంపించిన నెయ్యిని వాడారు. అయితే అది ఎక్కడ వాడారనేది అప్రస్తుతం’.. అని చెప్పారని, అలాగే అంతకు ముందు వినియోగించిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో కల్తీ జరిగిందా? అని విలేకరులు అడిగితే.. సూటిగా సమాధానం చెప్పకుండా.. ‘ఆ తర్వాత వచ్చిన నాలుగు ట్యాంకర్లలో నెయ్యి కల్తీ జరిగింది కదా?’.. అంటూ ఎదురుప్రశ్న వేశారని గుర్తు చేశారు. అంటే అంతకు ముందు వాడిన నెయ్యిలో కల్తీ లేదని చంద్రబాబు ఒప్పుకున్నట్లే కదా? అన్న మార్గాని భరత్, తర్వాత వచ్చిన నాలుగు ట్యాంకర్లలో కల్తీ గుర్తించడంతో, వెనక్కి పంపినప్పుడు కల్తీ నెయ్యి ఎక్కడ వాడారన్న దానిపై సమాధానం లేదు కాబట్టే.. చంద్రబాబు అసంబద్ధంగా బదులిచ్చారని చెప్పారు. టీటీడీలో గతంలో ఏనాడూ నాణ్యత పరీక్ష కోసం శాంపిల్ బయటకు పంపలేదని చంద్రబాబు మరో పచ్చి అబద్ధం చెప్పారన్న ఆయన, 2022లో బెంగళూరులోని ఐసీఏఆర్‌కు పంపగా, వచ్చిన రిపోర్ట్‌ను చూపారు. రాష్ట్రమంతా పూజలు: చంద్రబాబు హిందుత్వాన్ని, తిరుమలను తన రాజకీయ ప్రయోజనాలకు ఎలా వాడుకుంటున్నారు.. ఏ రకంగా కుటిల రాజకీయాలు చేస్తున్నారనేది వివరించిన జగన్‌గారు, తిరుమల శ్రీవారి విషయంలో చంద్రబాబు చేసిన పాపం వల్ల, దేవదేవుడి ఆగ్రహం ప్రజలపై కాకుండా, చంద్రబాబుకే పరిమితం అయ్యేలా అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని నిర్దేశించారని, ఆ మేరకు రాష్ట్రమంతా ఆ కార్యక్రమం నిర్వహించామని వెల్లడించారు. అది బీజేపీవారే చెప్పాలి: బూట్లు వేసుకుని పూజలు చేసే చంద్రబాబుకి హిందూత్వం పట్ల, హిందూ సంస్కృతి పట్ల ఏం నమ్మకం ఉన్నట్లని మాజీ ఎంపీ ప్రశ్నించారు. ఈ సందర్భగా ఆయన.. అమరావతికి శంకుస్థాపన సమయంలో చంద్రబాబు ఫోటోలు చూపారు. హిందుత్వానికి టార్చ్ బేరర్స్ అని చెప్పుకునే బీజేపీకి ఇవన్నీ కనిపించవా? అని ఆయన ప్రశ్నించారు. తిరుమలలో శతాబ్దాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చివేయించిన చంద్రబాబు హిందూత్వవాది ఎలా అవుతారో బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలని అన్నారు.