అనంతపురం: జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, ప్రజలు, పశుపోషకులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైయస్ఆర్‌సీపీ ప్రత్యేక దృష్టి సారించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రేటర్ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సాధన రాష్ట్ర కోఆర్డినేటర్ శైలజానాథ్ అధ్యక్షతన అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా టాస్క్‌ఫోర్స్ కోఆర్డినేటర్ నార్పల సత్యనారాయణరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ పీఏసీ సభ్యుడు తలారి రంగయ్య, ఐటీ విభాగం జోనల్ కోఆర్డినేటర్ మంజునాథ్ యాదవ్, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి తరిమెల వంశీ గోకుల్‌రెడ్డి పాల్గొన్నారు. వర్షాభావంతో తీవ్రంగా నష్టపోతున్న రైతాంగం, ప్రజలు, పశువులను ఆదుకునేందుకు పార్టీ తరఫున చేపట్టాల్సిన చర్యలు, ప్రభుత్వంపై తీసుకురావాల్సిన ఒత్తిడిపై సమావేశంలో చర్చించారు. కృష్ణా, తుంగభద్ర జలాలను కేవలం తాగునీటి అవసరాలకే పరిమితం చేయకుండా రైతులకు సాగునీరు, పశువులకు అవసరమైన నీరు అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. రాయలసీమకు, ముఖ్యంగా అనంతపురం జిల్లాకు కృష్ణా, తుంగభద్ర జలాల్లో న్యాయమైన వాటా, అవసరమైన నీటి విడుదలలు, సాగునీటి కేటాయింపులు దక్కేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు రాయలసీమ సాగునీటి హక్కులపై శాస్త్రీయ ఆధారాలు, వాస్తవ గణాంకాలతో ప్రజల్లో అవగాహన కల్పించాలని సమావేశంలో నిర్ణయించారు. అవసరమైన సందర్భంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, అనంతపురం రైతాంగానికి అండగా నిలిచేందుకు వైయస్ఆర్‌సీపీ భవిష్యత్ కార్యాచరణ రూపొందించనుంది.