తాడేపల్లి: డీఎస్సీ-2025 నియామక వ్యవహారంపై వైయస్ఆర్‌సీపీ చేస్తున్న పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన శాంతియుత ర్యాలీలపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడిన ఘటనపై ఆయన పార్టీ నాయకులతో సమావేశమై చర్చించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగినా, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా తమ పార్టీ నేతలపైనే కేసులు నమోదు చేస్తున్న తీరును నాయకులు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనను పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందని, దాడులపై గవర్నర్‌ను కలిసి పూర్తి వివరాలు తెలియజేయాలని సమావేశంలో నిర్ణయించారు. డీఎస్సీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే దాడులు “డీఎస్సీ స్కాంలో చంద్రబాబు, లోకేష్‌లు అడ్డంగా దొరికారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? స్కాంలను బయటపెడుతుంటే దాడులకు దిగుతున్నారు. నిన్న వైయస్ఆర్‌సీపీ నిర్వహించిన ర్యాలీతో డీఎస్సీ స్కాంపై మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు దాడులు చేయించారు. ప్రజల దృష్టిని అసలు విషయం నుంచి మళ్లించేందుకు భయపెట్టే రాజకీయాలకు తెరతీశారు.” అది యువగళం టీం కాదు.. రౌడీ దళం “అది యువగళం టీం కాదు.. రౌడీ దళం. చంద్రబాబు అవినీతి, స్కాంలు, అరాచకాలను ప్రశ్నించే ప్రతి చోటా ఈ రౌడీ దళాన్ని దించుతున్నారు. వారితో దాడులు చేయించి, భయపెట్టి, బెదిరించి ప్రశ్నించే గొంతులను మూయించాలని చూస్తున్నారు. శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమంలో అలజడి సృష్టించారు. పోలీసుల వద్ద ఉన్న లాఠీలు లాక్కుని, రాళ్లతో దాడులు చేశారు. ఇలాంటి ఘటనలకు కొంతమంది పోలీసులు కూడా కొమ్ముకాస్తున్నారు.” దాడులు చేసిన వారిని వదిలేసి వైయస్ఆర్‌సీపీ నేతలపైనే కేసులా? “గాయాలపాలైనా వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు చాలా సంయమనం పాటించారు. కానీ దాడులు చేసిన రౌడీ దళంపై కేసులు పెట్టకుండా మా వాళ్లపైనే కేసులు పెడుతున్నారు. మా వాళ్లపై దాడులు చేసిన వారిని స్వేచ్ఛగా వదిలేసి, బాధితులపైనే కేసులు పెట్టడం ఏ రకమైన న్యాయం? దాడులు చేయడం, ఆ తర్వాత బాధితులపైనే కేసులు పెట్టడం, మళ్లీ అదే ఘటనను వక్రీకరించి ప్రచారం చేయడం ఒక పద్ధతిగా మారిపోయింది.” కుప్పం నుంచే దాడులకు కుట్ర చేశారా? “నిన్నటి దాడులకు కుప్పంలోనే చంద్రబాబు కుట్ర పన్నారని మాకు అనుమానం ఉంది. కుప్పం బహిరంగ సభలో చంద్రబాబు చేసిన బెదిరింపులే ఇందుకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి రౌడీ దళాలను ప్రోత్సహిస్తూ, అవినీతి, స్కాంలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైకి వీళ్లను పంపుతున్నారు. గతంలో వైయస్ఆర్‌సీపీపై జరిగిన అనేక దాడుల్లోనూ ఇదే తరహా వ్యక్తులు కనిపించారు. కళ్లముందు సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నా వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.” పోలీసుల వైఖరిపై గవర్నర్‌కు ఫిర్యాదు “చంద్రబాబు ఒత్తిళ్లతో పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు. నిన్నటి దాడుల వ్యవహారంపై గవర్నర్‌ను కలుస్తాం. మా వాళ్లు ఇచ్చిన ఫిర్యాదులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలి. రౌడీ దళాన్ని రంగంలోకి దించిన చంద్రబాబు, లోకేష్‌ల పాత్రపై కూడా విచారణ జరపాలి. పోలీసుల వ్యవహారశైలిపైనా గవర్నర్‌కు పూర్తి వివరాలు అందిస్తాం.” డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైయస్ఆర్‌సీపీ “మీ బెదిరింపులకు భయపడి డీఎస్సీ స్కాంపై పోరాటం ఆగదు. మీ దుర్మార్గాలకు భయపడి వెనకడుగు వేసేది లేదు. ప్రజల తరఫున పోరాటాల విషయంలో తగ్గేది లేదు. నిజాయితీపరులైన డీఎస్సీ అభ్యర్థులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. డీఎస్సీ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించి, వాస్తవాలను ప్రజల ముందుంచే వరకు మేం నిలదీస్తూనే ఉంటాం. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది.”