తిరుపతి: తిరుపతిలో టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. నగరంలోని 50వ డివిజన్ వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్ అనిల్‌పై పచ్చమూకలు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. టీడీపీ నాయకుడు రత్నం, ఆయన కుమారుడు విజయ్, తదితరులు అనిల్, అతని తల్లిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే రుయా ఆసుపత్రికి తరలించారు. భూమన పరామర్శ తిరుపతి రుయా ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న 50 వ డివిజన్ కార్పొరేటర్ బోకం అనిల్ ను వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ` వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అనిల్‌ను హత్య చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నం చేశారు. దళిత కార్పొరేటర్ కు ఈ ప్రభుత్వం లో రక్షణ లేకుండా పోయింది. తిరుపతి లో ఎన్నడు లేని విధంగా హత్య రాజకీయాలు పెంచి పోషిస్తున్నారు. డిప్యూటి మేయర్ ఎన్నికలు నుంచి ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలు హత్య రాజకీయాలు కొనసాగిస్తున్నారు. కార్పోరేటర్ అనిల్ పై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి. పోలీసులు పై నమ్మకం ఉంది, ఎస్పీ పై నమ్మకం ఉంది. లేని పక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. అగ్రవర్ణాలు అధికార పార్టీ నాయకులతో కలిసి దళిత కార్పొరేటర్ పై దాడి చేసి, హత్య చేసేందుకు కుట్ర చేశారు. వీరి చర్యలను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది` అంటూ భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు.