తాడేపల్లి : తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తాడేపల్లిలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్నట్లు వెల్లడించారు. గత రెండేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సజ్జల విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ప్రజలకు జరిగిన అన్యాయం, మోసం, దగా గురించి విస్తృత స్థాయిలో చర్చ జరిగేలా కార్యక్రమాలను రూపొందించినట్లు చెప్పారు. దశలవారీగా కార్యక్రమాలు జూన్ 1న పార్టీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్లు, బుక్‌లెట్లను ఆవిష్కరణ. జూన్ 2న జిల్లా కేంద్రాల్లో జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో, జూన్ 3న నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో పోస్టర్లు, బుక్‌లెట్ల ఆవిష్కరణ జరుగుతుంది. జూన్ 4న మండల కేంద్రాల్లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో, సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్ల ప్రతులను దహనం చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ 8 లేదా 9 తేదీల్లో ప్రభుత్వ వైఫల్యాలు, యువత, మహిళలు, రైతులకు జరిగిన మోసాలపై ఇండోర్ సమావేశాలు నిర్వహిస్తామని, సమావేశాలకు ముందు నల్ల బెలూన్లు ఎగరవేయడం, ఫోటో ఎగ్జిబిషన్ లేదా వీడియో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. జూన్ 12న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయనున్నట్లు చెప్పారు. ప్రజల్లో చర్చనీయాంశంగా మారాలి ఈ కార్యక్రమాలన్నీ ప్రజల్లో చర్చనీయాంశంగా మారేలా నిర్వహించాలని సజ్జల సూచించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన మోసాలు, అమలు కాని హామీలను ప్రతి ఇంటికి చేర్చాలని అన్నారు. ప్రజాసంఘాలు, వివిధ వర్గాల ప్రతినిధులు, కలిసివచ్చే రాజకీయ పార్టీలను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని కోరారు. డీఎస్సీ అంశంపై పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రెండేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన నష్టాలను విస్తృతంగా వివరించగలిగితే ప్రజల మద్దతు మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. డిజిటల్ ప్రచారానికి ప్రాధాన్యం పార్టీ కమిటీలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రెండేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలపై తీర్మానాలు చేయాలని, వాటిని డిజిటల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తి, ఆగ్రహాన్ని సమర్థంగా ప్రతిబింబించగలిగితే ఉద్యమం మరింత విజయవంతమవుతుందని అన్నారు. అందరూ దీనిని సవాల్‌గా తీసుకుని సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహించాలని, నియోజకవర్గ సమన్వయకర్తలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి జూన్ 15 నుంచి జులై 14 వరకు ఎస్‌ఐఆర్‌కు సంబంధించి ఇంటింటి సర్వే కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. బీఎల్ఏలు, బీఎల్‌వోలు సమన్వయంతో పనిచేయాలని, సర్వే ప్రారంభానికి ముందే అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన మ్యాపింగ్ పూర్తి చేయాలని చెప్పారు. అలాగే జూన్ 1న యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న డీఎస్సీ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని, పార్టీ ఐడీ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.