ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి

మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

 విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ అవగాహన కార్యక్రమం 

విశాఖపట్నం: ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ, బూత్ స్థాయి కమిటీలు, బీఎల్‌ఏలు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో దక్షిణ నియోజకవర్గంలోని 27, 31, 35 వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘మై టీడీపీ యాప్’ ద్వారా ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని, ముఖ్యంగా నిర్దిష్ట వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని ఫారం-7 దరఖాస్తులను ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే సరిచేసేలా బీఎల్‌ఏలు పనిచేయాలని సూచించారు. ఓట్ల తొలగింపులు లేదా ఇతర అవకతవకలు గుర్తిస్తే స్థానిక ఎన్నికల అధికారులతో పాటు అవసరమైతే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఓటర్ల జాబితాలో అక్రమంగా ఓట్లు చేర్చడం, తొలగించడం వంటి చర్యలను అడ్డుకోవడంలో బూత్ స్థాయి కమిటీల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా, దానిని దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా ఉన్నందున ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు, జిల్లా నాయకులు, బీసీ సెల్, స్టూడెంట్ సెల్ ప్రతినిధులు, బీఎల్‌ఏలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
 

Back to Top