శ్రీకాకుళం జిల్లా: ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేపట్టిన వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌కు పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేయడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ కేసులో భాగంగా పోలీసులు తిలక్‌కు నోటీసులు అందజేసి టెక్కలి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీంతో ఆయన ఈరోజు పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. తిలక్‌కు మద్దతుగా నియోజకవర్గం నలుమూలల నుంచి వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టెక్కలి పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. తమ నాయకుడిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. రాజకీయ వేధింపులు ఆపాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు.