తాడేపల్లి: కూటమి ప్రభుత్వం రైతులను గాలికొదిలేసిందని, మద్దతు ధరకు ఒక్క బస్తా ధాన్యం కొన్నా చూపించండి అంటూ వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ సవాల్ చేశారు. ఏపీలో తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిసినా కూటమి ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు. అప్పులు తెచ్చుకుని రైతులు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఘాటు విమర్శలు చేశారు. చివరికి టీడీపీ కార్యకర్తలు కూడా ఈ ప్రభుత్వం వైఖరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చెప్పారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడారు. పంటల కొనుగోలు ప్రణాళిక లేదు: – రోడ్డు మీద ధాన్యం ఎండబోసుకున్న రైతులు, వాటిని కొనే దిక్కులేక ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుంటున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కళ్లుండి చూడలేని కబోది ప్రభుత్వం ఇది. – పంటల కొనుగోలు ప్రణాళిక రూపకల్పనలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఫలితంగా రైతులు పగలూ రాత్రీ తేడా లేకుండా ధాన్యం రాసుల దగ్గర 10–15 రోజుల పాటు కాపాలా కాయాల్సిన దుస్థితి నెలకొంది. – బుడమేరు వరదలప్పుడు విజయవాడ ప్రజలను అప్రమత్తం చేయకుండా ఎంత ఉదాసీనంగా వ్యవహరించారో, ఇప్పుడు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు విషయంలోనూ అలాగే ఉంది. – వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలున్నాయనే భరోసా రైతుల్లో ఉండేది. పంట కోతకొచ్చే సమయానికి టార్పాలిన్లు సిద్ధంగా ఉండేవి. మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసేది. – కానీ ఇప్పుడు రైతు సేవా కేంద్రాలకు (ఆర్బీకేల కొత్త పేరు) వెళ్తే, రైస్ మిల్స్‌కు వెళ్లాలని సూచిస్తూ, మోసం చేస్తున్నారు. ఈరోజు ధాన్యం తీసుకెళ్తే రెండు మూడు రోజులు అన్‌లోడ్ చేయకుండా ఉంచి, ఆ లారీకి కిరాయి వసూలు చేస్తున్నారు. – ప్రభుత్వ విధానాల వల్ల బస్తాకు రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోయేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ధాన్యం కొనుగోలు లేదు: – వాట్సప్‌లో హాయ్ అని పెడితే ధాన్యం కొంటామని, ధాన్యం కోసిన 24 గంటల్లోనే కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల గొప్పగా ప్రకటించినా, అది ఆచరణలో శూన్యం. రైతులు ఎన్ని మెసేజ్‌లు చేసినా ఆయన్నుంచి సమాధానం రావడం లేదు. ధాన్యం కొనుగోలు అంత కంటే లేదు. – కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కనీసం ఒక్క బస్తా ధాన్యం అయినా కొంటే చూపాలి. ఒక్క రైతుకు కూడా, కనీసం ఒక్క బస్తాపైనా మద్దతు ధర లభించలేదు. దాన్ని ఎక్కడైనా ఎక్కడకొచ్చినా నిరూపించడానికి మేం సిద్ధం. – మిల్లర్లు రూ.1400కు అయితేనే ధాన్యం కొంటామని చెబుతున్నారు. ప్రభుత్వం కనీసం బస్తాలు (గన్నీ బ్యాగ్స్) కూడా ఇవ్వడం లేదు. – కాగా, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో తమకు మద్దతు ధర లభించిందని రైతులు చెబుతున్నారంటూ.. మాజీ ఎమ్మెల్యే ఆ వీడియో ప్రదర్శించి చూపారు. – ధాన్యం కొనుగోళ్ల వెనుక కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోంది. రైస్ మిల్లర్లు, దళారీలు మాఫియాగా తయారై ధాన్యం కొంటున్నారు. – కృష్ణా జిల్లాలో ఒక రైస్ మిల్లర్ రైతుల నుంచి బస్తా కేవలం రూ.1300 చొప్పున మొత్తం రూ.5 కోట్ల విలువైన ధాన్యం కొని, దానికి ప్రభుత్వం వద్ద మద్దతు ధర క్లెయిమ్ చేస్తున్నాడు. త్వరలో ఆ వివరాలు కూడా బయటపెడతాం. అక్కడ ఒక్కో బస్తా మీద రూ.425 మేర అవినీతి జరిగింది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో..: – గత ప్రభుత్వంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నా మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేశారని రైతులు గుర్తు చేస్తున్నారు. ఆనాడు పార్టీలకతీతంగా రైతులకు మేలు జరిగింది. – ఇంకా అప్పుడు 39 లక్షల రైతుల నుంచి దాదాపు రూ.68 వేల కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొన్న వైనాన్ని ఈరోజు రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అంతే కాకుండా కేవలం 21 రోజుల్లో డబ్బులు జమయ్యేవని వారే చెబుతున్నారు. – వైయస్ఆర్‌సీపీ తొలి నుంచి రైతు పక్షపాత పార్టీ. అందుకే రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ వెల్లడించారు.