వినుకొండలో కూట‌మి నేత‌ల రాక్షస పాలన  

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర విమర్శలు

ప‌ల్నాడు జిల్లా : వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో కూటమి నేతల రాక్షస పాలన కొనసాగుతోందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు  బొల్లా బ్రహ్మనాయుడు  తీవ్ర స్థాయిలో విమర్శించారు. వినుకొండ పట్టణంలోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 21న మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి జన్మదినం, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూటమి నేతలు తొలగించడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే హక్కు లేదా? వినుకొండ కూటమి నేతల జాగిరా కాదని ప్రశ్నించారు. ఫ్లెక్సీలను మళ్లీ ఏర్పాటు చేస్తామని, ఈసారి ఎలా తొలగిస్తారో చూస్తామని హెచ్చరించారు.

రైతులకు యూరియా సరఫరా చేయలేని కూటమి ప్రభుత్వం.. రాష్ట్రాన్ని దేశంలో నంబర్–1గా మారుస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కు చెందిన బయో ఉత్పత్తులు వాడటం వల్ల రైతులు పంట నష్టాలు చవిచూస్తున్నారని ఆరోపించారు.

నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని చెరువులను జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తన బంధువుల ద్వారా స్వాధీనం చేసుకుని, ఆ భూములను బ్యాంకుల్లో పెట్టి కోట్ల రూపాయల రుణాలు పొందుతూ, చెరువుల ఆదాయాన్ని స్వంతంగా అనుభవిస్తున్నారని ఆరోపించారు. తమ పాలనలో నియోజకవర్గంలో సుమారు 100 మంది విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని, కూటమి నేతలు విలేకరుల కోసం ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.
మంచినీటి చెరువుకు రూ.159 కోట్ల నిధులు మంజూరయ్యాయని సంవత్సరాలుగా చెబుతున్నారని, ఆ నిధులు ఎక్కడ ఉన్నాయో, చెరువు నిర్మాణం ఎక్కడ జరిగిందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ వైద్యశాలలో సరిపడా డాక్టర్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పేషెంట్లను ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తున్న పరిస్థితి ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 100 పడకల ఆసుపత్రికి అనుమతులు తీసుకువచ్చినా, ఇప్పటివరకు నిర్మాణం పూర్తి చేయలేకపోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

హోమ్ మంత్రి బహిరంగంగా బెదిరింపులు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. గతంలో బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలకు బలులు ఇచ్చిన ఘటనలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
తమ అధినాయకుడు వైయ‌స్ జ‌గ‌న్‌ గారి పుట్టినరోజు వేడుకలకు మైక్ పర్మిషన్ కూడా ఇవ్వకుండా కేసులు పెట్టడం అన్యాయమన్నారు.

రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వలేని ప్రభుత్వం వ్యవసాయాన్ని భయంకర స్థితికి తీసుకెళ్లిందని అన్నారు. బయో ఎరువుల ధర రూ.1350 ఉంటే, రైతుల ధాన్యానికి కూడా అదే ధర రావడం దారుణమని విమర్శించారు.
రాజకీయాలు శాశ్వతం కావని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించాలని బొల్లా బ్రహ్మనాయుడు  కోరారు.

Back to Top