చర్చలకు ప్రభుత్వం తలుపులు తెరిచే ఉంటాయి

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి

ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం గుర్తించింది కాబట్టే.. చర్చలకు ఆహ్వానిస్తున్నాం

  ఆందోళనలు, సమ్మెల ద్వారా సమస్యను జఠిలం చేస్తున్నారు

  ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూలం, ఘర్షణాత్మక వైఖరి వద్దు

 ప్రస్తుత ఆర్థిక పరిస్ధితులలో పిఆర్సిపై ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది.

 అసాంఘిక శక్తులు,రాజకీయాలు చేసేవాళ్లకు అవకాశం ఇవ్వద్దని విజ్ఞప్తి.

ఉపాధ్యాయులకు చాలా మేలు చేశాం... కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించాం.

 మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల సంఖ్య పెరిగింది.

 టీచర్లకు సంబంధించి అనేక మంచి నిర్ణయాలు తీసుకున్నాం.

 ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు,చంద్రబాబుకు ఉద్యోగులంటే ఎలాంటి అభిప్రాయం ఉందో అందరికి తెలుసు.

 తాడేప‌ల్లి: ఉద్యోగుల ఆవేదన, ఆక్రోశాన్ని ప్రభుత్వం గుర్తించింది కాబట్టే, వాటిని పరిష్కరించేందుకు చర్చలకు ఆహ్వానిస్తున్నాం. ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం తలుపులు తెరిచే ఉంటాయని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  ప్రభుత్వ సలహాదారులు(ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.

సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏమన్నారంటే, ఆయన మాటల్లోనే...
ఉద్యోగ సంఘాలను చర్చలకు రమ్మని వారికి ఆహ్వానం పంపడం జరిగిందన్నారు. అయితే ఉద్యోగ సంఘాలు ముందుగా నిర్ణయించిన విధంగా  ఛలో విజయవాడ కార్యక్రమం జరిగింది. అక్కడ జరిగిందీ, ఉద్యోగ సంఘాల నేతల ఉపన్యాసాలు అన్నీ చూస్తే,  మేం ఏదైతే ముందునుంచి హెచ్చరిస్తున్నామో అదే కనబడింది. సమస్యను పరిష్కరించుకునే బదులు మరింత జఠిలం చేసుకునేలా ఉద్యోగుల ప్రదర్శన సాగింది. బలప్రదర్శనలా కనిపించింది. పిఆర్సి నిర్ణయం చేసేటప్పుడు ఏ బ్యాక్ డ్రాప్ లో ఆ నిర్ణయాలు జరిగాయో ప్రతిసారి వివరించడం జరిగింది. ఉద్యోగ సంఘాలకు కూడా ముఖ్యమంత్రి స్వయంగా వివరించారు. మాలాంటి వాళ్లం కూడా ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాం. కోవిడ్ నేపధ్యంలో ఆర్ధికవ్యవస్ధ కుదేలు కావడం,మళ్లీ ఇప్పుడు ఒమిక్రాన్ పరిస్ధితిలలో కోలుకోవడానికి ఎంతకాలం పడుతుందో, లెక్కలేసుకుంటే ఇప్పుడున్న ఆర్ధిక వనరులను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.అయినప్పటికి ఉన్న పరిస్ధితిలో ఎంతవరకు మేలు చేయగలమో అంత మేలు చేయడం జరిగింది.

- అధికారంలోకి రాగానే, ఐఆర్ 27 శాతం ఇచ్చి ఉన్నందువల్ల ఇప్పుడు ఇస్తున్నదానిని బేరీజు వేసుకుంటున్నారుగానీ,  కోవిడ్ నేపధ్యంలో కూడా ఉద్యోగులకు మంచి ప్యాకేజీనే ఇచ్చామని అనుకుంటున్నాం. ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి వల్ల ఉన్నపరిస్ధితులలో మార్పు తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం. కేంద్రంలోలా పది సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి తీసుకువస్తే వారికి డిఏల విషయంలో కూడా మేలు జరుగుతుందని మార్పులు చేయడం జరిగింది. వీటన్నింటిని నేపధ్యంలో ఉద్యోగసంఘాల వాదనలు చూస్తే.. పిఆర్సి ఇచ్చినప్పుడు వారు ఆశించిన విధంగా పెరగలేదనే అసంతృప్తి వారికి ఉందనేది పూర్తిగా అర్ధం చేసుకున్నాం. 

  నిజానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి ప్రతి సెక్టార్ లో ఎలా పెంచుకుంటూ వచ్చాం అనేది గమనించాలి. కాంట్రాక్ట్,అవుట్ సోర్సింగ్ వారికి భరోసా కల్పించాం.గతంలో వారికి సకాలంలో జీతాలు కూడా వచ్చేవి కావు.అవుట్ సోర్సింగ్ వారు ఏజన్సీల దయాదాక్షిణ్యాలు మీద, వారి కమీషన్ల వల్ల సకాలంలో జీతాలు రాని పరిస్ధితి నుంచి అవుట్ సోర్సింగ్ కార్పోరేషన్ పెట్టి వారి సమస్యలను చక్కదిద్దడం జరిగింది.ఇదంతా ఉద్యోగుల పట్ల ప్రేమ,అభిమానంతో వారు మా కుటుంబంలో భాగంగా చేసింది కాదా అని ప్రశ్నిస్తున్నాను. 

 ఎవరో అడిగితే చేసింది కాదు.ఉద్యోగులకు మేలు చేయాలని చేసింది.గత ప్రభుత్వం కేవలం జిఓలు మాత్రమే ఇచ్చి వెళ్తే కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ అప్లయ్ చేయడం జరిగింది.అంగన్ వాడీలు,ఆశావర్కర్ లవంటి వారికి  మూడు,నాలుగు వేల రూపాయలు వేతనాల నుంచి రీజనబుల్ లెవల్ కు తీసుకురావడం జరిగింది.ఉపాధ్యాయులకు సంబంధించి అయితే 7,8 అంశాలు పరిష్కరించాం.లాంగ్వేజ్ పండిట్లు,పిఇటిలకు అనేక దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరించాం. వారి పట్ల సానుభూతి చూపి, 2008 డిఎస్సి వారికి గాని,ఎస్జిటి లకు సంబంధించి సమస్యలను కూడా పరిష్కిరించాం.సర్వీసు కండీషన్స్ కు సంబంధించి మేలు చేయడం ఉద్యోగులపై ప్రేమతో తీసుకున్న నిర్ణయం కాదా.

  ఇవన్నీ కూడా డిమాండ్లు వచ్చాక తీసుకున్నవి కాదు.ముఖ్యమంత్రిగారి దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను కూడా వారి పట్ల సానుభూతితో పరిష్కరించడం జరిగింది. వేలాదిమంది స్కూల్ అసిస్టెంట్ లకు ప్రమోషన్లు వచ్చాయి. వీటివల్ల మేలు జరిగిన ఉపాధ్యాయులు మాకు ముఖ్యమంత్రిగారు చాలా మేలు చేశారంటూ మాకు ధాంక్స్ చెబుతూ పలు సమావేశాల్లో చెప్పిన మాటలే చెబుతున్నాను.ఉద్యోగభధ్రత కల్పించడం,ఓనర్స్ షిప్ ఇవ్వడం, ఉద్యోగులకు మేలు చేయడం,ఉద్యోగులు నా వాళ్లు అని భావించే ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి గారు,ఇప్పుడు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మాత్రమే తీసుకున్న నిర్ణయాలు. ఎన్నికల సమయంలో నాలుగు మాటలు చెప్పి వెళ్లడం కాకుండా ప్రతి నిర్ణయం లో అది కనిపించింది.

 27 శాతం ఐఆర్ ఇచ్చినప్పుడు, కచ్చితంగా దానికి మించి చేయాలని జగన్ గారు భావించారు. కాని వాస్తవ పరిస్ధితి చూస్తే సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించడం జరుగుతుంది. ఎవరికైతే ఆసరా అవసరమో వారికి ప్రభుత్వం చేయి అందించడం జరిగింది.ప్రభుత్వం ఎక్కడా దుబారా చేయడం లేదు.ఇప్పుడు పిఆర్సి తోపాటు తీసుకున్న నిర్ణయాల వల్ల  10 వేల కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడింది. ఆ నిర్ణయాల అమలు వల్ల భారం పెరుగుతుందే కాని తగ్గదు. బరువు అని భావించడం లేదు కాని ప్రస్తుత పరిస్ధితిలో అది మోయాలంటే అది కష్టం గా ఉంది. ఉన్నంతలో బెటర్ మెంటు ఇస్తూ.. సీఎస్ నేతృత్వంలోని కమిటీ సూచించిన 14.29 శాతం ఫిట్ మెంట్ ను... 23 కు తీసుకువెళ్లాం. 

 ఈరోజు ఉద్యోగ సంఘాల నాయకులు మమ్మల్ని చులకనగా చూశారని అంటున్నారు... చులకనగా చూస్తే 14.29 శాతాన్ని 23 శాతానికి ఎందుకు పెంచి ఇస్తాం. ఇదంతా సాధించినందుకు నాయకులు క్రెడిట్ ఎందుకు తీసుకోరో అర్ధం కావడం లేదు.చర్చల సందర్భంగా వారు వాదనలు వినిపించారు.ముఖ్యమంత్రిగారిని కన్విన్స్ చేసి సాధించుకున్నారు.23 శాతం ఫిట్ మెంట్ పెట్టినప్పుడు ఉద్యోగవిరమణ వయస్సు 62 ఏళ్లకు, వారు అడగకుండానే పెంచుతూ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయించారు.ఇదంతా ఓపెన్ గానే జరిగింది.

 ఉద్యోగుల పట్ల తనకు సాఫ్ట్ కార్నర్ ఉందని తెలియచేయాలని ముఖ్యమంత్రిగారు ఉదారంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.ఉద్యోగులు బాగుంటే ప్రభుత్వ పధకాలు మరింతగా ప్రజలలోకి తీసుకువెళ్లగలరని భావించారు.మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తారని అనుకున్నారు.మంచి ఉద్దేశంతో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లుగా నిర్ణయించారు.దానివల్ల ఉద్యోగులకు చాలా మేలు కలుగుతుంది.అది సిపిఎస్ ఉద్యోగులతో సహా  ప్రతి ఒక్కరికి వెసులుబాటువస్తుంది. వారికి, ఇంక్రిమెంట్ యాడ్ అవుతుంది.రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కూడా కలుగుతాయి.అది దారినపోయే పేలపిండిలా ఇచ్చిన హామీ కాదు.అది ప్రభుత్వానికి బరువు కూడా.ప్రస్తుతం ఉద్యోగులకు పూర్తి స్దాయి ఆనందం ఇచ్చే పరిస్ధితి ఉపశమనం ఇచ్చేస్దితి లేనప్పుడు, ఇంకో రకంగా ఏం చేయాలో అది చేశారు. స్టాటిస్టకల్ సమాచారం చూస్తే.. గతంలో మాదిరిగా పెరుగుదల ఉండకపోవచ్చు. ఉండాలని కోరుకోవడం ఇప్పుడున్న పరిస్ధితిలలో అత్యాశ అవుతుంది. ఓవరాల్ గా చూస్తే ఉద్యోగులలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా నిర్ణయాలుతీసుకోవడం జరిగింది.

ఈరోజు జరిగిన ప్రదర్శనలో  ఉద్యోగ సంఘాల నేతలు వ్యక్తిగతంగా విమర్శించినా ముఖ్యమంత్రిగారు దాని గురించి పట్టించుకోవడం లేదు.ఆయన చూస్తుంది ఒక్కటే.. వారికి ఎంతమేలు చేయాలో అంత చేయండి. చర్చలకు పిలవండి అని చెప్పారు.గత రెండు రోజులుగా చూస్తున్నాం కొందరు చొక్కాలు చించుకుంటున్నారు.ఏబిన్ లోగానీ, ఈటివి లోగాని చూస్తున్నాం. గతంలో ఉద్యోగులంటే ఏబిఎన్ రాధాకృష్ణకు ఎలాంటి అభిప్రాయం ఉందో అందరూ చూశారు. ఉద్యోగులను తూలనాడుతూ ప్రజలు కట్టే పన్నులతో ఉద్యోగులకు ఇస్తారా అని చంద్రబాబుతో అనడం చూశాం. అలాంటి వాళ్లు ఈరోజు ఉద్యోగులకు మధ్దతు అంటూ బయల్దేరారు. రాజకీయంగా ఎలా లబ్దిపొందాలా అని వారు చూస్తున్నారు. రాజకీయం చేసి లబ్ది పొందాలని కొన్ని సంఘాల వాళ్లు ట్రైచేస్తున్నారు. వీటన్నింటికీ అవకాశం ఇవ్వడం అవసరమా. 

వారి ఆవేదనను,ఆక్రోశం వినడానికి ప్రభుత్వం సిధ్దంగా ఉంది. ఈరోజు జరిగింది పాజిటివ్ గానే చూస్తున్నాం. గుంపులుగా గుంపులుగా చేరి ఉద్యమించడం వల్ల అరవడం వల్ల ఇష్యూ పక్కకు వెళ్తుంది. అందుకే పదే పదే విజ్ఞప్తిచేస్తున్నాం. ప్రస్తుత కోవిడ్ పరిస్ధితులలో సమ్మెకు వెళ్తే ప్రజాజీవితం ఎఫెక్ట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుంది. ప్రభుత్వ బాధ్యతే కాదు ఉద్యోగుల బాధ్యత కూడా .ప్రజలకు ఎఫెక్ట్ అవుతాయనుకుంటే కొన్ని నియంత్రణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.ఇది బెదిరించడం కాదు.తప్పనిసరి పరిస్దితి.

అలా కాకుండా రాజమార్గంలా చర్చలకు దారి ఉంది.దానికి రమ్మంటున్నాం.మంత్రుల కమిటి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది.సానుభూతితో ప్రవర్తించమంటున్నాం.రెవిన్యూ బాగుంటే జగన్ గారు మరింతగా మేలు చేసేవారు.ఇప్పటికి ఎవరికి జీతాలు తగ్గడం లేదు.కోతలు పడటం లేదు.నష్టం జరగడం లేదు.రికవరీలు కూడా ఉండవు.ఒక వేళ ఉన్నాయని భావిస్తే అవి ఎలాగో చూపమంటున్నాం.ఈ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు మేలు ఎంతగా కలిగిందో చూడమంటున్నాం.

 ఉద్యోగులు సమస్యలు ఉంటే ప్రభుత్వంతో  పరిష్కరించుకోవాలి. ప్రభుత్వం కర్కశంగా, కర్కోటంగా ఉండదు. ఉద్యోగులు కూల్ గా ఆలోచించాలి... చర్చలకు రావాలి. సమ్మె చేస్తే ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. సమ్మెకు వెళితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందే కదా అని అన్నారు. ఆ సందర్భంలో ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఉద్యోగ భద్రత ఎలా క్రియేట్ చేసిందో చూడాలని మరో సారి అప్పీల్ చేస్తున్నాం. చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి సిద్దంగా ఉన్నాం. 

ముందుగా సీఎంతో కాకుండా ... మంత్రుల కమిటీ తో చర్చలు జరపాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హెడ్ కాబట్టి సరాసరి ఆయనతో కాదు కదా, ప్రభుత్వం ప్రతినిధులుగా మంత్రుల కమిటి చర్చలకు సిధ్దంగా ఉంది అని స్పష్టం చేశారు. అలా అంటే ఉద్యోగులందరితో చర్చించలేం కదా..! ఉద్యోగులు తమ వేతనాలు  పెరగాల్సినంత పెరగలేదని అంటే ... అది వేరే విషయం.  రాజకీయనేతల వలే వ్యాఖ్యలు చూస్తే ఉద్యమం పీఆర్సీతో సంబంధం లేకుండా పొలిటికల్ వైపు వెళ్తున్నట్లుంది. 
- ఎవరితోనో కొట్లాడుతున్నట్లు గా ఉద్యోగ సంఘాల నేతల వ్యాఖ్యలున్నాయి అని అన్నారు. వేతనాలు ఒకసారి అకౌంట్లలో పడ్డాక జీవోలు రద్దు చేయాలనడం అర్థం లేని డిమాండ్ అని నేనంటున్నాను. ఉద్యోగ సంఘాలు చేస్తున్న మూడు  డిమాండ్లకు ప్రస్తుతం అర్థం లేదు. ఉద్యమంలో రాజకీయ పార్టీలు ప్రవేశిస్తే, సంబంధం లేని రాజకీయ శక్తులు వస్తాయని, అలా జరిగితే ఉద్యమం పక్కదారి పడుతుందని ...అలా వెళ్లవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.

 ఓట్ల రాజకీయాలను ప్రస్తావిస్తూ కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడటం సరికాదన్నారు. ఈరోజు ప్రోగ్రామ్ అంతలా జరిగిందంటే ప్రభుత్వం ఉద్యోగుల గొంతునొక్కాలనే ప్రయత్నం చేయలేదు కాబట్టే. ఉద్యోగులు అందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఉద్యమం ప్రశాంతంగా ఉంటుందని భావిస్తున్నాం. అయితే భవిష్యత్తులో అసాంఘిక శక్తులు ప్రవేశించే స్కోప్ ఇవ్వవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. 

 చర్చలకు మేం సిధ్దంగా ఉన్నాం. వాళ్లు ఫోన్ నెంబర్లు మార్చుకున్నట్లు ఉన్నారు. మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కోవిడ్ ఉందనే 'చలో విజయవాడ'కు అనుమతి ఇవ్వలేదు అని అన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలు  బ్రహ్మాండంగా  తయారవుతున్నాయని ఉపాద్యాయులకు తెలుసుకదా. పాఠశాలలు బాగుపడితే తమకే మంచిదనే ఉపాద్యాయులకు తెలియదా. అంగన్ వాడీలను కలిపాక ఎస్జీటీ ల నుంచి పదోన్నతులు వస్తాయి. ప్రభుత్వం వచ్చాక లక్షా 30 వేల ఉద్యోగాల కల్పన జరిగింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ని ప్రభుత్వం విలీనం చేసింది. సీఎం ను ఉద్దేశించి,  నష్టం జరిగిందని మాట్లాడుతున్నవారు ఇవన్నీ చూడరా అని ప్రశ్నించారు. సమ్మెతో  ఉద్యోగ సంఘాలు ఏం సాధిస్తారో తెలియడం లేదు. ఇంత జరిగినా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్దంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. చంద్రబాబు గురించి ఈ విషయంలో ఎంత తక్కువగా మాట్లాడితే అంత బాగుంటుంద‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Back to Top