విజయవాడ: పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని వైయస్ఆర్‌సీపీ నేత పూనూరు గౌతమ్‌రెడ్డి కుమార్తె లిఖిత మండిపడ్డారు. ఫోన్ చేస్తే అందుబాటులో ఉండే వ్యక్తి గౌతమ్ రెడ్డి.. పోలీసులు అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏముంది? అంటూ ఆమె ప్రశ్నించారు. సుమారు 30 మందికి పైగా కరెంట్ తీసేసి ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడ్డారన్నారు. ‘‘అసలు పోలీసులు వచ్చింది ఎందుకు?. నా తండ్రిని తీసుకెళ్లిపోవడానికా.. ఎత్తుకెళ్లిపోవడానికా.. దాచేయడానికా?.. ఏకంగా చంపేయడానికా?. పోలీసులు తీసుకెళ్లి ప్రశ్నించే పద్ధతి ఇది కాదు. పోలీసులు వచ్చిన సమయంలో మా నాన్న లేరు కాబట్టే ఆయన బతికున్నారని నేను అభిప్రాయ పడుతున్నా. మా తల్లికి 66 ఏళ్లు. ఆమెకు అనారోగ్య సమస్యలున్నాయి. అర్ధరాత్రి బెడ్ రూమ్ తలుపులు బాదుతూ ఆమెను ఇబ్బంది పెట్టారు. డోర్లు వేసుకోకుండా పడుకున్నారేంటంటూ పోలీసులు రివర్స్‌లో దబాయించారు’’ అని లిఖిత ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గౌతమ్‌రెడ్డిని ఎక్కడ దాచావ్?. ఎక్కడికి వెళ్లాడు. ఎక్కడెక్కడికి వెళ్తాడంటూ భయపెట్టారు. ఫ్రెండ్లీ పోలీస్ ... ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా?. పోలీసుల తీరు చూస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగంలాగే ఉంది’’ అని లిఖిత ఆగ్రహం వ్యక్తం చేశారు.